కరీంనగర్ సిటీ : జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ముసాయిదా ఓటరు జాబితాను వెల్లడిస్తూ ఎన్నికల అధికారి ఎం.వీరబ్రహ్మయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నోటీసును జిల్లా పరిషత్‌తోపాటు అన్ని నగరపాలకసంస్థ, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో అతికించారు. మొత్తం 28 స్థానాలకు గాను 24 స్థానాలకు 29న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 4 స్థానాలను నామినేషన్ పద్ధతిన ప్రభుత్వం భర్తీ చేయనుంది.
బీఆర్జీఎఫ్ తదితర కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న పనుల ప్రణాళిక రూపొందించడం, నిర్వహించడం ఈ కమిటీ విధులు. డీపీసీ ఆమోదం పొందిన తర్వాతే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తారు. డీపీసీకి చైర్‌పర్సన్‌గా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉంటారు. కమిటీ మెంబర్ సెక్రటరీగా కలెక్టర్ వ్యవహరిస్తారు. వీరిద్దరు, 28 మంది సభ్యులు కలిపి మొత్తం 30 మంది డీపీసీ ఉంటుంది. ఎన్నికల అధికారిగా కలెక్టర్ వీరబ్రహ్మయ్య వ్యవహరిస్తారు.
రూరల్ నియోజకవర్గం
రూరల్ నియోజకవర్గం పరిధిలో 18 స్థానాలు ఉంటాయి. జిల్లాలోని 57 మంది జెడ్పీటీసీలు ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు అర్హులు.
అర్బన్ నియోజకవర్గం
అర్బన్ నియోజకవర్గం పరిధిలో 6 స్థానాలున్నాయి. జిల్లాలోని నగరపాలకసంస్థ, పురపాలక, నగరపంచాయతీల కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ స్థానాలకు పోటీచేయాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిసి ఈ ఆరుగురిని ఎన్నుకుంటారు.
నియోజకవర్గానికొకరు
డీపీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం అధికార టీఆర్‌ఎస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. జెడ్పీలో పూర్తిస్థాయి బలం ఉండడంతో మొత్తం స్థానాలను కైవసం చేసుకొనే దిశగా చర్యలు చేపట్టింది. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ శనివారం పార్టీ జెడ్పీటీసీలతో తన చాంబర్లో సమావేశమయ్యారు. పోటీకి చాలా మంది ఆశావహులు ముందుకు వస్తుండడంతో నిర్ణయాన్ని పార్టీకే వదిలేయాలని సమావేశం నిర్ణయించింది. కమిటీ సభ్యుల్లో జిల్లా అంతటికి ప్రాధాన్యత ఉండేలా నియోజకవర్గానికొకరు చొప్పున 13 మంది ఉండేలా చూస్తామని ఉమ తెలిపారు. మరో ఐదుగురిని ఐదుగురిని ఏ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు.
నామినేటెడ్‌పై నజర్
జిల్లా ప్రణాళిక కమిటీలో నలుగురు సభ్యులను నేరుగా నియమించే నిబంధన ఉండడంతో వీటిపై అధికార పార్టీ నాయకులు కన్నేశారు. ఇందులో ఒకటి మైనారిటీ కేటాయించగా, ఆ సీటుకు కూడా డిమాండ్ ఏర్పడింది. ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన నాయకులు, పార్టీయేతరులు కూడా ఈ స్థానం కేటాయించాలంటూ టీఆర్‌ఎస్ నేతల చుట్టూ తిరుగుతున్నారు. మిగతా మూడు స్థానాల కోసం జిల్లా మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
29న డీపీసీ ఎన్నికలు
Published Sun, Dec 21 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM
Advertisement
Advertisement