హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఈ నెల నుంచే పదవీ విరమణ వయస్సు పెంపు వర్తించనుంది. చంద్రబాబు సంతకం చేసిన నోట్ ఫైలుపై జూన్ నెల నుంచి పదవీ విరమణ వయస్సు పెంపు వర్తిస్తుందని ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులందరూ ఈ పెంపువల్ల మరో రెండు సంవత్సరాల పాటు ఉద్యోగంలో కొనసాగనున్నారు. అయితే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగవర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పదవీ విరమణ తేదీ దగ్గర పడుతున్న వారిలో పెంపు పట్ల సంతోషం వ్యక్తం అవుతుండగా మధ్య వయస్కులు, యువకుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
* పదవీ విరమణ వయస్సు పెంపు వల్ల మధ్య వయసు ఉద్యోగులకు పదోన్నతుల రావడంలో ఆలస్యం జరుగుతుందని, దీనివల్ల ఆ మేరకు ఆర్థిక ప్రయోజనాలను నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.
* రాష్ట్ర విభజన అనంతరం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పదవీ విరమణ వయస్సు పెంపు వల్ల చిక్కులు తప్పవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయించారు. ఈ తాత్కాలిక కేటాయింపుల సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు సాధ్యపడదని న్యాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
* ఉద్యోగుల శాశ్వత పంపిణీ పూర్తయిన తరువాతనే పదవీ విరమణ వయస్సు పెంపు అమలు సాధ్యపడుతుందని న్యాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పదవీ విరమణ పెంపునకు 1984 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రెగ్యులేషన్ ఆఫ్ పదవీ విరమణ చట్టంలో సవరణలు తీసుకురావాల్సి ఉంటుందని న్యాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
* రాష్ట్ర విభజన నేపథ్యంలో త్వరలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ వయస్సు పెంచకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పదవీ విరమణ వయస్సు పెంచడంవల్ల సమస్యలు తప్పవని అధికార వర్గాలు చెబుతున్నాయి.
* ఈ ఆప్షన్ వల్ల త్వరలో పదవీ విరమణ చేసే ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడానికి వీలుకలుగుతుంది. అయితే పదవీ విరమణ వయస్సును రెండేళ్ల పాటు పెంచడంతో వారు కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే పనిచేయడానికి ఆప్షన్ ఇస్తారు. అలాగే త్వరలో పదవీ విరమణ అయ్యే తెలంగాణకు చెందిన ఉద్యోగులు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయడానికి ఆప్షన్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఈ నెల నుంచే ‘వయస్సు పెంపు’
Published Tue, Jun 10 2014 10:48 AM | Last Updated on Sat, Jul 28 2018 2:46 PM
Advertisement