సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ముగి శాయి. ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో తొమ్మిది రోజుల పాటు సాగిన ఉత్సవాలకు వీడ్కోలు పలికారు. సమైక్యాంధ్ర ఉద్యమ సెగలోనూ భక్తులు అష్టకష్టాలు పడి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈసారి నూతన స్వర్ణరథం ఊరేగింపు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అశేష జనవాహిని మధ్య చక్రస్నానం
బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు కన్యామాసం(అధిక భాద్రపదం) ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం పవిత్రముహూర్తాన చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుష్కరిణి ఒడ్డున ఉన్న వరాహస్వామి ఆలయ ఆవరణలో సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఉభయ దేవేరులతో సహా మలయప్పస్వామికి స్నపన తిరుమంజన(సుగంధ ద్రవ్యాలతో అభిషేకం) కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత మంగళధ్వనులు, పండితుల వేద ఘోష, అశేష భక్తజనుల గోవింద నామస్మరణ మధ్య గర్భాలయంలోని మూలమూర్తి అంశమైన సుదర్శన చక్రతాళ్వార్‌కు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయం నుంచి సూర్యాస్తమయం వరకు పుష్కరిణిలో పుణ్యస్నానమాచరిస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తొలగుతాయని పురాణ ప్రశస్తి. ఇందులో భాగంగా ఆదివారం వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు.
ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవం
తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ధ్వజపటాన్ని అవరోహణం చేసి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు.
స్వర్ణరథమే ప్రత్యేక ఆకర్షణ
ఈసారి బ్రహ్మోత్సవాలకు స్వర్ణరథమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేని విధంగా రూ.25 కోట్లతో అతి పెద్ద స్వర్ణరథాన్ని టీటీడీ ఇంజినీర్లు తయారు చేశారు. ప్రయోగాత్మక పరిశీలనలో అనేక అవాంతరాలు వచ్చినా వాటిని తొలగించడంతో అధికార్లు, ఇంజినీర్లు సఫలీకృ తులయ్యారు. నిర్ణయించిన శుభముహూర్తంలోనే విజయవంతంగా కొత్త స్వర్ణరథాన్ని ఊరేగించి భక్తులను ఆనందడోలికల్లో ముంచెత్తారు. మిగిలిన వాహన సేవల్లో భక్తులు పలుచగా కనిపించినా గరుడ సేవ రోజు సుమారు రెండున్నర లక్షల మంది స్వామిని దర్శించుకోవడం విశేషం.
4.48 లక్షల మందికి శ్రీవారి దర్శనం
ఈసారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిది రోజుల్లో 4,48,416 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్టు టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు. గతేడాది వార్షిక ఉత్సవాల కంటే ఈసారి 5.47 శాతం తక్కువని ఈవో వెల్లడించారు. గత ఏడాది శ్రీవారి హుండీద్వారా రూ.12.9 కోట్లు రాగా ఈసారి రూ.12 కోట్లమేర కానుకలందాయన్నారు. గత ఏడాది 2 లక్షలా 34 వేల మంది తలనీలాలు సమర్పించగా ఈసారి 2 లక్షలా 23 వేల మంది ఇచ్చారు. జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ అందరి సహకారంతో ఉత్సవాలు ఘనంగా ముగిశాయన్నారు.
కాలిబాట భక్తులకు ఉచిత లడ్డూ: బాపిరాజు
అందరి సహకారంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు విలేకరులకు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో కాలినడకన వచ్చిన భక్తులకు తొమ్మిది రోజుల్లో లక్షా అరవై వేల లడ్డూలు ఉచితంగా అందజేశామన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసంలోనూ అన్నప్రసాదం (ఉచిత భోజనం) అందించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ఆగమ కైంకర్యంతో అనుబంధం ఉన్న శ్రీవారికి వెండి రథం తయారు చేస్తామని తెలిపారు.