ఎండ వేడిమి తాళలేక అంగన్‌వాడీ చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లో అవస్థలు పడుతున్నారు.
శ్రీకాకుళం టౌన్ :ఎండ వేడిమి తాళలేక అంగన్‌వాడీ చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లో అవస్థలు పడుతున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం వరకు కేంద్రాలు తెలిచి ఉంచడంతో పిల్లలు సొమ్మసిల్లి పడిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) పరిధిలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. చాలా కేంద్రాలు ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. ఇరుకు గదుల్లో చిన్నారులు మగ్గిపోతున్నారు. పిల్లలను కేంద్రాలకు పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇదీ
శ్రీకాకుళం జిల్లాలో 18 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 3403 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 3,275 మంది కార్యకర్తలు, 2,933 మంది సహాయకులు, 709 మంది మినీ కార్యకర్తలు, 305 మంది న్యూట్రిషన్ కౌన్సెలర్లు పనిచేస్తున్నారు. ఏడు ప్రాజెక్టుల్లో అమృతహస్తం అమలు చేస్తుండగా, మిగిలిన 11 ప్రాజెక్టుల్లో సమీకృత ఆహారం అందిస్తున్నారు. 18 ప్రాజెక్టుల్లో సుమారు 1.92 లక్షల మంది చిన్నారులు, 22,552 మంది గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందజేస్తున్నారు.
రూ.లక్షల్లో అద్దెలు
జిల్లా వ్యాప్తంగా 3,403 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 162 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. అద్దె భవనాలకు నెల నెలా లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారే తప్ప, సొంత భవనాలపై అధికారులు దృష్టి సారించడం లేదు. కేంద్రాలకు అద్దె రూపంలో గ్రామీణ ప్రాంతంలో రూ.250, పట్టణ ప్రాంతంలో రూ.750 చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భవనాలు అద్దెకు లభించకపోవడంతో ఇరుకు గదుల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. గాలి, వెలుతురు ఉండటం లేదు. ఫ్యాన్లు తిరగవు. ప్రభుత్వం నిర్మించిన పక్కా భవనాలకు సహితం విద్యుత్ సౌకర్యం లేదు. వేసవి ఎండలకు చిన్నారులు అల్లాడిపోతున్నారు.
సెలవులు ప్రకటించాలి
వేసవి కాలంలో కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేంద్రాలు పనిచేయడంతో చిన్నారులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఫ్యాన్లు లేని ఇరుకు గదుల్లో బాలింతలు, చిన్నారులు, గర్భిణులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కేంద్రాలకు రానిదే పౌష్టికాహారం ఇచ్చేది లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు. అవస్థలు పడుతూ కేంద్రాలకు వెళ్లక తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. ఎండలో పిల్లలను బయటకు పంపితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం లేక పోలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేసవి ఎండలు తగ్గే వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.