సచివాలయంలో నిలిచిపోయిన ఫైళ్ల పరిశీలన
పనులు, నిధుల మంజూరుకూ బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు సంబంధించి రాష్ట్రపతి ఇంకా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో విభజన ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం సీఎస్ జారీ చేసిన ఆదేశాలతో బుధవారం అన్ని శాఖల ఉన్నతాధికారులు ఆయా శాఖల్లోని సిబ్బందికి ఫైళ్ల విభజనపై మౌకిక ఆదేశాలను జారీ చేశారు. ఎక్కడి ఫైళ్లు అక్కడే నిలుపుదల చేయాలని, పరిశీలించరాదని స్పష్టం చేశారు. దీంతో విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇక ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ఎలాంటి ఫైళ్ల కదలిక ఉండదు. ఎటువంటి పనికి గానీ, సహాయానికి గానీ చేసుకున్న దరఖాస్తులు సైతం ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు, కార్యక్రమాలకు నిధులు విడుదల తప్ప కొత్తగా ఏ పనులకు, కార్యక్రమాలకు నిధులు విడుదల గానీ పనులు మంజూరు గానీ నిలిచిపోనుంది. రెవెన్యూ శాఖలో కొన్ని జిల్లాలకు కలిపి ఐదారు సెక్షన్లు ఉన్నాయి. దీంతో విభజన సులభతరం కానుంది. ప్రణాళిక, ఆర్థిక శాఖల్లో మాత్రం జిల్లాల వారీగా ఫైళ్ల విభజన క్లిష్టతరం కానుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, ప్రధానమైన సర్వీసు అంశాలకు చెందిన ఫైళ్లను నోట్ ఫైళ్లతో సహా నకలు ప్రతులు (జిరాక్స్‌లు) తీయాలని అధికారులు తెలిపారు. చాలా శాఖల్లో ఏదో పది పేపర్లు మాత్రం జిరాక్స్ తీసే సామర్ధ్యంగల యంత్రాలే ఉన్నాయి. దీంతో చాలా శాఖలు ఫైళ్ల జిరాక్స్‌ల కోసం ఏపీటీఎస్‌ను ఆశ్రయిస్తున్నారు.
సీఎం సహాయనిధి కోసం తిప్పలు: సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయడంతో సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి నిధుల మంజూరు నిలిచిపోయింది. ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పటికీ ఎటువంటి ఫైళ్లు చూడబోనని, తన వద్దకు పంపించవద్దని కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మరోవైపు సీఎం తప్ప మిగతా ఎవరూ ఈ నిధులను మంజూరు చేయడానికి వీల్లేని పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఫైళ్ల విభజన షురూ
Published Thu, Feb 27 2014 1:49 AM | Last Updated on Tue, Oct 2 2018 4:01 PM
Advertisement
Advertisement