తెలుగువారిని క్షేమంగా తీసుకురండి
ఏపీ భవన్ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకురావాలని ఏపీ భవన్ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. నేపాల్ నుంచి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్న తెలుగు యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటిని సీఎం కోరినట్లు తెలిపింది.
నేపాల్‌లోని బాధితుల వివరాలు సేకరించడానికి అక్కడి రాయబారి కార్యాలయంతో, విదేశాంగ శాఖ అధికారులతో సంప్రదింపులు జరపాలని సూచించినట్లు పేర్కొంది.
10 విమానాల్లో తరలింపు ఏర్పాట్లు
అమలాపురం: నేపాల్‌లో చిక్కుకుపోయిన 152 మందిని గుర్తించి స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. అమలాపురంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, ఇద్దరు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కఠ్మాండు నుంచి 10 ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేశామని చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 52 మంది, తూర్పు గోదావరికి చెందిన ఎనిమిది మంది, కృష్ణా జిల్లాకు చెందిన 21 మంది, నెల్లూరుకు చెందిన 40 మంది, విశాఖకు చెందిన 15 మంది, శ్రీకాకుళానికి చెందిన పది మంది నేపాల్‌లో చిక్కుకున్నారని తెలిపారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, బాధితుల వివరాల కోసం 040-23456005, 23451819 నంబర్లను సంప్రదించాలని కోరారు.