m.veera bramhaiah
-
29న డీపీసీ ఎన్నికలు
కరీంనగర్ సిటీ : జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ముసాయిదా ఓటరు జాబితాను వెల్లడిస్తూ ఎన్నికల అధికారి ఎం.వీరబ్రహ్మయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నోటీసును జిల్లా పరిషత్‌తోపాటు అన్ని నగరపాలకసంస్థ, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో అతికించారు. మొత్తం 28 స్థానాలకు గాను 24 స్థానాలకు 29న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 4 స్థానాలను నామినేషన్ పద్ధతిన ప్రభుత్వం భర్తీ చేయనుంది. బీఆర్జీఎఫ్ తదితర కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న పనుల ప్రణాళిక రూపొందించడం, నిర్వహించడం ఈ కమిటీ విధులు. డీపీసీ ఆమోదం పొందిన తర్వాతే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తారు. డీపీసీకి చైర్‌పర్సన్‌గా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉంటారు. కమిటీ మెంబర్ సెక్రటరీగా కలెక్టర్ వ్యవహరిస్తారు. వీరిద్దరు, 28 మంది సభ్యులు కలిపి మొత్తం 30 మంది డీపీసీ ఉంటుంది. ఎన్నికల అధికారిగా కలెక్టర్ వీరబ్రహ్మయ్య వ్యవహరిస్తారు. రూరల్ నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం పరిధిలో 18 స్థానాలు ఉంటాయి. జిల్లాలోని 57 మంది జెడ్పీటీసీలు ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు అర్హులు. అర్బన్ నియోజకవర్గం అర్బన్ నియోజకవర్గం పరిధిలో 6 స్థానాలున్నాయి. జిల్లాలోని నగరపాలకసంస్థ, పురపాలక, నగరపంచాయతీల కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ స్థానాలకు పోటీచేయాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిసి ఈ ఆరుగురిని ఎన్నుకుంటారు. నియోజకవర్గానికొకరు డీపీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. జెడ్పీలో పూర్తిస్థాయి బలం ఉండడంతో మొత్తం స్థానాలను కైవసం చేసుకొనే దిశగా చర్యలు చేపట్టింది. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ శనివారం పార్టీ జెడ్పీటీసీలతో తన చాంబర్లో సమావేశమయ్యారు. పోటీకి చాలా మంది ఆశావహులు ముందుకు వస్తుండడంతో నిర్ణయాన్ని పార్టీకే వదిలేయాలని సమావేశం నిర్ణయించింది. కమిటీ సభ్యుల్లో జిల్లా అంతటికి ప్రాధాన్యత ఉండేలా నియోజకవర్గానికొకరు చొప్పున 13 మంది ఉండేలా చూస్తామని ఉమ తెలిపారు. మరో ఐదుగురిని ఐదుగురిని ఏ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. నామినేటెడ్‌పై నజర్ జిల్లా ప్రణాళిక కమిటీలో నలుగురు సభ్యులను నేరుగా నియమించే నిబంధన ఉండడంతో వీటిపై అధికార పార్టీ నాయకులు కన్నేశారు. ఇందులో ఒకటి మైనారిటీ కేటాయించగా, ఆ సీటుకు కూడా డిమాండ్ ఏర్పడింది. ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన నాయకులు, పార్టీయేతరులు కూడా ఈ స్థానం కేటాయించాలంటూ టీఆర్ఎస్ నేతల చుట్టూ తిరుగుతున్నారు. మిగతా మూడు స్థానాల కోసం జిల్లా మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
పరిషత్ పోరు షురూ!
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలోని 817 ఎంపీటీసీలు, 57 జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. పెద్దపల్లి, మంథని, జగిత్యాల డివిజన్లలో ఒకరోజు, కరీంనగర్, సిరిసిల్ల డివిజన్లలో మరో రోజు ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 57 జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. దీనికోసం జెడ్పీలో ఐదు ప్రత్యేక కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. ఎంపీటీసీ నామినేషన్లు సంబంధిత మండల పరిషత్ కార్యాలయంలో వేయా ల్సి ఉంటుంది. ఉదయం 10.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బ్యాలెట్ పద్ధతిన పార్టీ ప్రాతిపాదికనే ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన తిరస్కరణ ఓటు స్థానిక ఎన్నికల్లో ఉండదు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్లు అధికారులు విడుదల చేశారు. జెడ్పీ ఎన్నికల్లో 27 లక్షల 40 వేల 666 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణలో 15 వేల సిబ్బంది పాలుపంచుకోనున్నారు. రీపోలింగ్, కౌంటింగ్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదివారం పరిశీలించారు. అభ్యర్థులు లోపలికి ఒక ద్వారం నుంచి వచ్చి మరో ద్వారం గుండా బయటకు వెళ్లేలా వే ర్వేరు ద్వారాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బారీకేడ్లు ఏర్పాట్లు చేయాలని అభ్యర్థితోపాటు ఇద్దరిని మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు అనుమతించాలని చెప్పారు. మైక్, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. సహకరించాలి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ వివరించారు. పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని సూచించారు. సమావేశంలో జేసీ సర్ఫరాజ్ అహ్మద్, జెడ్పీ సీఈవో వి.సదానందం, డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్, డెప్యూటీ సీఈవో సత్యవతి, డీపీవో కుమారస్వామి, డెప్యూటి సీఈవో సత్యవతి, డీఎస్పీ రవీందర్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు ఎం.స్వామినాథాచార్యులు, కొరివి వేణుగోపాల్, వాసాల రమేశ్, కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, భీమాసాహెబ్ పాల్గొన్నారు. -
అంగన్వాడీల ఆగ్రహం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కదం తొక్కా రు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అంతకుముందు సర్కస్‌గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.విజయలక్ష్మి మాట్లాడుతూ మిషన్మోడ్లోకి తెచ్చి అంగన్వాడీ కేంద్రాలను స్వచ్చంధ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు సర్కారు యోచిస్తోందన్నారు. సీడీఆర్ స్వచ్చంధ సంస్థ జోక్యంతో వచ్చిన ఐకేపీ బాలబడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమృతహస్తంలో మె నూ చార్జీలు, కట్టెల బిల్లులు పెంచాలన్నారు. 2011 నాటి సకల జనుల సమ్మె కాలపు వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, కనీస వేతనం రూ.12500, పీఎఫ్ కాలపు వేతన సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. జేసీ వ్యాఖ్యలపై మండిపాటు 10 మంది నాయకులు కలెక్టరేట్‌లోకి వెళ్లి జేసీ సర్ఫరాజ్ అహ్మద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆ సమయంలో జేసీ నిర్లక్ష్యంగా మాట్లాడారని పేర్కొంటూ.. అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకురాళ్లకు జేసీ క్షమాపణ చెప్పాలంటూ భీష్మించారు. జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సంపత్‌ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేస్తుండగా అంగన్వాడీలు అడ్డుకున్నారు. కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య కార్యాలయానికి చేరుకుని అంగన్వాడీ నాయకులతో మాట్లాడారు. జిల్లా పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, రాష్ట్ర పరిధిలోనివి ఉన్నతాధికారులకు నివేదిస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు జి.జ్యోతి, ప్రధాన కార్యదర్శి జి.రమాదేవి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వై.రవికుమార్, సంపత్, వనజ, కమల, రజిత, వనజారాణి, పుష్ప, భాగ్యరాణి, వింద్యారాణి, జె.భాగ్య, విమల, రాజేశ్వరి, ఉమారాణి, భార్గవి, జయప్రద తదితరులు పాల్గొన్నారు. జేసీ ఏమన్నారు..! ధర్నాలో భాగంగా పది మంది అంగన్వాడీ నాయకులు యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.జయలతతో కలిసి ప్రజావాణిలో ఉన్న జేసీ సర్ఫరాజ్ అహ్మద్‌కు వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీలో స్వచ్చంధ సంస్థల జోక్యం వద్దని, ఐకేపీ బాలబడులను నిర్వహించొద్దని సూచించారు. పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించాలని కోరారు. స్పందించిన జేసీ బడ్జెట్ రాగానే పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లిస్తామని, బాలబడుల విషయం ‘పాలసీమ్యాటర్’ అన్నారు. దీనికి అడ్డుచెప్పడంతో అసహనానికి గురైన జేసీ తనకే ఉచిత సలహాలిస్తారా అంటూ చిరాకు పడ్డారని అంగన్వాడీలు ఆరోపించారు.