సాక్షి, అమరావతి: షిఫ్ట్‌లు.. 8 గంటల పని వేళతో సంబంధం లేకుండా శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడుతుంటారు పోలీసులు. దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు రోజుకు పది గంటల పైనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్క నాగాలాండ్‌లో మాత్రమే రోజుకు 8 గంటలు పనిచేస్తుంటే.. ఒడిశాలో ఏకంగా 18 గంటల పాటు విధుల్లోనే ఉంటున్నారు. ఒడిశా తరువాత 17 గంటలపాటు పనిచేస్తున్న పంజాబ్ పోలీసులు రెండో స్థానంలో ఉంటే.. రోజుకు 16 గంటల పనితో ఏపీ పోలీసులు మహా పనిమంతులుగా నిలుస్తున్నారు. తెలంగాణ, బీహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పోలీసులు సైతం 16 గంటలపాటు విధుల్లో ఉంటున్నారు. మూడు రాష్ట్రాల పోలీసులు 14 గంటలు, రెండు రాష్ట్రాల్లో 13 గంటలు, మూడు రాష్ట్రాల్లో 12 గంటలు, రెండు రాష్ట్రాల్లో 11 గంటలపాటు పోలీసులు పని చేస్తున్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి.
వీక్లీ ఆఫ్‌తో ఊరట
తాను అధికారంలోకి వచ్చాక పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తానని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ మాట నిలబెట్టుకోవడంతో ఏపీ పోలీసులకు ఊరట లభించింది. ఈ ఏడాది జూన్ నుంచి అమల్లోకి వచ్చిన వీక్లీ ఆఫ్ విధానం కానిస్టేబుల్ స్థాయినుంచి అధికారుల వరకు వర్తించేలా చర్యలు చేపట్టారు. దీంతో సరిపెట్టకుండా సీఎం ఆదేశాలతో పోలీసులకు ఆరోగ్య భద్రత, వారి కుటుంబాల సంక్షేమం వంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఏపీ పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపినట్టైంది.
Comments
Please login to add a commentAdd a comment