
అంగన్‌వాడీ కేంద్రాల్లో విచారణ
మండలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల పని తీరుపై అధికారుల బృందం బుధవారం విచారణ చేపట్టింది. ఆయా గ్రామాల్లో గర్భవతులు....
వేముల: మండలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల పని తీరుపై అధికారుల బృందం బుధవారం విచారణ చేపట్టింది. ఆయా గ్రామాల్లో గర్భవతులు, బాలింతల నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. పులివెందుల ఐసీడీఎస్ సీడీపీవో సావిత్రిపై అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 24నుంచి జూన్12 వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరా చేయకున్నా.. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసినట్లు రికార్డులలో నమోదు చేశారు.
ఇందులో సీడీపీవో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలలో పూర్తి స్థాయిలో విచారణ కోసం కర్నూలుకు చెందిన ఆర్‌జేడీ శారదను నియమించారు. ఆమె బుధవారం చాగలేరు, చింతలజూటూరు, పెద్దజూటూరు, సిద్ధంరెడ్డిపల్లె, రాచకుంటపల్లె, మబ్బుచింతలపల్లె గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఒక్కో గ్రామంలో ఇద్దరు బాలింతలు, ఇద్దరు గర్భవతులు, కేంద్రాలలోని ఇద్దరు చిన్నపిల్లల తల్లిదడ్రులను విచారించారు. అంగన్‌వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం పెడుతున్నారా.. గుడ్డు ఇస్తున్నారా.. పాలు ఇస్తున్నారా.. అలాగే కేంద్రంలో చిన్నపిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అనే విషయాలను వారినుంచి సేకరించారు.
కమిషనర్‌కు నివేదిక :
మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో జరిపిన విచారణలో వెలుగు చూసిన విషయాలను నివేదిక రూపంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు అందజేస్తామని ఆర్‌జేడీ శారద తెలిపారు. చాగలేరు గ్రామంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలలోని రిజిష్టర్లను పరిశీలించామన్నారు. అలాగే రిజిష్టర్‌లో సంతకాలు, వేలిముద్రలను పరిశీలించామన్నారు. అంతేకాక గర్భవతులు, బాలింతలు చెప్పిన వివరాలను నమోదు చేశామన్నారు.