* భవనాలు, భూమి, ఇనిస్టిట్యూషన్లలో మార్పులకు, వినియోగం మార్పిడికి అనుమతి నిరాకరణ
* అథారిటీ కమిషనర్ అనుమతి తీసుకోవాలి
* అనుమతి ఇవ్వవచ్చు, తిరస్కరించవచ్చు, అనుమతి ఇచ్చి మధ్యలో నిలిపేయవచ్చు
* ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష, ఆ భూమి విలువలో 20 శాతం జరిమానా
* రోజూ ఉల్లంఘిస్తే రోజు వారీ.. భూమి విలువలో ఒక శాతం జరిమానా
* భూమి, భవనాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటే అర్నెల్లు జైలు, జరిమానా
* స్థానిక సంస్థలు, ప్రభుత్వ శాఖలకు అనుమతించే అధికారం లేదు
* కోర్టుల జోక్యం ఉండదు.. ట్రిబ్యునల్‌కే కమిషనర్ ఆదేశాలే సుప్రీం
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని ప్రాంతంలో ఇకనుంచి కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సీఆర్‌డీఏ) అనుమతి లేనిదే ఏదీ చేయరాదు. సొంత గృహాల్లో, భవనాల్లో ఎటువంటి మార్పులు చేయరాదు. సొంత భూమిలోనూ అభివృద్ధి పనులు చేపట్టరాదు. సీఆర్‌డీఏకి సం బంధించి ఇటీవల మంత్రిమండలి ఆమోదించిన బిల్లులోని సెక్షన్ 87లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భవనాల్లోగానీ, సొంత స్థలంలోగానీ ఎటువంటి అభివృద్ధి పనులు చేయాలన్నా తప్పనిసరిగా అథారిటీ కమిషనర్ అనుమతి తీసుకోవాలని సెక్షన్ 87(1) (ఏ)లో పేర్కొన్నారు.
రాజధాని ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి పనులకైనా అనుమతించే అధికారం స్థానిక సంస్థలకు, ప్రభుత్వశాఖలు, ఏజెన్సీలకు ఉండదని స్పష్టం చేశా రు. అథారిటీ నిబంధనలకు విరుద్ధమైన పనులను రోజువారీ చేస్తుంటే రోజువారీ జరి మానా విధించనున్నట్లు తెలిపారు. భూమి విలువలో ఒక శాతం మేర రోజువారీ జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఏదైనా భవనం, భూమిలో మార్పులేకుండా నిర్వహణ పనులను కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలియజేసి చేసుకోవచ్చు. వ్యవసాయ అవసరాలకు బావులు, బోర్లు, అలాగే మెటల్ లేని రోడ్ల నిర్మాణాలను కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలిపి చేసుకోవచ్చు. బిల్లులోని ముఖ్యాంశాలు ఇవి.
* నూతన రాజధానిలో ప్రాదేశిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఏరియా అభివృద్ధి, జోనల్ అభివృద్ధి, టౌన్ ప్లానింగ్ అభివృద్ధి ప్రణాళికలు, ల్యాండ్ పూలింగ్ పథకం పూర్తయ్యేవరకు ఏ వ్యక్తి, ఏ సంస్థ కూడా భూమిలో ఎటువంటి అభివృద్ధి పనులను చేపట్టరాదు.
* ప్రభుత్వ ప్రణాళికలు పూర్తయిన తరువాత ఏ వ్యక్తిగానీ, సంస్థగానీ అభివృద్ధి పనులు చేపట్టాలంటే అథారిటీ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. లే అవుట్స్, ప్లాట్ల నిర్మాణాలు, పునర్నిర్మాణం, అదనపు నిర్మాణాల అభివృద్ధి పనులు చేయాలంటే ప్లాన్లు, ఓనర్‌షిప్ డాక్యుమెంట్లతో సహా కమిషనర్ అనుమతికి దరఖాస్తు చేసుకోవాలి. రాజధానిలోని ప్రభుత్వ ప్రణాళికలకు ఎటువంటి అవాంతరాలు లేకపోతే అటువంటి అభివృద్ధి పనులకు ఎటువంటి షరతులు లేకుండా లేదా షరతులతో అనుమతి ఇస్తారు. ఒకవేళ అనుమతి తిరస్కరిస్తే ఎటువంటి పరిహారం చెల్లించరు. తొలుత అనుమతిచ్చి మధ్యలో రద్దుచేసే అధికారం కమిషనర్‌కు ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేసే లెసైన్స్ డెవలపర్ 15 శాతం స్థలాన్ని అథారిటీకి తనఖా పెట్టాలి. అనుమతులకు, నిబంధనలకు లోబడి చేయకపోతే ఆ 15 శాతం స్థలాన్ని అథారిటీ విక్రయిస్తుంది.
* అనుమతించిన లే అవుట్ పనులు, లేదా నిర్మాణాలు, సివిల్ పనుల్లో ఏమైనా వ్యత్యాసాలుంటే సవరించిన ప్రణాళికలకు కమిషనర్ అనుమతి పొందాలి. అనుమతించిన ప్రణాళికలకు, అభివృద్ధి పనులకు విరుద్ధంగా ఏ వ్యక్తి అయినా లేదా ప్రభుత్వ శాఖలైనా పనులను చేపడితే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ నిర్ధారించే ఆ భూమి విలువలో 20 శాతం జరిమానా విధిస్తారు. అయినా సరే నిర్మాణాలను రోజువారీ కొనసాగిస్తే రోజువారీ జరిమానాను కూడా విధించనున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ నిర్ధారించే ఆ భూమి విలువలో ఒక శాతం రోజువారీ జరిమానాగా విధించనున్నారు. అథారిటీ చట్టానికి విరుద్ధంగా భవనాలు, భూములు విక్రయిస్తే మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఆ భూమి విలువలో 20 శాతం జరిమానా విధిస్తారు.
* అథారిటీ చట్టం ప్రకారం నిర్ధారించిన వ్యక్తిని భూమి, భవనాల్లోకి అనుమతించకుండా అడ్డంకులు సృష్టిస్తే అలాంటి వారికి ఆరునెలల జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించనున్నారు.
* అనధికారిక నిర్మాణాల పనులను నిలుపుదల చేసే అధికారం అథారిటీ కమిషనర్‌కు అప్పగించారు. మధ్యలోనే నిర్మాణ పనులను నిలుపుదల చేయడంతో పాటు పోలీసుల సహకారంతో ఆ నిర్మాణ ప్రాంతం నుంచి పనులు చేసే కూలీలను, యజమానిని కమిషనర్ తొలగించవచ్చు. అనధికారిక నిర్మాణాలకు సీల్‌చేసే అధికారం కూడా కమిషనర్‌కు ఉంటుంది. నిర్మాణాల కూల్చివేతకు సీల్‌ను కమిషనర్ తెరవవచ్చు. కమిషనర్ ఆదేశాలపై అప్పీల్ చేయాలంటే ఏడు రోజుల్లోగా బిల్లులోని 97వ సెక్షన్ కింద ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌ను మాత్రమే ఆశ్రయించాలి. కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై కోర్టు లు ఎటువంటి సూట్, అప్పీల్స్‌ను పరిగణనలోకి తీసుకోరాదు. కమిషనర్ ఆదేశాలే సుప్రీంగా ఉండేందుకే కోర్టుల జోక్యం లేకుండా చట్టంలో సెక్షన్‌ను పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
రాజధాని ప్రాంతంలో ఆంక్షల కత్తి
Published Mon, Dec 1 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement
Advertisement