
కుటుంబానికి లక్షన్నర మాఫీ
రైతుల వ్యవసాయ రుణాలు ఒక్కొక్క కుటుంబానికి లక్షన్నర వరకు మాత్రమే మాఫీ చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.
రుణాల మాఫీపై బాబు ప్రకటన
ఒక కుటుంబం పంట, బంగారం రుణాలన్నీ కలిపి లక్షన్నర వరకే పరిమితం
గత మార్చి వరకు ఉన్న రుణాలు మాఫీ..
రుణాలు చెల్లించిన వారికి కూడా వర్తింపు
డ్వాక్రా సంఘాలకు లక్ష వరకు రుణ మాఫీ.. చేనేత, ఎస్సీ రుణాలు కూడా
రుణమాఫీ ఎప్పుడు అమల్లోకి వస్తుందో స్పష్టతనివ్వని చంద్రబాబు
నిధుల సమీకరణ జరిగిన దానినిబట్టి అమలు చేస్తామని వెల్లడి
నిధుల సమీకరణకు కొత్తగా మరో కమిటీ
మార్కెట్ కమిటీల రద్దుకు అర్డినెన్స్ తేవాలని కేబినెట్ నిర్ణయం
హైదరాబాద్: రైతుల వ్యవసాయ రుణాలు ఒక్కొక్క కుటుంబానికి లక్షన్నర వరకు మాత్రమే మాఫీ చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఒక కుటుంబంలోని సభ్యులు పంట, బంగారం రుణాలు ఎన్ని బ్యాంకుల్లో, ఎన్ని ఖాతాల ద్వారా తీసుకున్నప్పటికీ.. మొత్తం లెక్క తేల్చి అందులో లక్షన్నరకు మాత్రమే మాఫీ వర్తింప జేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఉన్న వ్యవసాయ రుణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. మాఫీ అమలయ్యే సమయానికి రుణాలు చెల్లించిన రైతులకు కూడా దీనిని వర్తింపజేస్తామన్నారు. ఒకే భూమిని తాకట్టు పెట్టి యజమాని, కౌలు రైతు ఇద్దరూ రుణం తీసుకుని ఉంటే.. కౌలు రైతు రుణమాఫీకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. లక్ష వరకు డ్వాక్రా, చేనేత, ఎస్సీ రుణాలను కూడా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అయితే రుణ మాఫీ ఎప్పుడు అమలులోకి వస్తుందన్న దానిపై ఆయన పూర్తి స్పష్టత ఇవ్వలేదు. సోమవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై రైతు రుణాల మాఫీతో పాటు పలు కీలకాంశాలపై చర్చించింది. అనంతరం మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, నారాయణ, రావెల కిశోర్‌బాబు, ప్రభుత్వ సలహాదారులు పరకాల ప్రభాకర్, కుటుంబరావులతో కలిసి చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద రుణ మాఫీకి అవసరమైన ఆదాయ వనరులు లేని కారణంగా మాఫీ సొమ్మును ప్రభుత్వం తిరిగి బ్యాంకుకు చెల్లించే ఏర్పాట్లపై అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. రుణమాఫీకి అవసరమమైన నిధుల సమీకరణ కోసం ఒక కమిటీని నియమిస్తున్నట్టు తెలిపారు. నిధుల సమీకరణ జరిగిన దానిని బట్టి మాఫీ అమలు చేస్తామన్నారు. అన్ని రకాల రుణ మాఫీకి గాను రాష్ట్ర ప్రభుత్వానికి రూ.37,900 కోట్లు వరకు అవసరమని చెప్పారు. ఆర్ధిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) ప్రకారం రాష్ట్రానికి కేవలం రూ.15,539 కోట్లు మాత్రమే రుణంగా తీసుకునే వెసులుబాటు ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇతరత్రా అవకాశాలను పరిశీలించినప్పటికీ రూ.25 వేల కోట్ల నిధుల సమీకరణకు మాత్రమే అవకాశం ఉందని అన్నారు.
రీషెడ్యూల్‌పైనా స్పష్టత రావాలి
రుణ మాఫీకి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ ఆర్బీఐ తగిన విధంగా స్పందించలేదని చంద్రబాబు చెప్పారు. రూ.12 వేల కోట్ల రుణాలను రీ షెడ్యూల్ చేయడానికి మాత్రమే అంగీకరించిందన్నారు. వాటినీ ఏడేళ్ల కాలంలో చెల్లించేందుకు అవకాశం కోరినప్పటికీ మూడేళ్లలోనే చెల్లించాలన్న నిబంధన పెడుతోందని, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. రుణమాఫీకి అవసరమైన నిధుల కోసం.. పోలీసులు స్వాధీనం చేసుకున్న 15 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం వేలం వేయడంతో పాటు.. అటవీ ప్రాంతంలో ఉన్న ఎర్రచందనం మొత్తాన్ని బ్యాంకులకు ష్యూరిటీగా ఉంచాలనే ఆలోచన చేస్తున్నట్టు సీఎం తెలిపారు. గనులు, ఇసుక రీచ్‌ల నుంచి వచ్చే ఆదాయూన్ని ఎస్క్రో ఖాతాకు జమ చేసి, ఆ డబ్బు రుణమాఫీ అప్పుకు జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు.
96.27% రైతులకు పూర్తిగా రుణమాఫీ!
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 96.27 శాతం మంది రైతులకు పూర్తిగా రుణమాఫీ జరుగుతుందని.. మిగిలిన 3.73 శాతం మంది రైతులకు లక్షన్నర మేర లబ్ది కలుగుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రుణాలు తీసుకున్న రైతులు మొత్తం 85 లక్షల మంది ఉన్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా మాఫీ అయ్యే మొత్తం ఎంతన్న లెక్క తేల్చడానికి బ్యాంకర్ల కమిటీ వద్దే స్పష్టమైన సమాచారం లేదని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. రాష్ట్రంలో 7.60 లక్షల వరకు ఉన్న డ్వాక్రా సంఘాలకు ఒక్కొక్క లక్ష చొప్పున రూ.7,600 కోట్ల మేరకు మాఫీ చేస్తున్న సొమ్మును ఆ సంఘాల సీడ్ క్యాపిటల్‌గానో, మూలనిధిగానో జమ చేస్తామన్నారు. చేనేత కార్మికులు, ఎస్సీలకు చెందిన రుణాల మొత్తం ఎంతన్న దానిపై ప్రభుత్వానికి సమాచారం లేకపోయినప్పటికీ ఆ రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వ సాహసోపేత నిర్ణయమని, దేశంలో అతి పెద్ద మాఫీ ఇదే అవుతుందని అన్నారు. కాగా, విద్యార్థుల స్థానికతపై నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరికీ అధికారాలు లేవని, వాటికి కొన్ని చట్టాలు ఉన్నాయని బాబు చెప్పారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తక్షణమే జరిగేలా జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతున్నట్టు తెలిపారు.
సంక్షేమానికి తాత్కాలిక విరామం!
హైదరాబాద్: వ్యవసాయ రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం దాని అమలు సాకుతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించాలని చూస్తోంది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో రుణమాఫీ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రుణ మాఫీపై రైతులు అనేక ఆశలు పెట్టుకున్నారని, ఎప్పుడు అమలవుతుందా? అని ఆతృతతో ఎదురుచూస్తున్నారని ఈ సమయంలో ఇంకా ఆలస్యం అయితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని మంత్రులు చెప్పారు. ప్రస్తుతం ఈ ఒక్క హామీపైనే రైతులతో పాటు ప్రజలందరి దృష్టీ ఉందన్నారు. రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే నిధుల సమీకరణ ఎలా అన్నదే సమస్యగా మారిందని బాబు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇప్పటికే శ్వేతపత్రాల ద్వారా వివరించి ఉన్నందున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. సంక్షేమ పథకాలకు విరామం ప్రకటించినా ప్రజలు అర్థంచేసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. అయితే ఏ ఏ పథకాలను నిలిపివేయాలన్న దానిపై స్పష్టత రాలేదు. భూములు, ఆస్తుల తనఖా ద్వారా రుణాల సేకరణపై చర్చ సాగినా అది వెసులుబాటు ఇచ్చేది కాదన్న అభిప్రాయానికి వచ్చారు. గనులు, ఎక్సయిజ్, రవాణా సుంకాల ద్వారా వచ్చే మొత్తంలో కొంత శాతాన్ని రుణమాఫీకి బదలాయించాలని అభిప్రాయపడ్డారు. లాభాల్లో ఉన్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని బ్యాంకులకు ష్యూరిటీగా చూపించి రుణాల మాఫీకి అంగీకరింపచేయవచ్చన్న చర్చ సాగించారు. బాండ్ల జారీపైనా చర్చించినా దాన్ని చివరి ప్రత్నామ్నాయంగా తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారు.