beas
-
విహారం..కారాదు విషాదం..
స్టడీ టూర్‌కు వెళ్లే విద్యార్థులకు బీమా తప్పనిసరి..! యూజీసీ తాజా మార్గదర్శకాలు అమలు చేయాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. బియాస్ బాధితుల కేసుపై తుదితీర్పు మే 23కు వాయిదా.. నేటికీ అందని కమిటీ నివేదిక.. సిటీబ్యూరో: మొన్న బియాస్...తాజాగా నేపాల్ దుర్ఘటన...రాష్ట్రం నుంచి ఏటా విజ్ఞాన, విహార, సాహస యాత్ర లకు వెళుతున్నవారి ఆచూకీ గల్లంతవుతుండడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. గతేడాది జూన్8 వ తేదీన నగరంలోని బాచుపల్లి వీఎన్ఆర్-వీజేఐటీ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ డ్యామ్ వద్ద అసువులు బాసిన విషయం విదితమే. ఈ దారుణ సంఘటన నుంచి విద్యార్థుల కుటుంబ సభ్యులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఈ దుర్ఘటనకు కళాశాల యాజమాన్యం, బియాస్ డ్యామ్ అధికారుల నిర్లక్ష్యమేకారణమని వారు ఆరోపిస్తున్నారు. స్టడీటూర్‌కు ఎలాంటి ప్రాంతాలకు వెళ్లాలి అన్న అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు, ప్రతి బృందానికి ఓ వైద్యుడు ఉండాలని, ప్రతి విద్యార్థికి బీమా సౌకర్యం కల్పించాల్సి బాధ్యత కళాశాలల యాజమాన్యాలపై ఉందన్నారు. ఇటీవల యూజీసీ విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని స్పష్టం చేసిందని వారు పేర్కొంటున్నారు. యూజీసీ తాజా మార్గదర్శకాలివే... స్టడీటూర్‌కు వెళ్లే విద్యార్థుల బృందంలో వైద్యుడు తప్పనిసరిగా ఉండాలి, సందర్శనా ప్రాంతాలపై క్షుణ్ణంగా తెలిసిన ఓ గైడ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ, భౌగోళిక పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. అక్కడి వాతావరణ పరిస్థితులు, లోయలు, వంకలు, వాగులు, కొండలు, నదీప్రవాహాలు, డ్యామ్‌లపై విద్యార్థులకు సమాచారం అందజేయాలి. సందర్శించాల్సిన ప్రాంతాలు, అక్కడి పరిస్థితులపై వారికి ముందుగానే వివరించాలి.బృందం వెంట ప్రథమ చికిత్స కిట్ ఉంచుకోవాలి.విద్యార్థుల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు అందజేసేందుకు ఆధునిక మొబైల్ఫోన్లు అందుబాటులో ఉంచుకోవాలి. స్టడీటూర్ లేదా సహాసయాత్రకు వెళ్లే వారి రక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మార్గదర్శకాలను అమలు చేయని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా యూజీసీ పేర్కొంది. మానని గాయం.. గతేడాది జూన్ 8న హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యామ్ అధికారుల నిర్లక్ష్యంకారణంగా 24 మంది విద్యార్థులు గల్లంతుకావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇందుకు సంబందించి తుదితీర్పును మే 23 వ తేదీకి వాయిదా వేసినట్లు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ‘సాక్షి’కి తెలిపారు. తమకు ఏపీ, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందించినా బిడ్డలను కోల్పోయిన బాధ నుంచి కోలుకోలేకపోతున్నామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నేటికీ అందని నివేదిక... బియాస్ ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శైలజారామయ్యర్ కమిటీ నివేదిక అందించడంలో తాత్సారం చేస్తోందని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తమ తప్పేమీ లేదని, స్టడీటూర్‌ను విద్యార్థులే ఏర్పాటు చేసుకున్నారని యాజమాన్యం బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నప్పటికీ కమిటీ నివేదిక అందజేయడంలో జాప్యం చేయడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘రిషిత’ ఇంట విషాదఛాయలు
జగద్గిరిగుట్ట(బాచుపల్లి), నల్లకుంట: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి రిషితారెడ్డి ఇంట ఆదివారం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతదేహం ఆదివారం లభించినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో నగరానికి చెందిన 16 మందిలో ఇప్పటి వరకు 15 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక నల్లకుంటకు చెందిన శ్రీహర్ష ఆచూకీ లభించాల్సి ఉంది. గల్లంతైన 42 రోజుల తరువాత రిషితారెడ్డి మృతదేహం లభ్యమైందన్న సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆమె మరణ వార్త తెలియడంతో కుప్పకూలిపోయారు. అమ్మానాన్నల కుటుంబాల తరఫున.. రిషితారెడ్డి అమ్మ తరఫున, ఇటు నాన్న బంధువుల్లో ఒకే ఒక ఆడపడుచు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఖ: సాగరంలో మునిగిపోయారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు రిషితఅంత్యక్రియలను బాచుపల్లి గ్రామంలోని శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు బంధువులు పేర్కొన్నారు. అంత్యక్రియల కోసం కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు, బాచుపల్లి పంచాయతీ పాలక వర్గం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇంకా ఎదురుచూపులే.. ఇక కల్లూరి శ్రీహర్ష (19) ఆచూకి నేటికి తెలియరాలేదు. నల్లకుంట శివం రోడ్డు బతుకమ్మ కుంట సబ్‌స్టేషన్ ఎదురు వీధిలోని శ్రీమత్ రాజాస్ రెసిడెన్సీలో ఉండే అడ్వకేట్ కేఆర్‌కేబీ.ప్రసాద్, స్వర్ణలత దంపతుల కుమారుడు కల్లూరి శ్రీహర్ష (19) గత నెల 8న బియాస్ నదిలో గల్లంతయ్యాడు. ఆదివారం మరో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు లభ్యం కాగా గల్లంతైన వారిలో నల్లకుంటకు చెందిన శ్రీ హర్ష జాడ నేటికి తెలియరాలేరు. -
నగర విద్యార్థులకు జలగండం
మొన్న బియాస్.. నిన్న డిండి.. నేడు సరయూ.. 21 మంది మృత్యువాత తాజాగా సరయూ నదిలో మరో ఇద్దరి గల్లంతు నెలరోజుల్లోనే మూడు దుర్ఘటనలు ఆందోళన చెందుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు నగర విద్యార్థులకు జలగండం పొంచి ఉన్నట్టుంది. నెలరోజుల వ్యవధిలో వరుసగా జరిగిన మూడు ఘటనలను పరిశీలిస్తే ఇలాంటి అనుమానమే కలుగుతోంది. ఆయా నదులు, ప్రాజెక్టుల్లో సరాదాగా ఫొటోలు దిగుతున్న సమయంలోనే విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తమ పిల్లల బంగారు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కడుపుకోతను భరించలేకతల్లడిల్లిపోతున్నారు. నగర విద్యార్థులు బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు జలాశయాల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. నెలరోజుల వ్యవధిలోనే వేర్వేరు ప్రమాదాల్లో నగరానికి చెందిన 21 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. తాజాగా బుధవారం సరయూ నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతవడం కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. నగర వాసులనూ తీవ్రంగా కలిచివేసింది. గత నెలలో హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో 16 మంది సిటీ విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయి మరణించిన హృదయవిదారక ఘటన మరవక ముందే.. గత సోమవారం నల్లగొండ జిల్లా డిండి రిజర్వాయర్‌లో మరో ఐదుగురు మృత్యువాత పడడం కలకలం సృష్టించింది. తాజాగా బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని సరయూ నదిలోకి సరదాగా దిగిన మరో ఇద్దరు విద్యార్థులు గల్లంతవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలను పరిశీలిస్తే.. జలక్రీడలు, జలపాతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ సరదాగా గడపడంతోపాటు ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించేందుకు మక్కువ చూపుతోన్న విద్యార్థులుసరదా మాటున పొంచిఉన్న ప్రమాదాల బారిన పడుతున్నారని తెలుస్తోంది. అక్కడి పరిస్థితులను పసిగట్టలేకపోవడం వల్లే ప్రమాదాలకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏదేని కొత్త ప్రాంతానికి వెళ్లిన వారికి ఆయా ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు, జలాశయాలు, నదుల ప్రవాహ రీతులు, లోతు, ప్రమాదం జరిగేంద ుకు ఆస్కారమున్న ప్రదేశాలపై సంపూర్ణ అవగాహన లేకపోవడం కూడా కారణమని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు గల్లంతైన విద్యార్థుల్లో ఈత రానివారే అధికంగా ఉన్నారు. ఒకవేళ మోస్తరుగా ఈత వచ్చినా.. గతంలో స్విమ్మింగ్ పూల్‌లో ఈదిన అనుభవం మినహా సువిశాలమైన జలాశయాల్లో ఈదే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవడం కూడా శాపంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. వాటర్‌గేమ్స్‌తో సేదదీరాలనుకొని పర్యాటక, అధ్యయన టూర్లకు వెళ్తున్న నగర విద్యార్థులు తమ వెంట లైఫ్‌జాకెట్లు తీసుకెళ్లకపోవడం, కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, కనీసం వాటిని వెంట తీసుకెళ్లాలని చెప్పే వారూ లేకపోవడంతోనే వరుస అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు. పరిష్కారమార్గాలివే... ఆయా జలాశయాల వద్ద వరుసగా జరుగుతున్న దుర్ఘటనల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖ కెరీర్ కౌన్సెలింగ్ నిపుణుడు, సామాజిక వేత్త ఆకెళ్ల రాఘవేంద్ర సూచిస్తున్న పరిష్కారాలివీ... విద్యార్థులు నగరం దాటి పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు కళాశాల యాజమాన్యాలు లేదా తల్లిదండ్రులు, టూరు నిర్వాహకులు కనీస జాగ్రత్తలను విధిగా వారికి చెప్పాలి. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే ఘోర దుర్ఘటనలు జరుగుతున్నాయి. సంబంధిత పర్యాటక ప్రదేశంపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు కంప్యూటర్ ద్వారా ప్రజెంటేషన్ చూపించాలి. గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ టెక్నాలజీ ఆధారంగా ప్రజెంటేషన్ సాగాలి. వెళ్లే ప్రాంతంపై ముందుగా భౌగోళిక అవగాహన కల్పించాలి. అక్కడి వాతావరణ అనుకూలతలు, ప్రతికూల పరిస్థితులపై అవగాహన కల్పించాలి. తగిన జాగ్రత్తలు సూచించినప్పుడు విద్యార్థులు సైతం వినాల్సి ఉంటుంది. ప్రమోదం మాటునే ప్రమాదం పొంచి ఉందన్న విషయం మరవరాదు. ప్రస్తుత విద్యావిధానంలో తరగతి గదులు, ప్రత్యేక క్లాసులతో బిజీ అవుతున్న విద్యార్థులకు ఈత వంటి ఆత్మరక్షణ అంశాల్లో ప్రావీణ్యం లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు, క ళాశాలల యాజమాన్యాలు చొరవ తీసుకొని వీటిని నేర్పించేందుకు కృషిచేయాలి. కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు విధిగా ఆయా ప్రాంతాల్లో పర్యాటక శాఖ గుర్తింపు పొందిన గైడ్‌ను వెంట తీసుకెళ్లాలి. బృందాలుగా పర్యటన చేస్తున్న సమయంలో సదరు విషయాన్ని అక్కడి స్థానిక రెవెన్యూ, పోలీసు యంత్రాగానికి తెలపాలి. అప్పుడే అనర్థాలు జరిగినపుడు వెంటనే వారు రంగంలోకి దిగే వీలుంటుంది. ముందుగానే తగిన జాగ్రత్తలు సూచించే వీలుంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు పరిసరాల పట్ల ఆచితూచి వ్యవహరించాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కెమెరాల్లో ఫొటోలు బంధిస్తున్నప్పుడు అదుపుతప్పి నీటిలో జారిపడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో నీటిలోకి దిగాల్సి వస్తే లైఫ్ జాకెట్లు ధరించాలి. తేలికపాటి బోట్లు, స్థానికుల సహకారం తీసుకోవాలి. వెంట తీసుకెళ్లే ఫ్యాకల్టీ విద్యార్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. -
బియాస్లో మరో మృతదేహం లభ్యం
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్‌నదిలో గల్లంతైన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం జరుపుతున్న గాలింపులో బుధవారం మరో మృతదేహం లభ్యమైంది. దీంతో 18 మంది విద్యార్థుల మృతదేహాలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. కాగా, బుధవారం లభ్యమైన మృతదేహం రిధిమా పాపానిదిగా గుర్తిం చారు. గల్లంతైన వారిలో ఇద్దరు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలతోపాటు టూర్ ఆపరేటర్ జాడ తెలియాల్సి ఉందన్నారు. రిధిమా మృతదేహాన్ని గురువారం విమానంలో తిరుపతికి పంపిస్తున్నారు. విద్యార్థులందరి మృత దేహాలు కనుగొని వారి తల్లిదండ్రులకు అప్పగించేంత వరకు అక్కడే ఉండాలని పర్యవేక్షణాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బాధితులకు రూ.5 లక్షల పరిహారమివ్వండి సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 24 మంది హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారం ఆదేశించింది. లార్జీ ప్రాజెక్టు నిర్వాహకులు, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యం కలిసి చెరిసగం చొప్పున ఈ పరిహారం చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్సూర్ అహ్మద్ మిర్, న్యాయమూర్తి జస్టిస్ తర్లోక్‌సింగ్ చౌహాన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీచేసింది. -
ఆప్టిమిస్ట్ మాస్కు వేసుకుని తిరగలేక పోతున్నా
బియాస్ విహారయాత్రకు వెళ్లి ఫోటోల మోజుతో జీవితాన్ని విషాదయాత్రగా ముగించిన 24 మంది విద్యార్థుల విషాదాంతాన్ని చూసి తట్టుకోలేక ఒక ఇంజినీరింగ్ విద్యార్థి రాసిన లేఖ... నువ్వు తిరిగిరానందుకు బాధ కన్నా, అలా రాకపోవడానికి వెనకున్న కారణాలు చూస్తుంటే చాలా కోపంగా ఉంది! ‘హ్యావింగ్ ది బెస్ట్ టైమ్’ అని వాట్సప్‌లో స్టేటస్ పెట్టిన గంటలోనే ప్రపంచం తలకిందులైంది. ఇంకా నమ్మబుద్ధి అవట్లేదు. నువ్వు తిరిగొస్తావులే అని ముఖానికి ఆప్టిమిస్ట్ మాస్కు వేసుకుని తిరగలేక పోతున్నా. ఈ ఘటనలో వ్యవస్థను తప్పు పట్టలేం. వ్యవస్థ అది! తప్పులు చేయడం దాని నైజం. అయినా మన స్నేహంలో ఉన్నది ఇద్దరే వ్యక్తులు! నువ్వు - నేను! అంతే! అందుకే నేను నిన్నే తప్పుబడుతున్నాను... అర్థం లేదన్నా, మానవత్వం కాదన్నా! కోపం వల్ల, బాధ వల్ల నా నైతిక విలువలు మసకబారిపోయాయి. ఏరా! చూడని మొహమా నాది! మర్చిపోయేదా! జ్ఞాపకాలు మదిలో ఉంటే చాలవా? నీ పీసీలోని డిడ్రైవ్లో కూడా ఉండాలని ఉందా? చేతిలో కెమెరానో, స్మార్ట్ఫోనో ఉందని అస్తమానం ఫొటోలు తీసుకోవడం! ఒకటి రెండు అయితే అనుకోవచ్చు. అక్కడికి వెళ్లిందే ఫొటోల కోసం అన్నట్లుగా అన్నన్ని ఫొటోలు అవసరమా? అదీ కొండరాళ్ళూ, బండరాళ్ళూ నిండిన నదిలో అంత లోపలకంటూ వెళ్ళి! ఆ గంట కాలానికి నీ చేతిలో కెమెరా, సెల్‌ఫోన్ లేకుండా ఉండుంటే నువ్వు ఇప్పటికీ నా పక్కనే ఉండేవాడివేమో. అడుగడుగుకూ ప్లేస్ అప్డేట్స్, లొకేషన్ చెకిన్లు... ఈ దిక్కుమాలిన సోషల్ మాయలో పడి ఒక రకమైన ఆత్మన్యూనతకి నిదర్శనం అవుతోంది ఈ సమాజం. ఆ మందలో నువ్వూ కొట్టుకొని వెళ్లిపోయావు. రాయి కనబడితే సెల్ఫీ, వాగూ వంకా ఎదురుపడితే సెల్ఫీ. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలే! అసలీ సెల్ఫీ కల్చర్‌ని పరిచయం చేసిన వాడి చెంప పగలగొట్టాలని ఉంది! కానీ ఎంత చెప్పినా, ఏమనుకున్నా మన చేతుల్లో ఏదీ లేదు. ప్రమాదం జరిగిన క్షణం ముందు వరకు కూడా ఇలా అవుతుందని ఎవరూ అనుకొని ఉండరు. క్షణంలో చక్రాలు తిరిగిపోయాయి. క్షణానికి ఇంత విలనీ ఉందా? ఆశలు, ఆశయాలను అనాథలుగా చేసి వెళ్లిపోయావా నేస్తం! ఒకరి తప్పుల నుండి సమాజం తన తప్పు తెలుసుకుంటుందని తెలుసు... కానీ ఆ తప్పులకు మూల్యం నీ ప్రాణం అని ఊహించలేకపోయానురా! - శశ్రీక్ -
బియాస్ నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యం
-
కడచూపు కూడా దక్కడంలేదు: విద్యార్థుల తల్లిదండ్రుల వేదన
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు తమకు కడచూపు కూడా దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలను ప్రాణాలతో తీసుకువెళతామని భావించామని, ఇప్పుడు కడచూపు కూడా దక్కకుండా వెళ్లాల్సి వస్తుందని సాక్షి టీవీ ఎదుట విలపిస్తూ చెప్పారు. ప్రమాదంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం బాధ్యాతరాహిత్యంగా వ్యవహరించిందని వారు ఆరోపిస్తున్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని టూర్‌కు పంపలేదన్నారు. లోకల్ గైడ్ కూడా తమ పిల్లల వెంటలేరని తెలిపారు. లోకల్ గైడ్ ఉంటే ప్రమాదం నుంచి తమ పిల్లలు బయటపడేవారని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ అంటే మరిచిపోలేని టూరిజం అని పేరందని, అయితే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ తమ జీవితాలలో మరిచిపోలేని విషాందం నింపిందని వారు వాపోయారు. ఇదిలా ఉండగా, ఈరోజు కూడా మృతదేహాలేమీ లభ్యం కాలేదని మండి కలెక్టర్ దేవేశ్ కుమార్ చెప్పారు. పండో డ్యాం నుంచి నీటిని విడుదల చేయకుండానే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తాము అన్నిరకాల గాలింపు చర్యలు చేపట్టామన్నారు. 15 రోజుల్లో మృతదేహాలు వాటంతట అవే పైకి తేలుతాయని చెప్పారు. గల్లంతైన విద్యార్థులకు సంబంధించి మిస్సింగ్, డెత్ సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. మృతదేహాలను కనుగొన్న వెంటనే వాటిని హైదరాబాద్‌కు పంపుతామని చెప్పారు. గాలింపు చర్యల్లో ఇంతకు మించి వేరే పధ్దతులేమి మిగల్లేదన్నారు. -
''హిమాచల్ ఘటనపై విచారణకు ఆదేశం''