నేడు మళ్లీ ‘ఎన్నికల’ కేబినెట్‌ | Another Cabinet Meeting Is Today | Sakshi
Sakshi News home page

నేడు మళ్లీ ‘ఎన్నికల’ కేబినెట్‌

Published Wed, Feb 13 2019 4:44 AM | Last Updated on Wed, Feb 13 2019 10:42 AM

Another Cabinet Meeting Is Today  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు తీసుకుంటున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న వరుస మంత్రివర్గ(కేబినెట్‌) సమావేశాలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సాధారణం కంటే భిన్నంగా రోజుల వ్యవధిలోనే వెంటవెంటనే కేబినెట్‌ భేటీలు ఏర్పాటు చేస్తుండడంపై అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 8వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు ఐదు రోజులు గడవకుండానే బుధవారం మళ్లీ ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెలలో ఇది రెండో మంత్రివర్గ సమావేశం. జనవరిలో రెండుసార్లు (21, 31 తేదీల్లో) కేబినెట్‌ సమావేశాలు నిర్వహించారు. జనవరి 21 నుంచి 35 రోజుల వ్యవధిలోనే ఏకంగా నాలుగు మంత్రివర్గ సమావేశాలు (నేటి సమావేశంతో కలిపి) ఏర్పాటు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
మంత్రులు, అధికారుల్లో అసహనం 
ప్రభుత్వంలో కేబినెట్‌ భేటీ అత్యంత కీలకం. గత ప్రభుత్వాలు రెండు, మూడు నెలలకోసారి ఈ భేటీలను నిర్వహించేవి. కానీ, సరిగ్గా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తుండడం, వాటిని అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా కొనసాగిస్తుండడంపై అధికారులు, మంత్రుల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చంద్రబాబు మంత్రివర్గ భేటీలను హడావుడిగా ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. 

కాపీ కొట్టిన పథకాలకు ఆమోదముద్ర 
25 రోజుల వ్యవధిలో జరిగిన మూడు మంత్రివర్గ సమావేశాల్లో పలు పథకాలకు చంద్రబాబు ఆమోదముద్ర వేయించారు. ఇవన్నీ ప్రజలను మాయ చేసేందుకు నాలుగున్నరేళ్ల తర్వాత ప్రకటించినవే కావడం విశేషం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రూ.2,000 పెన్షన్‌ పథకాన్ని బాబు కాపీ కొట్టారు. జనవరి 1వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దాన్ని ఆమోదించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు పథకాన్ని సైతం కాపీ కొట్టి, అదే సమావేశంలో అమోదించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదు చేసిన కేసులను నాలుగున్నరేళ్లుగా పట్టించుకోలేదు. కానీ, ఉన్నట్టుండి జనవరి 31వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయా కేసులను రద్దు చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులపై పెట్టిన కేసులను ఈ సమావేశంలోనే రద్దు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నుంచి కాపీ కొట్టి ప్రకటించిన ‘పసుపు–కంకుమ’ పథకాన్ని ఈ భేటీలోనే ఆమోదించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చేందుకు ఈ సమావేశంలో అనుమతించారు. ఇన్నాళ్లూ పట్టించుకోని అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆర్థికసాయం చేయాలని ఈ సమావేశంలోనే నిర్ణయించారు. ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన కేబినెట్‌ భేటీలో ఉద్యోగులను ఆకర్షించేందుకు 20 శాతం మధ్యంతర భృతికి ఆమోదం తెలిపారు. ఇవన్నీ నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు కళ్లకు కనిపించలేదు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాల్లో ఆగమేఘాలపై వాటిని ఆమోదిస్తుండడం గమనార్హం.
 
- జాయింట్‌ కలెక్టర్ల నుంచి ఆర్డీఓలకు అధికారాన్ని కల్పించే వివాదాస్పదమైన చుక్కల భూముల చట్టంలో సవరణలకు జనవరి 21న జరిగిన సమావేశంలో ఆమోదముద్ర వేశారు. ఇళ్ల పట్టాల కేటాయింపు అధికారాన్ని కూడా జాయింట్‌ కలెక్టర్ల నుంచి ఆర్డీఓలకు బదలాయించారు. 
పుంగనూరులోని కేబీసీ షుగర్స్, నిండ్రాలోని ప్రొడెన్షియల్‌ షుగర్స్, బీఎన్‌ కండ్రిగలోని సుదలగుంట షుగర్స్, పొదలకూరలోని సుదలగుంట షుగర్స్, నాయుడుపేటలోని ఎంపీ షుగర్స్‌ సంస్థలకు జనవరి 21న జరిగిన సమావేశంలో రూ.47.54 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చారు. కో–ఆపరేటివ్, నిజాం షుగర్స్, ఖండసారి షుగర్‌ మిల్లులకు సంబంధించిన రూ.227 కోట్ల కొనుగోలు పన్ను, వడ్డీలు, జరిమానాలను మినహాయించారు. 
రూ.55,343 కోట్ల అమరావతి సమగ్ర ఆర్థిక ప్రణాళికను జనవరి 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. అందులో రూ.37,112 కోట్లను అప్పుగా తెచ్చుకునేందుకు సీఆర్‌డీఏకు అధికారం కల్పించారు. 
రాజధానిలోని పలు ప్రాజెక్టులను తనఖా పెట్టి రుణాలు తెచ్చుకునేందుకు సీఆర్‌డీఏకు అధికారం కట్టబెట్టారు. పబ్లిక్‌ బాండ్ల ద్వారా రూ.500 కోట్ల సేకరించేందుకు పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లేందుకు సీఆర్‌డీఏకు అనుమతిచ్చి ఇందుకయ్యే వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు అనుమతించారు. 
రాజధానిలో మౌలిక సదుపాయాల పనుల కోసం 715 మిలియన్‌ డాలర్ల అప్పు ఇచ్చే రాజధాని అమరావతి సుస్థిర మౌలిక సదుపాయాలు, సంస్థాగత అభివృద్ధి పథకానికి (ఏఎస్‌ఐడీపీ)కి ఆమోదముద్ర వేశారు. 
కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో హల్దియా పెట్రో కెమికల్‌ లిమిటెడ్‌ కంపెనీకి ప్రత్యేక రాయితీల ప్యాకేజీ ఇచ్చేందుకు ఇదే సమావేశంలో మంత్రివర్గ ఆమోదించింది. 
వైకుంఠపురం బ్యారేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.801.88 కోట్ల నుంచి రూ.1,069 కోట్లకు పెంచుతూ నాలుగోసారి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. సీఎం చంద్రబాబుకు సన్నిహితమైన నవయుగ సంస్థ 13.19 శాతం ఎక్సెస్‌(ఎక్కువ) ధరకు షెడ్యూలు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచింది. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే ఎక్సెస్‌కు కోట్‌ చేస్తే టెండర్‌ను రద్దు చేయాలి. కానీ. ఈ నెల 8న కేబినెట్‌ సమావేశంలో 13.19 శాతం ఎక్సెస్‌కు వైకుంఠపురం బ్యారేజీ పనులను నవయుగకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. 

భారీగా భూకేటాయింపులు, రాయితీలు  
పలు ప్రైవేట్‌ సంస్థలకు భారీ ఎత్తున భూకేటాయింపులు, పన్ను మినహాయింపులు ఇస్తూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. 3,000 ఎకరాలను వివిధ సంస్థలకు కేటాయించారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో గ్రీన్‌కో ఎనర్జీస్‌ సంస్థకు ఎకరం రూ.2.50 లక్షల చొప్పున 2,467 ఎకరాలను కేటాయించారు. రాజధానిలో పలు సంస్థలకు చౌకగా భూకేటాయింపులు చేసేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి కాపీ కొట్టిన రైతుకు పెట్టుబడి సాయం పథకాన్ని బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నుంచి ఏడు జిల్లాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్, ఈ నెలాఖరున సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉండడంతో బుధవారం జరిగే సమావేశంలోనే దాదాపు తాను అనుకున్న అన్ని పనులకు ఆమోదం తెలిపేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎవరో తరుముకొస్తున్నట్లు పథకాలను ప్రకటించడం, వాటి కోసం వరుసగా మంత్రివర్గ సమావేశాలు పెట్టి ఆమోదించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా చంద్రబాబు లెక్కచేయడం లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement