* ప్రత్యేక హోదా లేనట్లే 7 జిల్లాలకు 60 కోట్లు చొప్పున కేంద్ర సాయం
* రాష్ట్రానికి ఆర్థిక సాయంపై వారంలోగా కేంద్రం ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా ఏమీ లేదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేనట్లేనని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. ప్రత్యేక హోదా వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే మేలు జరుగుతుందని వ్యాఖ్యానించిందన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం ద్వారా ప్రత్యేక అవార్డును ఇప్పించే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసిందని చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే అనేక రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయని, అంతేకాకుండా ప్రత్యేక హోదా నిబంధనలకు రాష్ట్రం అనువుగా లేదని కూడా పేర్కొందన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో గ్రాంట్ రూపంలో కొంత, రుణం రూపంలో కొంత ఆర్థిక సాయం అందించాలని భావిస్తోందన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద ఐదేళ్లలో రూ. 24,350 కోట్ల సహాయాన్ని అందించాలని రాష్ట్రం కోరిందని, అయితే జిల్లాకు రూ. 60 కోట్ల రూపాయల చొప్పున ఏడు జిల్లాలకు ఐదేళ్ల పాటు గ్రాంటు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.
రెవెన్యూ లోటు భర్తీపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. పైగా ఈ లోటు భర్తీ రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని కేంద్రం వ్యాఖ్యానించినట్లు తెలిపారు. కేవలం ప్రధానమంత్రి పార్లమెంట్‌లో ప్రకటన చేశారనే ధోరణిలో ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ వారంలోగా రాష్ట్రానికి ఆర్థిక సాయంపై కేంద్రం ప్రకటన చేస్తుందని, ఆ సాయం రూపాయా ?రెండు రూపాయలా ? అనేది తెలియదని వ్యాఖ్యానించారు.
ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా లేదు
Published Sat, Jan 24 2015 3:28 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement
Advertisement