సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అదనంగా మరో 36 కొత్త పథకాలను ప్రవేశపెట్టామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక, ఆదరణ పథకం, నిరుద్యోగ భృతి, లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ వంటి కొత్త పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని ఆయన అన్నారు. 2018-19 బడ్జెట్ గురించి మంగళవారం యనమల శాసనమండలిలో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత మూడేళ్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది.
బడ్జెట్ పెద్దదైనా ఖర్చుచేయడం లేదని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. విమర్శలు చేసేముందు బడ్జెట్‌లో కేటాయింపులు, జరిగిన ఖర్చులు గమనించాలన్నారు. ప్రవేశ పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు చేశాం. ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లుందని కాగ్ చెప్పింది. రాష్ట్రానికి రెవెన్యూ లోటు రూ.4వేలకోట్లు మాత్రమే ఇవ్వడం దారుణం. రైతులకు, మహిళలకు రుణమాఫీ చేస్తే కేంద్రం ఎందుకు అభ్యంతరం చెబుతోంది. రాష్ట్ర విభజన తర్వాత జనాభా ప్రాతిపదికన అప్పులు పంచడంతో మన రాష్ట్రానికి అప్పులు ఎక్కువచ్చాయి. విభజనకు ముందు చేసిన అప్పుకు రూ.10వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం. భారతదేశంలోని రాష్ట్రాలన్నీ 9శాతం వడ్డీకి అప్పు తెస్తే మన రాష్ట్రం 7.9కే అప్పు తెస్తోంది. 2018-19 లో రైతులకు, మహిళలకు చెల్లించాల్సిన అప్పును మొత్తం తీరుస్తాం..నదుల అనుసంధానం వల్ల రాష్ట్ర వృద్ధి రేటు పెరిగింది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment