
అన్నమయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
రాజంపేట (వైఎస్సార్ జిల్లా): టీటీడీ ఆధ్వర్యంలో అన్నమాచార్యుల 607వ జయంతి ఉత్సవాలు మంగళవారం వైఎస్సార్ జిల్లా తాళ్లపాకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో తొలిరోజు ఉదయం నాదస్వర సమ్మేళనం అనంతరం సప్తగిరి గోష్ఠిగానం నిర్వహించారు. అన్నమయ్య చిత్రపటాన్ని ఊరేగించి నగర సంకీర్తన నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణ తో తాళ్లపాక మారుమోగింది. ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల నుంచి తీసుకువచ్చిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు అన్నమాచార్య ధ్యానమందిర ఆవరణలో కల్యాణం నిర్వహించారు.
అన్నమయ్య వంశం 12వ తరానికి చెందిన హరినారాయణాచార్యులు, విజయరాఘవ, కుప్పా రాఘవాచార్యులు, వెంకటనాగభూషణం, శేషధర్ రవికుమార్, రాఘవ అన్నమాచార్యులు, నారాయణాచార్యులను టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సత్కరించారు. ఈ సందర్భంగా తాళ్లపాక అభివృద్ధికి కృషి చేయాలని స్థానికులు ఆయనకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యుడు పుట్టాసుధాకర్ యాదవ్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ పాల్గొన్నారు.