
కడచూపు కూడా దక్కడంలేదు: విద్యార్థుల తల్లిదండ్రుల వేదన
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు తమకు కడచూపు కూడా దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలను ప్రాణాలతో తీసుకువెళతామని భావించామని, ఇప్పుడు కడచూపు కూడా దక్కకుండా వెళ్లాల్సి వస్తుందని సాక్షి టీవీ ఎదుట విలపిస్తూ చెప్పారు. ప్రమాదంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం బాధ్యాతరాహిత్యంగా వ్యవహరించిందని వారు ఆరోపిస్తున్నారు.
అనుభవజ్ఞులైన సిబ్బందిని టూర్‌కు పంపలేదన్నారు. లోకల్ గైడ్ కూడా తమ పిల్లల వెంటలేరని తెలిపారు. లోకల్ గైడ్ ఉంటే ప్రమాదం నుంచి తమ పిల్లలు బయటపడేవారని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ అంటే మరిచిపోలేని టూరిజం అని పేరందని, అయితే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ తమ జీవితాలలో మరిచిపోలేని విషాందం నింపిందని వారు వాపోయారు.
ఇదిలా ఉండగా, ఈరోజు కూడా మృతదేహాలేమీ లభ్యం కాలేదని మండి కలెక్టర్ దేవేశ్ కుమార్ చెప్పారు. పండో డ్యాం నుంచి నీటిని విడుదల చేయకుండానే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తాము అన్నిరకాల గాలింపు చర్యలు చేపట్టామన్నారు. 15 రోజుల్లో మృతదేహాలు వాటంతట అవే పైకి తేలుతాయని చెప్పారు. గల్లంతైన విద్యార్థులకు సంబంధించి మిస్సింగ్, డెత్ సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. మృతదేహాలను కనుగొన్న వెంటనే వాటిని హైదరాబాద్‌కు పంపుతామని చెప్పారు. గాలింపు చర్యల్లో ఇంతకు మించి వేరే పధ్దతులేమి మిగల్లేదన్నారు.