
బ్లాక్ బోర్డు లేకపోవడంతో ఇసుకలోనే విద్యార్థులతో అక్షరాలు దిద్దిస్తున్న రమణమ్మ
ఆత్మకూరు: ఆమె ఓ గిరిజన మహిళ. తల్లిదండ్రులు చేపల విక్రయం చేస్తూ కష్టపడి పిల్లలను పెంచారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు పడిన కష్టాన్ని పరిశీలించిన ఆమె ఉన్నంతలో పదో తరగతి వరకు చదువుకున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తగా అవకాశం రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకొని వందలాది మంది చిన్నారులకు చదువుపై ఆసక్తి కలిగేలా కేంద్రంలో శిక్షణ ఇస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు పట్టణంలోని మేదరవీధి గిరిజన కాలనీకి చెందిన కొమరగిరి రమణమ్మ.
చిన్నారులకు విద్యాబుద్ధులు
కొమరగిరి రమణమ్మకు 2002లో అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా ఉద్యోగం వచ్చింది. తాను కష్టపడి చదువుకున్న రోజులను గుర్తు చేసుకొని కేంద్రానికి వచ్చే చిన్నారులను పూర్తిగా చదువువైపు మళ్లేలా తన వంతు కృషి చేస్తున్నారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకుంటూ కాలనీలోని గిరిజన చిన్నారులందరూ తప్పనిసరిగా పాఠశాలకు వచ్చేలా కృషి చేస్తున్నారు.
ఉన్నంతలోనే సౌకర్యాల ఏర్పాటు
హిల్ రోడ్డులో అద్దె భవనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా ఉన్నంతలోనే తన సొంత నగదును వెచ్చించి పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు బోధించేందుకు కోవూరులో రూ.మూడు వేలను వెచ్చించి బొమ్మలను కొనుగోలు చేశారు. వీటి ద్వారా పాఠాలను చెప్పడం సులభతరమవడంతో పలువురు ఆమెనే అనుసరిస్తున్నారు. అద్దె గదిలో స్థలం చాలకపోవడంతో వెలుపల తాటాకుల పందిరిని ఏర్పాటు చేయించి ఆరుబయటే పిల్లలకు పాఠాలు నేర్పుతున్నారు. సమీపంలోని బీసీ కాలనీ, నారాయణరావుపేట అంగన్‌వాడీ కేంద్రాలను ఈ కేంద్రంలోనే విలీనం చేశారు. దీంతో ఈ అంగన్‌వాడీ కేంద్రంలో విద్యార్థుల సంఖ్య 54కు చేరుకుంది. అయినా మొక్కవోని దీక్షతో విద్యార్థులందర్నీ పాఠశాలకు అలవాటు చేసి ఓ తల్లిలా వారందర్నీ తీర్చిదిద్దుతున్నారు.
ఇసుకలోనే అక్షరాల దిద్దింపు
ఇక్కడి చిన్నారులకు రాసుకునేందుకు పలకల్లేవు.. బ్లాక్ బోర్డూ లేదు. దీంతో ఆమె గోడపై నల్లరంగుతో బోర్డును ఏర్పాటు చేయించారు. విద్యార్థులు రాసుకునేందుకు ఒక చిన్న అట్టపెట్టెలో ఇసుకపోసి దానిపై వారితో అక్షరాలు దిద్దిస్తున్నారు. వంట గది చాలకపోవడంతో విద్యార్థుల కోసం ఆహార పదార్థాలను పాత కేంద్రాల్లోనే తయారుచేయించి ఈ కేంద్రానికి తీసుకొచ్చి వడ్డించేలా కృషి చేస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే సమయంలో తమ కేంద్రం పేరును చాటి చెప్పేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment