అన్నక్యాంటీన్‌లో భోజనం చేస్తున్న మంత్రి ఆది, కలెక్టర్
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాణిజ్యరంగంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆయన కలెక్టర్ హరికిరణ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం క్యాంటీన్ భోజనాన్ని రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం 35 పట్టణాల్లో 100 క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయన్నారు. ఫుల్ భోజనం చేయాలంటే రూ.40 నుంచి రూ.70లు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం మాత్రం రూ.5లకే టిఫిన్, భోజనం అందిస్తోందన్నారు. రూపాయికే కిలో బియ్యం, 9 రకాల పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు.
దేశంలోనే ఇదొక మైలురాయిఐ కలెక్టర్
కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ఈరోజు కడప, ప్రొద్దుటూరులో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, మరో వారంలో రాయచోటిలో ప్రారంభం అవుతుందన్నారు. పేదవాళ్లు జేబులో డబ్బుల్లేవని ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆహార భద్రతలో దేశంలోనే ఇదొక మైలురాయి అని తెలిపారు. అన్న క్యాంటీన్లకు సంబంధించి ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీకి తాను అధ్యక్షత వహించానని, తెలంగాణ, తమిళనాడులో ఇలాంటి క్యాంటీన్లు ఉన్నప్పటికీ వాటికంటే మెరుగ్గా అన్న క్యాంటీన్లను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. నాణ్యతపరమైన సమస్యలు తలెత్తకుండా ఇస్కాన్‌కు చెందిన అక్షయపాత్ర అనే విభాగానికి వీటిని అప్పగించామని, వారికి నాణ్యతలో అంతర్జాతీయ గుర్తింపు ఉందన్నాన్నారు. రెండు, మూడు విడతల్లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదివారం క్యాంటీన్‌కు సెలవు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. లవన్న, డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా, ఎన్‌సీసీ సంస్థ ప్రతినిధి రామచంద్రరావు, టీడీపీ నాయకులు బి. హరిప్రసాద్, గోవర్థన్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, జిలానీబాషా, ఏ, రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment