విశాఖపట్నం : తాజాగా మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్ వంతల వసంతను పోలీసులు అరెస్టు చేయడం ఉద్యమానికి మరో లోటు ఏర్పడింది. ఇప్పటికే అగ్రనాయకుల్లో కొందరు మరణించగా అనేక మంది పోలీసులకు లొంగిపోయారు. దీంతో మన్యంలో మావోయిస్టు పార్టీ బలహీనపడింది. పార్టీని పునర్నిర్మించేందుకు కేంద్ర కమిటీ దృష్టిసారిస్తున్న తరుణంలో తాజా అరెస్టులు అన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
జీకేవీధి మండలానికి చెందిన ఈస్ట్ విశాఖ జాయింట్ డివిజన్ మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్ వంతల వసంతలో పాటు కొయ్యూరుకు చెందిన ముగ్గురు మిలీషియా సభ్యులు పొంగి సత్తిబాబు, పొంగి కామేశ్వరరావు, గెమ్మిలి గోవిందరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజానికి కొద్ది రోజుల ముందే వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారించినట్లు తెలిసింది. చిన్న వయసులోనే ఉద్యమంలోకి వెళ్లిపోయిన వసంతపై నాలుగు లక్షల రివార్డు ఉందంటే దళంలో ఆమె ప్రాధాన్యం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. మిలీషియా సభ్యులు కూడా కమాండర్ స్థాయిలో పనిచేసిన వారే. అంటే ఇటు మావోయిస్టు పార్టీని, అటు వారికి అనుబంధంగా ఉండే కమిటీలను బలహీన పరిచేందుకు పోలీసులు వ్యూహ రచన చేస్తున్నారని ఈ సంఘనటతో మరోసారి స్పష్టమైంది.
ఏడాదిగా ఇదే తీరు..
ఏడాది కాలంగా మావోయిస్టుల్లో పెద్ద పెద్ద నేతలే లొంగుబాట పట్టారు. కొందరిని పోలీసులు పట్టుకున్నారు. కోరుకొండ ఏరియా కమిటీ డిప్యూటీ కమాండర్ వంతల మల్లేష్ అప్పటి డీఐజీ రవిచంద్ర ఎదుట లొంగిపోయి మావోయిస్టులకు పెద్ద షాక్ ఇచ్చాడు. దాని నుంచి తేరుకోకముందే పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు పంగి సోమరాజు, దళ సభ్యులు వంతల చిన్నంనాయుడు, సన్నంనాయుడు, మిలీషియా సభ్యుడు పంగి చంటిలు అప్పటి ఎస్పీ కోయప్రవీణ్ ఎదుట లొంగిపోవడంతో దళానికి మరోదెబ్బ తగిలింది. పంగి భాస్కరరావు అలియాస్ సూర్యం, పంగి అప్పన్న అలియాస్ రామన్న, కొర్రా శ్రీరాములుతో పాటు 64 మంది మిలీషియా సభ్యులు, 18 మంది సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. 9 మంది దళ సభ్యులతో పాటు ఒక ఏసీఎం, 91 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారు.
పెరిగిన పోలీసు నిఘా
మన్యంలో మావోయిస్టులను బలహీన పరిచేందుకు గతేడాది నుంచి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వందలాది మంది పోలీసులను ఉన్నతాధికారులు ఏజెన్సీలో ప్రవేశపెట్టారు. అత్యాధునిక అయుధాలు, వైర్‌లెస్ సెట్లు, వాహనాలను వారికి సమకూర్చారు. కాలి నడకన కిలోమీటర్ల కొలదీ దూరాలు ప్రయాణీస్తూ ఈ బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే ట్రాక్‌లు, సెల్ టవర్లు, ఘాట్ రోడ్లు, రద్దీ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు అణువణువూ జల్లెడపడుతున్నాయి. మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్కడ ప్రతి ఇంటినీ సోదా చేస్తున్నారు. మావోయిస్టులకు సహకరించే గిరిజనులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కొత్తగా సెల్ టవర్లు, పోలీస్ అవుట్‌పోస్టులు నిర్మిస్తూ కమ్యూనికేషన్ వ్యవస్థను బలపరుచుకుంటున్నారు. ఇలా అన్ని రకాలుగా మావోయిస్టులపై ఒత్తిడి తేవడం ద్వారా లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు. లొంగని వారిని అరెస్ట్ చేస్తున్నారు.