వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఆది సతీమణి అరుణ
ఎర్రగుంట్ల (వైఎస్సార్ కడప): ఎర్రగుంట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో శ్రీ దేవగుడి శంకర్‌రెడ్డి సుబ్బారామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ ఆస్పత్రి సూపర్ స్ఫెషాలిటీ వైద్యులు ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అయితే రోగులను పరీక్షించి, మందులను బయట కొనుక్కోవాలని చీటీలు రాసిచ్చారు. ఈ పరిస్థితిలో మంత్రి ఆదినారాయణరెడ్డి వైద్య శిబిరాన్ని సందర్శించారు. మందులు రాసిచ్చిన విషయాన్ని రోగులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆది స్పందిస్తూ మందులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మందులు తెప్పించాలని ఆదేశించారు. అప్పటికే చాలా మంది రోగులు చీటీలతో వెళ్లిపోయారు. ఈ శిబిరాన్ని మంత్రి ఆది సతీమణి అరుణ, తనయుడు సుధీర్‌రెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమంలో నారాయణ ఆస్పత్రి గుండె, చర్మ, ఆర్థోఫెడిక్ తదితర వ్యాధుల వైద్య నిపుణులు రోగులను పరీక్షించారు. మందులు ఇవ్వకుండా చీటీలు రాసివ్వడంపై చాలా మంది రోగులు నిరాశకు గురయ్యారు. మంత్రి ఆదేశాలతో ఎర్రగుంట్లలోని ఓ ప్రైవేట్ మెడికల్ షాపు నుంచి మందులు తెప్పించి ఉన్న రోగులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి ఆది సోదరుడు జయరామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముసలయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ జెక్కు చెన్నకృష్ణారెడ్డి, కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment