సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని లక్షల మంది కౌలు రైతులకు మేలు చేకూర్చే చరిత్రాత్మక బిల్లును శాసనసభ గురువారం సభ్యుల హర్షధ్వానాల మధ్య ఆమోదించింది. ‘ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల బిల్లు–2019’పై సుదీర్ఘ చర్చ అనంతరం రెండు సవరణలతో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలోని 15.36 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరుగుతుంది. భూ యజమానితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద ఇచ్చే రూ.12,500 పెట్టుబడి సాయం అందుతుంది. భూ యజమానులకు ఈ బిల్లుతో ఎటువంటి నష్టం ఉండదు.
అడ్డుకోవడం సరికాదన్న సభాపతి
టీ విరామం అనంతరం సభ ప్రారంభమయ్యాక ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పంట సాగుదారు హక్కుల బిల్లు–2019ని సభలో చర్చకు ప్రవేశపెట్టారు. అయితే కౌలు రైతుల కోసం అద్వితీయమైన బిల్లును తెస్తున్న సమయంలో విపక్ష సభ్యుల తీరు సరిగా లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పదేపదే విజ్ఞప్తి చేసినా వినకపోవడం, వాదోపవాదాలతో అడ్డుతగలడంతో విపక్ష సభ్యులను సస్పెండ్ చేయక తప్పడం లేదన్నారు. ఎవరి కోసమో సభను తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేనన్నారు. శాసనసభను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రయోజనం కలిగించే అంశాన్ని అడ్డుకోవడం మంచిది కాదని సూచించారు. చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా బిల్లుల్ని ఆమోదిస్తున్నారని ఇతర రాష్ట్రాలు కూడా ప్రశంసిస్తుంటే చర్చ జరగకుండా అడ్డుపడటం మంచి సంప్రదాయం కాదన్నారు.
కౌలురైతుకు పంట రుణం, బీమా, పెట్టుబడి సాయం, పరిహారం..
అనంతరం మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ వ్యవసాయ రంగం తీవ్ర నిరాశ, నిస్పృహలతో మునిగి ఉన్న తరుణంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ముదావహమన్నారు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 5 లక్షల మంది కౌలు రైతులకు మాత్రమే అరకొరగా సాయం అందుతోందన్నారు. భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం కలుగకుండా కౌలు రైతులకు కేవలం 11 నెలల కాలానికి పంట మీద మాత్రమే హక్కు కల్పించేలా ఈ బిల్లును తెచ్చినట్లు వివరించారు. భూ యజమానులకు ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. పాత కౌల్దారి చట్టం విఫలమైన నేపథ్యంలో కొత్త చట్టం అవసరమైందని వివరించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కౌలు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుని వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. ఈ బిల్లుతో కౌలు రైతులకు కూడా పంట రుణం, పంటల బీమా, పెట్టుబడి సాయం, ఒప్పంద కాలంలో పంట నష్టపోతే పరిహారం తదితరాలు అందుతాయన్నారు. తమకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు కౌలురైతులు కృతజ్ఞతలు చెబుతున్నారని తెలిపారు. సభ్యుల ప్రసంగాల అనంతరం ఈ బిల్లు ఆవశక్యత, ముఖ్యాంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభకు వివరించారు. అనంతరం రెండు సవరణలతో బిల్లును సభ ఆమోదించింది.
సభలో స్పందనలు...
‘పొరుగు రాష్ట్రంలో మాదిరిగా కాకుండా ఆచరణాత్మక దృక్పథంతో రూపొందించిన ఈ బిల్లు చరిత్రాత్మకం. వ్యవసాయం మళ్లీ నిలదొక్కుకునేందుకు, రైతులను అప్పులు ఊబి నుంచి తప్పించేందుకు ఈ బిల్లు తోడ్పడుతుంది. 1977 ప్రొహిబిషన్ ఆఫ్ టాన్స్‌ఫర్ (పీవోటీ) యాక్ట్ ప్రకారం భూములు ఇచ్చిన వారికి కూడా ప్రభుత్వ రాయితీలు అందేలా చట్టాన్ని మార్చాలి’
– సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు
‘సాగుదార్లలో 70 శాతం మంది కౌలు రైతులే. వారికి సాయం అందేలా ఈ బిల్లు ఉపయోగపడుతుంది. రైతుల్లో నైపుణ్యాభివృద్ధికి కృషి చేయాలి. రైతు నికరాదాయం పెరిగినప్పుడే వృద్ధి రేటు పెరుగుతుంది. అగ్రిమిషన్ వైస్ చైర్మన్‌గా అనుభవజ్ఞుడైన రైతు నాయకుడు ఎంవీఎస్ నాగిరెడ్డిని నియమించడాన్ని స్వాగతిస్తున్నాం’
– జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను
‘వ్యవసాయానికి నూతన జవసత్వాలు కల్పించేందుకు ఈ బిల్లు తోడ్పడుతుంది. నకిలీ కౌలు ఒప్పందాలను నిరోధించాలి. 1977 పీవోటీ యాక్ట్‌ను సవరిస్తే అనేక నష్టాలుంటాయి’
– కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి
‘ఈ బిల్లు చట్టమైతే పంటసాగుదార్లకు చుట్టం అవుతుంది’
– పీడిక రాజన్న దొర
‘కౌలు రైతులకు ఈ బిల్లు ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు’
–పామర్రు ఎమ్మెల్యే అనిల్‌కుమార్
‘ఏ ముఖ్యమంత్రికీ రాని ఆలోచన మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చింది. కౌలు రైతులకు మేలు చేసే ఈ బిల్లును ఆమోదించడం ద్వారా రాష్ట్ర వ్యవసాయ రంగంలో నూతనాధ్యాయం మొదలవుతుంది. భూ యజమానులు పెద్ద మనసుతో అర్థం చేసుకుని కౌలురైతులకు అండగా నిలవాలి’
– ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, కొత్తపేట
Comments
Please login to add a commentAdd a comment