ఐటీ వృద్ధికి.. పీపీపీ | Andhra Pradesh New IT Policy Revealed | Sakshi
Sakshi News home page

ఐటీ వృద్ధికి.. పీపీపీ

Published Wed, Sep 10 2014 3:14 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

ఐటీ వృద్ధికి.. పీపీపీ - Sakshi

ఐటీ వృద్ధికి.. పీపీపీ

* చంద్రబాబు సర్కార్ కొత్త ఐటీ విధానం
* రాయితీలు, పన్ను మినహాయింపులతో ఊతం
* రూ.30 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం
* ఎలక్ట్రానిక్ హబ్‌గా విశాఖ.. కాకినాడలో హార్డ్‌వేర్ పార్క్
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2014-20 సంవత్సరాలకు కొత్త ఐటీ పాలసీని ప్రకటించింది. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమాభివృద్ధికి విధివిధానాలను, చర్యలను వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంతో పాటు, రాయితీలు ఇస్తామని, మౌలిక సదుపాయాల కల్పలనలో మెరుగైన విధానాలు అనుసరిస్తామని పేర్కొంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐటీ విద్యకు బీజం వేయాలని భావించింది. 2020 సంవత్సరం నాటికి రూ.30 వేల కోట్లకు పైగా (5 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు ఆకర్షించాలని, 4 లక్షల కొత్త ఉద్యోగాలను ఐటీ సెక్టార్‌లో అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 వేల కంపెనీలు, ఔత్సాహికులను తయారు చేయడం ఐటీ పాలసీ లక్ష్యం. 10 లక్షల చదరపు అడుగుల్లో ఐటీని అభివృద్ధి చేస్తారు. ఈ దిశగా 18 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విధానపత్రంలో స్పష్టం చేసింది.

వచ్చే ఐదేళ్ళలో రూ. 30 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఎలక్ట్రానిక్ హబ్‌లు, హార్డ్‌వేర్ పార్కులు, జోన్ లు ఏర్పాటు చేసి, ఏపీఐఐసీ పర్యవేక్షణలో మౌలిక వసతులను కల్పిస్తారు. వీటికి ఐదేళ్ళ పాటు విద్యుత్ రాయితీలు, మరో ఏడేళ్ళ పాటు అమ్మకం పన్ను మినహాయింపు ఇస్తారు.

అదే విధంగా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తారు. వ్యాట్ నుంచి, రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఉంటుంది. మెగా ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని షరతులకు లోబడి కేటాయిస్తారు. ఈ ప్రాజెక్టులు ఐదేళ్ళలో కనీసం 2 వేల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. 20 ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసి, 50 శాతం సబ్సిడీ అందిస్తారు. వీటికి కావాల్సిన అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో క్లియర్ చేస్తారు. గృహ సంబంధమైన ఐటీ ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు.
 
మెగా ఎలక్ట్రానిక్ హబ్‌లు
విశాఖపట్నాన్ని మెగా ఎలక్ట్రానిక్ హబ్ గా గుర్తించారు. ఐటీ ఉత్పత్తుల ప్రోత్సాహం, అభివృద్ధి కోసం ఇక్కడ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులన్నీ 4 వారాల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు. కాకినాడలో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్క్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తారు. విశాఖపట్నం-చెన్నై కారిడార్‌ను ఏర్పాటు చేసి, అవసరమైన ఉపకరణాలు తెప్పించుకునే వీలు కల్పిస్తారు.

విజయవాడ, విశాఖపట్నంలలో కొత్తగా ఎలక్ట్రానిక్ బజార్లను విశాలమైన స్థలంలో ఏర్పాటు చేయాలని, అందులో కొత్త ఉత్పత్తులను అమ్మకానికి ఉంచాలని ప్రతిపాదించారు. పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం పలు దేశాల ప్రతినిధులను రప్పించి రోడ్ షోలు ఏర్పాటు చేస్తారు. ఐటీ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు ఐటీఐ, పాలిటెక్నిక్‌లలో ప్రత్యేక స్కిల్ డెవలప్‌మెంట్ పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తారు. 2017 నాటికి ఏటా 8 వేల మంది విద్యార్థులను ఐటీ రంగానికి అందించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement