ప్రభుత్వ కార్యాలయం (ఫైల్)
సాక్షి, అమరావతి: బదిలీల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న వాణిజ్య శాఖ ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. గతేడాది జీఎస్‌టీ అమలుకు ఇబ్బందులొస్తాయని భావించిన ప్రభుత్వం వీరి బదిలీలను నిలిపివేసింది. ఈ ఏడాదైనా బదిలీలు చేస్తారు కదా అని ఎదురుచూస్తున్న వారు.. సాధారణ బదిలీలకు అవకాశం ఇవ్వకుండా పరిమితులు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పరస్పర అంగీకారం, రిక్వెస్ట్ బదీలకు మాత్రమే అనుమతిస్తూ జీవో ఇవ్వడంపై మండిపడుతున్నారు.
ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఎత్తుగడ!
వాణిజ్య శాఖలో 557 గెజిటెడ్ ఆఫీసర్లు, 102 సర్కిల్స్‌లోని సిబ్బందిలో 80 శాతం మందికిపైగా ఉద్యోగులు అయిదేళ్లు దాటినా ఒకే చోట పనిచేస్తున్నారు. ఇలా ఒకే వ్యక్తి ఒకేచోట ఎక్కువ కాలం పనిచేస్తే డీలర్లతో పరిచయాలు పెరిగి అది వసూళ్లపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఖర్చులు టీఏ, డీఏ ఖర్చులు తగ్గించుకోవడానికే ఈ ఎత్తుగడ వేసిందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అటు పిల్లల చదువుల పరంగా, ఇటు ఆర్థికంగా నష్టపోతున్నారని వాణిజ్య శాఖ ఉద్యోగ సంఘం చెబుతోంది.
కొంతమంది గ్రామీణ ప్రాంతానికి బదిలీ అయి, పిల్లల చదువుల కోసం చాలామంది కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. కానీ గడిచిన నాలుగేళ్లుగా 20 శాతానికి మించి ఉద్యోగులకు బదిలీలు చేయకపోవడం, గతేడాది అసలు పూర్తిగా లేకపోవడంతో వీరు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్సు ఎక్కువని, అలాగే అమరావతి పరిధిలో పనిచేసే వారికి సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(సీసీఏ) అదనంగా లభిస్తుందని.. అయితే గ్రామీణ ప్రాంతంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారని చెబుతున్నారు.
ఆర్థిక మంత్రిని కలుస్తాం..
వాణిజ్య శాఖలో సాధారణ బదిలీలకు అనుమతించాలని త్వరలోనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు, ఆ శాఖ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆల్ ఇండియా వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్ సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణ బదిలీలకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment