ఇప్పటివరకు ఎన్‌జీఓల ఆధ్వర్యంలో ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తుంటే.. ఆ స్ఫూర్తితో అంగన్‌వాడీ సిబ్బంది కూడా ఉద్యమబాట పట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. రెండు నెలలుగా దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ‘నో వర్క్’ బోర్డు పెట్టిన విష యం తెలిసిందే. అదే బాటలో ఈ నెల 17వ తేదీ నుంచి సీమాంధ్రలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని నాయకులు నిర్ణయించారు. అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు సూపర్‌వైజర్లు, సీడీపీఓలు, ప్రాజెక్టు డెరైక్టర్లు, రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లంతా సమైక్య జెండాలు చేతబట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. జిల్లాలో 4094 కేంద్రాలు
జిల్లాలో 21 సీడీపీఓ ప్రాజెక్టుల పరిధిలో 4094 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణిలు, బాలింతలకు పౌష్టికాహారం అందుతుంది. కొన్ని నెలల నుంచి కొన్ని కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం కూడా ప్రవేశపెట్టారు. పౌష్టికాహారంలో భాగంగా వారంలో రెండు రోజులు కోడిగుడ్లు అందిస్తున్నారు. ఇక ఆటపాటల విద్య చిన్నారుల సొంతం. ఇంతటి ప్రయోజనకరమైన అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా జిల్లా వ్యాప్తంగా నిత్యం లక్షలమంది లబ్ధి పొందుతున్నారు. సమ్మె ప్రారంభమైతే వీరందరిపై ప్రభావం పడక తప్పదు.
జేఏసీ ఆవిర్భావం.. ఇటీవల విజయవాడలో సీమాంధ్రలోని పదమూడు జిల్లాలకు చెందిన అధికారులు, కార్యకర్తలు సమావేశమై సమైక్యాంధ్రకు దన్నుగా ఉండాలని తీర్మానించారు. ఇప్పటికే రెండు యూనియన్లు ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూనియన్లతో సంబంధం లేకుండా శాఖ కింది స్థాయి కార్యకర్తల నుంచి పైస్థాయి ఉన్నతాధికారుల వరకు జేఏసీలో భాగస్వాములు కానున్నారు.
ఇకపై అంతా.. ఇప్పటివరకు పర్చూరు, తాళ్లూరు, మార్కాపురం అర్బన్ సీడీపీఓలతోపాటు కొండపి ఏసీడీపీఓ పూర్తిస్థాయిలో సమ్మె చేస్తున్నారు. మిగిలినవారు ఓవైపు విధులు నిర్వర్తిస్తూ.. మరో వైపు ఉద్యమ నినాదాలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో అంతా సమ్మె పోరుకు సిద్ధమయ్యారు. అయితే సుదీర్ఘకాలంగా ఉద్యమం జరుగుతున్నా స్పందించని శిశుసంక్షేమ అభివృద్ధి శాఖ.. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో సమ్మెకు దిగుతామంటూ ప్రకటించడంపై పలువురు నేతలు పెదవి విరుస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
అంగన్‌వాడీల సమైక్య బాట
Published Thu, Oct 10 2013 7:13 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement