సీఎంతో సాఫ్ట్‌బ్యాంక్ సీఈవో భేటీ
తీరు మార్చుకోవాలని వినతి.. భరోసా ఇవ్వని సర్కార్
సాక్షి, హైదరాబాద్: రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అంశంపై ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు సాఫ్ట్‌బ్యాంక్ మరో ప్రయత్నం చేసింది. సౌర, పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని ప్రభుత్వాన్ని తాజాగా కోరింది. హైదరాబాద్‌లో ఒక హోటల్‌లో బస చేసిన సంస్థ సీఈవో మసాయోషీ సోన్ మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. వీరిమధ్య ఇంధన రంగంలో పెట్టుబడులపై చర్చ జరిగింది.
అయితే ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. సౌర పలకలు చెప్పినచోటే కొనాలన్న, విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి బిడ్డింగ్‌కు వెళ్లాలన్న నిబంధనలపై పునరాలోచించాలని సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధులు కోరారు. దీనికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. కాగా బిడ్డింగ్‌కు వెళ్లాలన్న నిబంధనపై సంస్థ కొంతమేరకు సుముఖత తెలిపినట్టు సమాచారం. లాభసాటిగా ఉంటే తప్పక బిడ్డింగ్ విధానాన్ని అనుసరిస్తామని చెప్పినట్టు తెలిసింది.
సహకరించమని కోరిన సీఎం
రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ నష్టాలు గణనీయంగా తగ్గించామని, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సౌర, పవన విద్యుత్ రంగంలో పెట్టుబడులు లాభసాటి అని సీఎం వివరించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి సాఫ్ట్‌బ్యాంక్ చేయూత కోరినట్టు, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్‌లోనూ తోడ్పాటు అందించాలని సీఎం సూచించినట్టు తెలిపింది.
సాఫ్ట్‌బ్యాంక్ సీఈవో సోన్ మీడియాతో మాట్లాడుతూ.. సౌర, పవన విద్యుత్ ఉత్పాదనలో ఏపీ చేస్తున్న కృషిలో భాగస్వాములవ్వాలనే ఆసక్తి తమకున్నట్టు చెప్పారు. భారతదేశంలో రాబోయే పదేళ్లలో 20 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను సౌర, పవన విద్యుత్ రంగంలో పెడతామని చెప్పారు. సీఎంతో జరిగిన భేటీలో జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ అధ్యక్షుడు నికేష్ అరోరా, భారతీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్గత జల రవాణాతో అభివృద్ధి: సీఎం
అంతర్గత జల రవాణా ద్వారా అభివృద్ధి సాధించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. జల రవాణా మాస్టర్ ప్లాన్‌ను ఆయన మంగళవారం సమీక్షించారు. కాకినాడ-పాండిచ్చేరి, కాకినాడ-భద్రాచలం మార్గాలను సమీపంలోని పోర్టులతో అనుసంధానించాలని సూచించారు. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులను కోస్తా నగరాలుగా అభివృద్ధి చేయడం కోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జల రవాణా రంగం అభివృద్ధికి సింగపూర్ మారిటైం యూనివర్సిటీ, కొరియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇతర అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు.
సాఫ్ట్‌బ్యాంక్ మరో ప్రయత్నం
Published Wed, Jun 24 2015 1:08 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement
Advertisement