
దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఏపీ
విశాఖపట్నం: 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ భారత్లో ఆగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో జరిగిన ఫార్చూన్ ఇండియా - 500 ర్యాంకింగ్ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు నూతన రాష్ట్రంలో వ్యాపార అవకాశాలపై కీలక ప్రసంగం చేశారు. కొత్త రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. రానున్న మూడేళ్లలో అన్ని నివాసాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు.
గ్రామాల్లో కూడా పట్టణ మౌలిక సదుపాయాలు కల్పించి.. అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమల అనుమతికి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామన్నారు. పరిశ్రమల అనుమతికి 21 రోజుల్లో అనుమతి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సముద్ర తీరానికి సమాంతరంగా మరో జాతీయ రహదారిని నిర్మిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. దాదాపు 100 మందికి పైగా సీఈవోలు ఈ సదస్సులో పాల్గొన్నారు.