
కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలి
- రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు తలెత్తాయి
- హోదా అంటున్నారే తప్ప.. మిగతా సమస్యలు పట్టవా?
- శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేకహోదాను ప్రకటించడంతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేంత వరకు అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రప్రభుత్వాన్ని అర్ధించారు. ప్రత్యేకహోదాపై సోమవారం రాష్ట్ర శాసనసభలో అసంపూర్తిగా ముగించిన ప్రకటనను ముఖ్యమంత్రి మంగళవారం కొనసాగించారు. దీనిపై చర్చ సందర్భంగా చంద్రబాబుకు, విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య వాడీవేడీ సంవాదం నడిచింది. పరస్పరవాద ప్రతివాదాలు, సవాళ్లు, వ్యంగ్యోక్తులు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకహోదాపై విపక్షం తీరును ముఖ్యమంత్రి తీవ్రంగా ఆక్షేపించగా సభలో ఇచ్చిన ప్రకటనకు చంద్రబాబు చెప్పేదానికి అసలు పొంతనే లేదని వైఎస్ జగన్ అభ్యంతరం తెలిపారు. సభ్యుల సమాచారం కోసమే ప్రకటన ఇస్తారని, దాన్ని స్ఫూర్తిని, సారాంశాన్ని ఆధారం చేసుకుని చర్చ జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
ఉద్యోగుల సమస్యలు పట్టవా?
అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు తలెత్తాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు సహా ప్రత్యేకహోదా సాధన కోసం నేను చేస్తున్న కృషిని గుర్తించడానికి బదులు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. గత 15 నెలల కాలంలో 17సార్లు ఢిల్లీ వెళ్లా. ప్రధానితో ఏడుసార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యా. నా ప్రయత్నాల వల్ల గతేడాది బడ్జెట్ లోటు భర్తీకి రూ.2,300కోట్లు, ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.350కోట్లు, కొత్త రాజధాని నిర్మాణానికి రూ.1,500కోట్లు, అదనపు తరుగుదల రాయితీ 15శాతం, ప్రణాళికా నిధులకు అదనపు కేంద్ర సాయం కింద రూ.3,700కోట్లు వచ్చాయి.
నాపై నిఘానా? సహించబోను
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. రెండు ప్రభుత్వాలకు సమానాధికారాలుంటాయి. కానీ.. ఒక రాష్ట్ర ప్రభుత్వంపై మరో ప్రభుత్వం పెత్తనం చేస్తోంది. ఒక ప్రభుత్వంపై మరోటి నిఘా పెట్టడమా? బహిరంగంగా మీ వాళ్లను(తెలంగాణ ఎమ్మెల్యేలను) కొంటుంటే మీరు నోరు మెదపలేదు. కానీ మీరిప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు. హోదా అంటున్నారే తప్ప మిగతావి పట్టవా? సమస్యలన్నింటినీ ప్రతిపక్షం పట్టించుకోదా?
మాట్లాడుకుందాం రమ్మన్నా.. వినలేదు
రాజకీయ లబ్ధి కోసం జరిగిన విభజన ఇది. విభజనతో తలెత్తిన సమస్యల్ని మనం కలిసి కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకుందాం రమ్మని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పాం. సయోధ్యతో ముందుకు పోదామన్నా. మనవల్ల కాకపోతే పెద్ద మనుషుల్ని అడుగుదామని చెప్పా. కానీ, కలిసి రాలేదు.
ప్రత్యేకహోదా అంటే సరిపోతుందా?
ఒక ప్రభుత్వంపై మరో ప్రభుత్వం నిఘా పెట్టినా, ఇక్కడి ప్రజలు అభద్రతతో బతుకుతు న్నా, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నా ప్రశ్నించాల్సిన బాధ్యత విపక్షానికి లేదా? హో దా అంటూ పోరాడితే సరిపోతుందా? జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవమైనప్పటికీ నేను జరుపలేదు. నవ నిర్మాణ దిక్షగా నిర్వహించా. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజైన జూలై 8ని సంకల్ప దినంగా పాటిస్తున్నాం. ఎన్డీఏలో ని తమ మంత్రుల్ని ఉపసంహరించుకోమంటున్నారు. ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. రాజీనామా చేయాల్సిన అవస రం లేదని చెబుతున్నాం. (ఈ సందర్భంలోనే వైఎస్సార్‌సీపీ ఆనాడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉపసంహరించుకున్న విషయాన్ని ప్రస్తావించారు). బాబు ప్రసంగం మధ్యలో వైఎస్ జగన్ జోక్యం చేసుకొని రాష్ట్ర విభజనపై టీడీపీ తెలంగాణలో ఒకమాట, ఆంధ్రలో మరోమాట చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ‘చంద్రబాబు వరంగల్ సభలో మాట్లాడుతూ టీడీపీ లేఖ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతారు. అదే ఆంధ్రాలో వైఎస్సార్‌సీపీ వల్లనే రాష్ట్రం విడిపోయిందంటారు. చంద్రబాబు ఇలా రెండు రకాలుగా మాట్లాడుతారు’ అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
సమష్టిగా ముందుకు పోదాం..
రాజకీయాలకు అతీతంగా కలిసివచ్చే వారు కలిసిరండి. సమష్టిగా ముందుకు పోదాం. నెంబర్ వన్ రాష్ట్రంగా మారుద్దాం అని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలను ఏకరవు పెట్టారు.
భావోద్వేగాలకు ప్రతీక ఆ లేఖ
ప్రత్యేకహోదా ప్రతిపత్తి కోసం రాష్ట్రంలో నానాటికీ భావోద్వేగాలు పెరిగిపోతున్నాయనే ప్రతీకే గుడివాడలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోబోయే ముందు రాసిన లేఖని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏపీకి స్వతంత్య్రం వస్తుందా? సోనియమ్మ రాజకీయంతో రాష్ట్రం విడిపోయింది. ఈ రాజకీయ నాయకులు ఇకనైనా కళ్లు తెరుస్తారా? ప్రత్యేకహోదా సాధిస్తారా? పాలకులు సమాధానం చెప్పాలంటూ’ ఆ యువకుడు రాసిన లేఖ సారాంశమన్నారు. ప్రజల మనోభావాలకు ఈ లేఖ అద్దం పడుతోందన్నారు. ప్రజల జీవితాలతో రాజకీయాలు వద్దని, ఆత్మహత్యలకు పాల్పడేలా వ్యాఖ్యలు చేయవద్దన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు.
హరీశ్‌తో జగన్ కలసిన ఆధారాలున్నాయ్
హరీశ్‌తో జగన్ ఎక్కడ కలిసిందీ తమవద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. లాలూచీ పడకుంటే... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినైన తన ఫోను, మంత్రుల ఫోన్లను టాప్ చేస్తే ప్రతిపక్షనేత ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... తెలంగాణ శాసనసభలో నామినేటెడ్ ఎమ్మెల్యే పదవిని స్టీఫెన్‌సన్‌కు ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు జగన్ లేఖ రాసినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. ఆ లేఖను జత చేసి స్టీఫెన్‌సన్ పేరును ఎమ్మెల్యే పదవికి నామినేట్ చేస్తూ తెలంగాణ సీఎం గవర్నర్‌కు లేఖ రాశారని తె లిపారు.