అంగన్‌వాడీ అక్రమాలు .. అంగట్లో సరుకులు
Published Sun, Nov 17 2013 3:54 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
వంగర, న్యూస్‌లైన్: స్థానికంగా ఉండని.. సక్రమంగా పని చేయని అంగన్‌వాడీ కార్యకర్తలు.. వారికి వత్తాసు పలికే ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు.. అందుకు ప్రతిఫలంగా కేంద్రాలకు సరఫరా చేసే సరుకులు, పౌష్టికాహారంలో కోత విధించి.. మిగుల్చుకోవడం.. ఫలితంగా గర్భిణులు, బాలింత లు, చిన్నారులకు తగిన మోతాదులో అందని పౌష్టికాహారం.. వీరఘట్టం ఐసీడీఎస్ పరిధిలో ఉన్న వంగర మండలంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలకు, స్వాహాపర్వానికి అంతూపొం తూ లేకుండాపోతోంది. పెద్ద మొత్తంలోనే సరుకులు దారి మళ్లుతున్నా అడిగే దిక్కు లేదు.
భారీ కోత.. దారి మళ్లింపు
మండలంలో 66 మెయిన్ అంగన్‌వాడీ కేం ద్రాలు, మూడు మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 56 మంది కార్యకర్తలు పని చేస్తుండగా.. 4395 మంది 07-5 సంవత్సరాల చిన్నారులు, 576 మంది గర్భిణులు, 572 మంది బాలింతలు ఉన్నారు. వీరి ఓసం గత నెలలో సుమారు 13 టన్నుల బియ్యం, 17 క్వింటాళ్ల కందిపప్పుతోపాటు జాతీయ పోషకాహార సంస్థ తరఫున మాడిఫైడ్ థెరాఫిటిక్ ఫుడ్(పౌష్టికాహారం) 412 బస్తాలు, ఒక్కో కేంద్రానికి రెండు చొప్పున స్నాక్స్ ప్యాకెట్లు విడుదల చేశారు. అయితే కేంద్రాలకు అందజేసిన సరుకులో మాత్రం భారీ కోత కనిపించింది. స్థానికంగా ఉంటున్న అంగన్‌వాడీ కార్యకర్తలు నడిపే కేంద్రాలకు బియ్యం, కందిపప్పులో 40 శాతం తగ్గించి సరఫరా చేశారు.
ఇతర ప్రాంతాల్లో నివాసముంటూ అప్పుడప్పుడు వచ్చి పోయే కార్యకర్తల కేంద్రాలకైతే సగానికి సగం కోత విధించారు. ఒక్కో కేంద్రానికి రెండు క్వింటాళ్ల బియ్యం, 50 కేజీల కందిపప్పు అందాల్సి ఉండగా.. కేంద్రాన్ని బట్టి 1.30 నుంచి 1.50 క్వింటాళ్ల బియ్యం మాత్రమే అందాయి. కందిపప్పులో సైతం అదే స్థాయిలో కోత పడింది. ఈ విధంగా ఒక్క గత నెలలోనే మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సుమారు 4 టన్నుల బియ్యం, ఒక టన్ను కందిపప్పు దారి మళ్లినట్లు తెలుస్తోంది. తక్కువ అందజేస్తున్నా.. పూర్తి సరుకు అందినట్లుగానే అక్విటెన్స్‌లపై అంగన్‌వాడీ కార్యకర్తలతో సంతకాలు చేయించుకుంటున్నారు. ప్రతి రోజు కేంద్రాల్లో సరుకుల వినియోగం వివరాలను రిజిస్టర్లలో పెన్సిళ్లతో నమోదు చేస్తున్నారు. వీరఘట్టం ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ప్రతి నెలా సరుకులు పంపిస్తుం టారు. రవాణాను పర్యవేక్షిం చేందుకు రూట్ ఆఫీసర్ ఉండాలి. ఇక్కడ మాత్రం సూపర్‌వైజర్ల సమక్షంలోనే పంపిణీ జరుగుతోంది.
మద్దివలస కేంద్రమే ఉదాహరణ
మండలంలోని మద్దివలస గ్రామంలో ఒక మెయిన్, ఒక మినీ అంగన్‌వాడీ కేంద్రం ఉన్నాయి. ఒకే కార్యకర్త నిర్వహిస్తున్న ఈ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు కలిపి మొత్తం 185 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా మూడున్నర క్వింటాళ్ల బియ్యం, 80 కేజీల కందిపప్పు అవసరం కాగా గత నెలలో ఈ క్వింటాళ్ల బియ్యం, 30 కేజీల కందిపప్పు మాత్రమే అందాయి.
కేంద్రాల పరిస్థితి దయనీయం
మండలంలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు దారుణంగా ఉంది. చాలా కేంద్రాలను వారంలో ఒక రోజు తెరిచినా గొప్పే. సూపర్‌వైజర్లు సరుకుల్లో కోత విధించి స్వాహా చేస్తుంటే.. చుట్టపుచూపుగా వచ్చీపోయే కార్యకర్తలు తమ లోపాలను, అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకు వారు చెప్పినట్లే సంతకాలు చేసేస్తున్నారు. కాగా బాగా పనిచేస్తున్న కార్యకర్తలపై సూపర్‌వైజర్లు వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారి తీరుపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు కేంద్రాలను తెరుస్తున్నా సరుకుల్లో కోత విధిస్తున్నారని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తమను మరింతగా వేధిస్తారని ఆందోళన చెందుతున్నారు. మెజారిటీ కేంద్రాలతోపాటు ప్రీస్కూల్స్ కూడా సక్రమంగా పని చేయడం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధాహ్న భోజన పథకం కనుమరుగైంది. ఆటపాటలతో కూడిన విద్య దూరమైంది. నెలకోసారే గుడ్లు సరఫరా చేస్తున్నారు. అసలు కేంద్రాలే తరవని చోట బోగస్ లబ్ధిదారుల పేర్లు నమోదు చేసి సరుకులు స్వాహా చేస్తున్నారు. ఫలితంగా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందకుండాపోతోంది.
పట్టించుకోని అధికారులు
మారుమూలనున్న వంగర మండలంలో కేంద్రాలను అధికారులు పట్టించుకోవడం లేదు. నెలల తరబడి కేంద్రాలు పనిచేయకపోయినా అడిగే నాథుడే లేడు. మూడు నెలలకోసారైనా కేంద్రాలను పరిశీలించిన దాఖలాలు లేవు. దాంతో స్థానికంగా ఉండే సూపర్‌వైజర్లదే ఇష్టారాజ్యం. దాదాపు ప్రతి నెలా లక్షలాది రూపాయల విలువైన పౌష్టికాహారం పక్కదారి పడుతోంది.
ఐసీడీఎస్ పీడీ వివరణ
సరుకులు, పౌష్టికాహారం గోల్‌మాల్‌పై వీరఘట్టం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ వి.రమాదేవి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరైక్టర్ జి.చక్రధరరావును సంప్రదించగా అటువంటివేవీ తమ దృష్టికి రాలేదన్నారు. ఇటువంటి ఫిర్యాదులపై స్థానిక ప్రాజెక్టు ఆఫీసర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అంటూ దీనిపై విచారణ జరపాలని అక్కడి పీవోను ఆదేశిస్తానని చెప్పారు.
Advertisement
Advertisement