జూనియర్‌ ఎన్టీఆర్‌తో కాదు లోకేష్‌తో పోటీ.. | Andhrabank Press note on TDP Leader Sribharat Loan in Visakhapatnamd | Sakshi
Sakshi News home page

చిన్నల్లుడూ అంతేనా..!

Published Tue, Oct 22 2019 1:16 PM | Last Updated on Thu, Oct 31 2019 12:28 PM

Andhrabank Press note on TDP Leader Sribharat Loan in Visakhapatnamd - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడైన టీడీపీ నాయకుడు శ్రీభరత్‌ సహా 11 మంది ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నగరంలోని ఆంధ్రా బ్యాంకు సీతమ్మధార బ్రాంచ్‌ డీ ఫాల్టర్‌ నోటీసు జారీ చేసింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద మెసర్స్‌ వీబీసీ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోసం తీసుకున్న రుణం ఎగవేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రాబ్యాంక్‌ పత్రికా ప్రకటన చేసింది. భరత్‌కు చెందిన సంస్థ మొత్తం రూ.13,65,69,873 (అక్షరాలా పదమూడు కోట్ల అరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు రూపాయలు)  కుటుంబం బాకీ పడిందని పేర్కొంది. సదరు రుణానికి హామీగా ఉంచిన నెల్లిమర్ల, గుర్ల ప్రాంతాల్లోని వీబీసీ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన భూములతో పాటు విశాఖపట్నం మధురవాడలో 47 సెంట్ల భూమిని అక్టోబరు 11న స్వాధీనం చేసుకున్నట్లు ఆంధ్రాబ్యాంకు స్పష్టం చేసింది.

నిర్ణీత గడువులోగా బకాయి మొత్తం చెల్లించి ఈ తనఖా ఆస్తిని విడిపించుకోవాలని పేర్కొంది. వాస్తవంగా ఆంధ్రాబ్యాంకుకు, భరత్‌కు మధ్య జరిగిన నోటీసు వ్యవహారం ఇదే. సహజంగా వ్యాపారస్తులకో.. ఓ మోస్తరు స్థాయి  రాజకీయ నేతలకో ఇలాంటి నోటీసులు వస్తే  పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, చంద్రబాబు కుమారుడు లోకేష్‌బాబుకు తోడల్లుడు, టీడీపీకి ఉత్తరాంధ్ర పెద్దదిక్కుగా వ్యవహరించిన దివంగత ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు.. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ విశాఖ లోక్‌సభ అభ్యర్థి, ఆర్థికంగా బలవంతుడుగా పేర్కొనే భరత్‌ను డిఫాల్టర్‌గా ఆంధ్రాబ్యాంక్‌ ప్రకటించడంతో ఒక్కసారి చర్చకు తెరలేచింది. దీనిపై హుందాగా వ్యవహరించాల్సిన భరత్‌ తాను డిఫాల్టర్‌ కావడానికి ట్రాన్స్‌కో బకాయిలే కారణమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. నెపాన్ని సర్కారుపై నెట్టారు. దీంతో చర్చ వివాదాస్పదమైంది.

అసలు వాస్తవాలు పరిశీలిస్తే..గత అక్టోబర్‌ నుంచీ ట్రాన్స్‌కో బకాయిలు..అప్పుడు పాలన ఎవరిది భరత్‌?
విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల మేరకు సోలార్‌ పవర్‌ ప్లాంట్ల యజమానులకు ట్రాన్స్‌కో ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాలి. ఆ మేరకు భరత్‌కు చెందిన వీబీసీ ఎనర్జీ సంస్థకు కూడా బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే గత అక్టోబర్‌ 18 నుంచి వీబీసీ సంస్థకు బిల్లులు చెల్లించలేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంది. అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది జూలై వరకు బకాయిలు చెల్లించలేకపోయింది. అంటే  మొత్తం తొమ్మిది నెలల కాలంలో టీడీపీ ఏడు నెలలు అధికారంలో కొనసాగగా, చివరి రెండు నెలల కాలంలోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ భరత్‌ సోషల్‌ మీడియాలోనూ, చేసిన ప్రకటనల్లోనూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చాలామంది వ్యాపారస్తులకు బిల్లులు రావడం లేదని, ఉద్యోగులకు జీతాలు రావడం లేదని విమర్శించారు. టీడీపీ హయాం నుంచే ట్రాన్స్‌కో నుంచి చెల్లింపులు ఆగాయన్న వాస్తవాన్ని తొక్కి పెట్టి.. ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన నిందలు వేయడమే ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇక  రాష్ట్ర ప్రభుత్వం నుంచి  దాదాపు రూ. 3 కోట్లు రావాల్సి ఉందని భరత్‌ పేర్కొన్నారు. కానీ వాస్తవమేమిటంటే ప్రభుత్వం నుంచి కాదు.. ట్రాన్స్‌కో నుంచి భరత్‌ రావాల్సిన బకాయిల మొత్తం రూ.2 కోట్ల 52లక్షల 95వేల 540. అంటే.. రూ.47లక్షల మొత్తాన్ని అదనంగా కలిపేసుకుని దాదాపు రూ.3 కోట్లని చెప్పేసుకున్నారు.

కొసమెరుపు..
ఆ మధ్య ఓ టీవీ ఇంటర్వ్యూలో టీడీపీకి భవిష్యత్తులో కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ అవసరం లేదని ఘాటైన వ్యాఖ్యలు చేసిన భరత్‌ను చూసి... ఫరవాలేదు.. కాస్త గట్టోడిలా ఉన్నాడే అన్న అభిప్రాయం క్యాడర్‌లో కలిగింది. కానీ ఇప్పుడు ఆయన అసంబద్ధమైన వాదనలు, ప్రకటనలు చూస్తుంటే జూనియర్‌ ఎన్టీఆర్‌తో కాదు.. తోడల్లుడు లోకేష్‌బాబుతో పోటీ పడుతున్నట్టు అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. వినపడుతోందా భరత్‌..

ఆ ప్రకారమైతే భరత్‌కు చెల్లించాల్సిందిరూ.96.86 లక్షలే..
ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత టీడీపీ సర్కారు నిర్ణయించిన సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు ధరలు అధికంగా ఉన్నాయని భావించింది. దేశంలో చాలా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ చెల్లింపులు జరుగుతున్నాయని తేల్చింది. టీడీపీ ప్రభుత్వం యూనిట్‌కు రూ5.90 చెల్లించగా, అదే యూనిట్‌ ధర రాజస్థాన్‌లో రూ.2.44 మాత్రమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ పవర్‌ ప్లాంట్ల యజమానులకు నోటీసులు జారీ చేయగా.. యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదాన్ని పరిష్కరించాలని  ఏపీఈఆర్సీకి హైకోర్టు ఆదేశించింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న యూనిట్‌ రూ.2.44 ధర ప్రకారం చూస్తే ట్రాన్స్‌కో భరత్‌ సంస్థకు బకాయి పడిన మొత్తం రూ.96లక్షల85వేల82మాత్రమే.

ఏప్రిల్‌ నుంచి రుణవాయిదాలు చెల్లించని భరత్‌
ఇక రుణం తీసుకున్న ఆంధ్రా బ్యాంక్‌కు ప్రతినెలా చెల్లించాల్సిన వాయిదాలను భరత్‌ సంస్థ ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచీ చెల్లించలేదని బ్యాంక్‌ అధికారులు సాక్షి ప్రతినిధికి చెప్పారు. వరుసగా మూడు నెలలు చూసిన తర్వాత.. నిబంధనల మేరకు కొన్నాళ్ళు చూసి.. ఈ నెలలో స్వాధీనత ప్రకటన వేయాల్సి వచ్చిందని అన్నారు. అయితే భరత్‌ మాత్రం ఈ ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడం వల్లే బ్యాంకు రుణం చెల్లించలేకపోయామని పేర్కొన్నారు. వాస్తవానికి భరత్‌ బ్యాంకు వాయిదాలు కట్టకుండా నిలిపివేసిన ఏప్రిల్‌లో ఏ ప్రభుత్వం ఉందంటే ఎవరినడిగినా చెబుతారు. వాస్తవాలు అలా ఉంటే భరత్‌ మాత్రం అర్ధం పర్ధం లేని వాదనలతో బుకాయించడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement