సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈమేరకు రాష్ట్ర సబార్డినేట్ నిబంధనల్లో పొందుపరుస్తూ పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం, జీతాల చెల్లింపు, పదోన్నతులు, క్రమశిక్షణా చర్యలు తదితర అంశాలను పురపాలక శాఖ సర్వీసు నిబంధనల్లో పొందుపరిచారు. వార్డు సచివాలయ ఉద్యోగులు జిల్లా యూనిట్‌గా పనిచేస్తారు.
ఇవీ సర్వీస్ నిబంధనలు...
- మినిస్టీరియల్ విభాగం 1వ కేటగిరీలో వార్డు పరిపాలన కార్యదర్శి, 2వ కేటగిరీలో వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి ఉంటారు. వీరికి పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ అపాయింట్‌మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు.
- ప్రజారోగ్య విభాగం ఒకటో కేటగిరీ కింద వార్డు పారిశుధ్య, పర్యావరణ కార్యదర్శి గ్రేడ్–2గా ఉంటారు. వీరికి పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ అపాయింట్‌మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు.
- ఇంజనీరింగ్ విభాగం ఒకటో కేటగిరీ కింద వార్డు వసతుల కార్యదర్శి గ్రేడ్–2 ఉంటారు. వీరికి ప్రజారోగ్య విభాగం సూపరింటెండెంట్ ఇంజనీరు అపాయింట్‌మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు.
- టౌన్ ప్లానింగ్ విభాగం ఒకటో కేటగిరీ కింద వార్డు ప్లానింగ్, క్రమబద్ధీకరణ కార్యదర్శి ఉంటారు. వీరికి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్( టౌన్‌ప్లానింగ్) అపాయింట్‌మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు.
- సంక్షేమం, అభివృద్ధి విభాగం ఒకటో కేటగిరీ కింద వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి ఉంటారు. పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ వీరికి అపాయింట్‌మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు.
- ఏదైనా పంచాయితీ.. కార్పొరేషన్ / మున్సిపాలిటీలో విలీనం అయితే గ్రామ సచివాలయ ఉద్యోగులు సమ్మతిస్తే ఆ మున్సిపాలిటీ/ కార్పొరేషన్‌లోని వార్డు సచివాలయ పరిధిలోకి వస్తారు. లేకపోతే మరో గ్రామ సచివాలయంలో వారిని నియమిస్తారు.
- ఇప్పటికే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వివిధ విభాగాల కింద ఉన్న వారిని ఇక నుంచి వార్డు సచివాలయ ఉద్యోగులుగా పరిగణిస్తారు. బిల్ కలెక్టర్లు ఇకపై వార్డు పరిపాలన కార్యదర్శులుగా వ్యవహరిస్తారు. వర్క్ ఇన్స్‌పెక్టర్లు, ఫిట్టర్లను ఇక నుంచి వార్డు వసతుల కార్యదర్శి గ్రేడ్–2గా పరిగణిస్తారు. టౌన్ ప్లానింగ్ ట్రేసర్లు సచివాలయ టౌన్ ప్లానింగ్ కార్యదర్శులుగా వ్యవహరిస్తారు.
- వార్డు సచివాలయ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు చెల్లిస్తారు.
- మున్సిపల్ కమిషనర్ వార్డు సచివాలయ ఉద్యోగులకు సెలవులు మంజూరు చేస్తారు. ఉద్యోగులకు రుణాలు, అడ్వాన్సులు మంజూరు చేసే అధికారాన్ని కమిషనర్‌కే దఖలు పరిచారు. ఉద్యోగులపై విచారణకు ఆదేశించడం, క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం కమిషనర్‌దే. ఉద్యోగి తప్పిదాన్ని బట్టి గరిష్టంగా ఆరు నెలలపాటు సస్పెండ్ చేయవచ్చు. విచారణ అనంతరం అపాయింట్‌మెంట్ అథారిటీ అనుమతితో కమిషనర్ వార్డు సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేయడం, కింది కేటగిరీకి డిమోట్ చేయడం, ఇంక్రిమెంట్లు నిలిపివేయడంతోపాటు ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. దీనిపై సచివాలయ ఉద్యోగులు తమ అపాయింట్‌మెంట్ అథారిటీకి నెల రోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చు. అప్పాయింట్‌మెంట్ అథారిటీ ఆదేశాలపై పురపాలక శాఖ అధిపతికి మూడు నెలల్లోగా అప్పీలు చేసుకోవచ్చు.
- వార్డు సచివాలయ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పరిధిలోకి వస్తారు.
Comments
Please login to add a commentAdd a comment