భోజనం చేస్తున్న చిన్నారులు
చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే అంగన్‌వాడీ కార్యకర్తల పరిస్థితి దయనీయంగా ఉంది. గత పాలకులు చిన్నచూపు చూశారు. కేంద్రాల నిర్వహణకు సంబంధించిన బకాయిలు చెల్లించకుండా మోసం చేసింది. ప్రయివేటు భవనాలకు సైతం అద్దెలు చెల్లించకుండా మోసం చేసింది. ఫలితంగా జిల్లాలోని 3,774 అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ భారంగా మారింది. కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు..
ఉదయగిరి: జిల్లాలో అంగన్‌వాడీల కేంద్రాల నిర్వహణ కార్యకర్తలకు తలకుమించిన భారంగా మారింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించి కూరగాయలు, పోపు సామగ్రిని అంగన్‌వాడీ కార్యకర్తలే సమకూర్చుకోవాల్సి ఉంది. దీంతో వారు అప్పోసొప్పో తెచ్చి నిర్వహిస్తున్నా సకాలంలో బిల్లులు అందలేదు. దీంతో వారిపై ఆర్థిక భారం పడింది. మూడేళ్లనుంచి కూరగాయలు బిల్లులు, పోపు సామగ్రికి నగదు ఇవ్వవ్వాల్సి ఉన్నా అధికారులు మాత్రం సరైన సమాధానం చెప్పడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు.
పేరుకుపోయిన బిల్లులు
జిల్లా పరిధిలో 17 అంగన్‌వాడీ ప్రాజెక్ట్‌లు ఉండగా అందులో 3,774 కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 2.13 లక్షలమంది చిన్నారులు మరో 41 వేల మంది గర్భిణులు, బాలింతలున్నారు. జిల్లాలో 2,700 కేంద్రాలకు పైగా కూరగాయాలు, పోపు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కేంద్రానికి రూ.10 వేలకు పైగా బకాయిలు రావాల్సి ఉంది. ఈ విధంగా దాదాపు రూ.2.70 కోట్ల కూరగాయాలు, పోపు సామగ్రి బిల్లులు చెల్లించాల్సి ఉంది. కొన్ని కేంద్రాల్లో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు కలిసి ఈ బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఇంతవరకు దీనిపై స్పష్టత రాలేదు.
అద్దెలు చెల్లింపులోనూ జాప్యం
జిల్లాలోని చాలా అంగన్‌వాడీలు ఇప్పటికీ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి రూ.3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.750 చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించిన బకాయిలు సుమారు రూ.80 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. సుమారు 18 నెలలుగా ఇంటి అద్దెలు చెల్లించకపోవడంతో భవనాలు ఖాళీచేయాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేంద్రాల నిర్వహణే సమస్యగా మారిందని పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను ఆన్‌లైన్ చేసేందుకు ఒక్కో కేంద్రానికి నెలకు రూ.300–400 వరకు ఖర్చవుతోంది. ఈ వ్యయాన్ని కూడా కార్యకర్తలే భరించాల్సివస్తోంది. సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీలు జరిపినప్పుడు, సీడీపీఓలు తనిఖీలకు వచ్చినప్పుడు రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదంటూ కార్యకర్తలను బెదిరించి కొంత మొత్తం లాగుతున్నారు. అదేవిధంగా నెలనెలా ఇవ్వాల్సిన గ్యాస్ బిల్లులు కూడా కార్యకర్తలకు సక్రమంగా ఇవ్వడం లేదు. మొత్తమ్మీద జిల్లాలో సుమారు రూ.3.5 కోట్ల బకాయిలు నిలిచాయి. గత ప్రభుత్వం ఈ బకాయిలు ఇవ్వాల్సిన ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో ఆ భారం కొత్త ప్రభుత్వంపై పడింది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఈ బకాయిలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది
టీడీపీ ప్రభుత్వంలో అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి కూరగాయాలు, పోపు సామగ్రి, అద్దె బకాయి, గ్యాస్ బిల్లులు నెలల తరబడి రావాల్సి ఉంది. సుమారు రూ.3.5 కోట్లు పైగా బకాయిలు ఇవ్వాల్సి ఉన్నా జాప్యం చేస్తూ వచ్చింది. టీడీపీ ప్రభుత్వం దిగిపోయేంతవరకు బిల్లులు ఇవ్వకుండా అంగన్‌వాడీలను మోసం చేశారు. దీంతో కార్యకర్తలు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు.
–మహాలక్ష్మి, అంగన్‌వాడీ యూనియన్ నాయకురాలు
నిధులు ఇస్తే ఖాతాల్లో వేస్తాం
ప్రాజెక్ట్‌లో కొన్ని నెలలకు సంబంధించి కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నమాట వాస్తవమే. ప్రభుత్వం నిధులు ఇచ్చిన వెంటనే కార్యకర్తలకు వారి ఖాతాల్లో వేస్తాం. ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేం.– ఈస్టర్‌రాణి, సీడీపీఓ, ఉదయగిరి
Comments
Please login to add a commentAdd a comment