
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుతో ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ(అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్) చైర్మన్ అనిల్ అంబానీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయానికి వచ్చిన అనిల్‌ను సీఎం బయటికొచ్చి సాదరంగా ఆహ్వానించి తన కార్యాలయంలోకి తీసుకెళ్లారు. ఇద్దరూ గంటకుపైగా ఏకాంతంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి నూతన రాజధాని నిర్మాణంపై వారు చర్చించినట్టు, ఈ సందర్భంగా సీఎంను అనిల్ అంబానీ అభినందించినట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం చేపట్టడాన్ని అనిల్ అంబానీ ప్రశంసించారని పేర్కొంది. రాష్ట్రంలోని నెల్లూరు, విశాఖ ప్రాంతాల్లో విద్యుత్, మౌలిక వసతుల ప్రాజెక్టులను అనిల్ అంబానీ గ్రూపు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆయన సీఎంను కలవడం చర్చనీయాంశమైంది. రాజధాని నిర్మాణంతోపాటు పలు రాజకీయ అంశాలు తాజా భేటీలో వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. కొద్ది రోజులక్రితం ముఖేష్ అంబానీ సైతం చంద్రబాబును కలవడం తెలిసిందే. అనిల్ అంబానీ సోమవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment