
సాక్షి, అనంతపూర్: ప్రేమించిన యువకుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయినందుకు గాను ఓ యువతి పట్ల గ్రామపెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. పంచాయతీ పెట్టి.. కర్రలతో ఆ యువతిని కొడ్తూ, కిందపడేసి తంతూ చిత్ర హింసలకు గురి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనంతపురం జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. గుమ్మఘట్ట మండలం కేపీదొడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమికులు పది రోజుల క్రితం గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఇరువురి తల్లిదండ్రులు వారిని ఊరికి రప్పించి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.
పంచాయతీ మాట విననందుకు గ్రామ పెద్ద ఆమెపై విరుచుకుపడ్డాడు. ఇష్టారాజ్యంగా చెంపదెబ్బలు కొట్టాడు.. పదేపదే కాలితో తన్నాడు.. పక్కనే ఉన్న కర్రతో పశువును బాదినట్లు చావబాదాడు. యువకుడిని కూడా చితకబాదాడు. అక్కడ సుమారు వంద మందికి పైగా ఉన్నా.. ఆ దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప ఏ ఒక్కరూ ఆపటానికి ప్రయత్నించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాలికను అంత రాక్షసంగా కొడుతున్న దృశ్యాలను చూసిన వారంతా అయ్యో పాపం అంటున్నారు.
ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా దీని గురించి తమ దృష్టికి రాలేదన్నారు. వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు రక్షణ కల్పిస్తామన్నారు. ప్రస్తుతం ఓ మహిళా కానిస్టేబుల్‌ని బాధిత యువతి దగ్గరకి పంపి, సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment