అంగన్‌వాడీల ఆగ్రహం | anganwadi's angry | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల ఆగ్రహం

Published Tue, Jan 28 2014 4:49 AM | Last Updated on Sat, Jun 2 2018 8:32 PM

anganwadi's angry

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కదం తొక్కా రు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అంతకుముందు సర్కస్‌గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.విజయలక్ష్మి మాట్లాడుతూ మిషన్‌మోడ్‌లోకి తెచ్చి అంగన్‌వాడీ కేంద్రాలను స్వచ్చంధ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు సర్కారు యోచిస్తోందన్నారు. సీడీఆర్ స్వచ్చంధ సంస్థ జోక్యంతో వచ్చిన ఐకేపీ బాలబడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమృతహస్తంలో మె నూ చార్జీలు, కట్టెల బిల్లులు పెంచాలన్నారు. 2011 నాటి సకల జనుల సమ్మె కాలపు వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, కనీస వేతనం రూ.12500, పీఎఫ్ కాలపు వేతన సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు.

 జేసీ వ్యాఖ్యలపై మండిపాటు
 10 మంది నాయకులు కలెక్టరేట్‌లోకి వెళ్లి జేసీ సర్ఫరాజ్ అహ్మద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆ సమయంలో జేసీ నిర్లక్ష్యంగా మాట్లాడారని పేర్కొంటూ.. అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకురాళ్లకు జేసీ క్షమాపణ చెప్పాలంటూ భీష్మించారు. జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సంపత్‌ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేస్తుండగా అంగన్‌వాడీలు అడ్డుకున్నారు.

కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య కార్యాలయానికి చేరుకుని అంగన్‌వాడీ నాయకులతో మాట్లాడారు. జిల్లా పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, రాష్ట్ర పరిధిలోనివి ఉన్నతాధికారులకు నివేదిస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు జి.జ్యోతి, ప్రధాన కార్యదర్శి జి.రమాదేవి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వై.రవికుమార్, సంపత్, వనజ, కమల, రజిత, వనజారాణి, పుష్ప, భాగ్యరాణి, వింద్యారాణి, జె.భాగ్య, విమల, రాజేశ్వరి, ఉమారాణి, భార్గవి, జయప్రద తదితరులు పాల్గొన్నారు.

 జేసీ ఏమన్నారు..!
 ధర్నాలో భాగంగా పది మంది అంగన్‌వాడీ నాయకులు యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.జయలతతో కలిసి ప్రజావాణిలో ఉన్న జేసీ సర్ఫరాజ్ అహ్మద్‌కు వినతిపత్రం సమర్పించారు. అంగన్‌వాడీలో స్వచ్చంధ సంస్థల జోక్యం వద్దని, ఐకేపీ బాలబడులను నిర్వహించొద్దని సూచించారు. పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించాలని కోరారు. స్పందించిన జేసీ బడ్జెట్ రాగానే పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లిస్తామని, బాలబడుల విషయం ‘పాలసీమ్యాటర్’ అన్నారు. దీనికి అడ్డుచెప్పడంతో అసహనానికి గురైన జేసీ తనకే ఉచిత సలహాలిస్తారా అంటూ చిరాకు పడ్డారని అంగన్‌వాడీలు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement