ఆప్టిమిస్ట్ మాస్కు వేసుకుని తిరగలేక పోతున్నా
బియాస్ విహారయాత్రకు వెళ్లి ఫోటోల మోజుతో జీవితాన్ని విషాదయాత్రగా ముగించిన 24 మంది విద్యార్థుల విషాదాంతాన్ని చూసి తట్టుకోలేక ఒక ఇంజినీరింగ్ విద్యార్థి రాసిన లేఖ...
నువ్వు తిరిగిరానందుకు బాధ కన్నా, అలా రాకపోవడానికి వెనకున్న కారణాలు చూస్తుంటే చాలా కోపంగా ఉంది! ‘హ్యావింగ్ ది బెస్ట్ టైమ్’ అని వాట్సప్‌లో స్టేటస్ పెట్టిన గంటలోనే ప్రపంచం తలకిందులైంది. ఇంకా నమ్మబుద్ధి అవట్లేదు.
నువ్వు తిరిగొస్తావులే అని ముఖానికి ఆప్టిమిస్ట్ మాస్కు వేసుకుని తిరగలేక పోతున్నా.
ఈ ఘటనలో వ్యవస్థను తప్పు పట్టలేం. వ్యవస్థ అది! తప్పులు చేయడం దాని నైజం. అయినా మన స్నేహంలో ఉన్నది ఇద్దరే వ్యక్తులు!
నువ్వు - నేను! అంతే! అందుకే నేను నిన్నే తప్పుబడుతున్నాను... అర్థం లేదన్నా, మానవత్వం కాదన్నా!
కోపం వల్ల, బాధ వల్ల నా నైతిక విలువలు మసకబారిపోయాయి.
ఏరా! చూడని మొహమా నాది! మర్చిపోయేదా! జ్ఞాపకాలు మదిలో ఉంటే చాలవా? నీ పీసీలోని డిడ్రైవ్‌లో కూడా ఉండాలని ఉందా?
చేతిలో కెమెరానో, స్మార్ట్‌ఫోనో ఉందని అస్తమానం ఫొటోలు తీసుకోవడం! ఒకటి రెండు అయితే అనుకోవచ్చు. అక్కడికి వెళ్లిందే ఫొటోల కోసం అన్నట్లుగా అన్నన్ని ఫొటోలు అవసరమా? అదీ కొండరాళ్ళూ, బండరాళ్ళూ నిండిన నదిలో అంత లోపలకంటూ వెళ్ళి! ఆ గంట కాలానికి నీ చేతిలో కెమెరా, సెల్‌ఫోన్ లేకుండా ఉండుంటే నువ్వు ఇప్పటికీ నా పక్కనే ఉండేవాడివేమో.
అడుగడుగుకూ ప్లేస్ అప్‌డేట్స్, లొకేషన్ చెకిన్‌లు... ఈ దిక్కుమాలిన సోషల్ మాయలో పడి ఒక రకమైన ఆత్మన్యూనతకి నిదర్శనం అవుతోంది ఈ సమాజం. ఆ మందలో నువ్వూ కొట్టుకొని వెళ్లిపోయావు.
రాయి కనబడితే సెల్ఫీ, వాగూ వంకా ఎదురుపడితే సెల్ఫీ. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలే! అసలీ సెల్ఫీ కల్చర్‌ని పరిచయం చేసిన వాడి చెంప పగలగొట్టాలని ఉంది!
కానీ ఎంత చెప్పినా, ఏమనుకున్నా మన చేతుల్లో ఏదీ లేదు. ప్రమాదం జరిగిన క్షణం ముందు వరకు కూడా ఇలా అవుతుందని ఎవరూ అనుకొని ఉండరు. క్షణంలో చక్రాలు తిరిగిపోయాయి. క్షణానికి ఇంత విలనీ ఉందా?
ఆశలు, ఆశయాలను అనాథలుగా చేసి వెళ్లిపోయావా నేస్తం! ఒకరి తప్పుల నుండి సమాజం తన తప్పు తెలుసుకుంటుందని తెలుసు... కానీ ఆ తప్పులకు మూల్యం నీ ప్రాణం అని ఊహించలేకపోయానురా!
- శశ్రీక్