- రుణాలపై వడ్డీ రేటు పెంపు
- ఆప్కాబ్ నిర్వాకం
- పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
- ఆందోళనలో రైతాంగం
నూజివీడు : ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయకుండా కాలం గడుపుతున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్న రైతుల నెత్తిన రాష్ట్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గడువు మీరిన రుణాలపై 2శాతం వడ్డీరేటును పెంచుతూ డీసీసీబీతో పాటు జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లకు ఆప్కాబ్ నుంచి ఉత్తర్వులు అందాయి.
ఈ ఉత్తర్వులను ఎంతో గోప్యంగా పంపడం గమనార్హం. రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు మూలిగేనక్కపై తాటికాయ పడిన చందంగా వడ్డీ రేటును పెంచి ప్రభుత్వం తన సవతి ప్రేమను చూపించింది. పీఏసీఎస్‌లో తీసుకున్న రుణాలను ఏడాదిలోగా చెల్లించకపోతే, గడువు తీరిన తరువాత నుంచి 11శాతం వడ్డీరేటును విధిస్తుండగా, తాజా ఉత్తర్వుల ప్రకారం అది కాస్తా 13శాతానికి పెంచారు. దీంతో రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారు కానుంది.
నాబార్డు పెంచిందని సాకు...
రిజర్వుబ్యాంకు నుంచి నాబార్డుకు, నాబార్డు నుంచి ఆప్కాబ్‌కు, ఆప్కాబ్ నుంచి డీసీసీబీలకు నిధులు సమకూరుతాయి. అయితే నాబార్డు వడ్డీరేటు పెంచిందని చెప్పి ఆప్కాబ్ కూడా డీసీసీబీలకు ఇచ్చే నిధులపై వడ్డీరేటును పెంచింది. దీంతో డీసీసీబీలు కూడా సొసైటీల్లో రుణాలు తీసుకున్న రైతుల నెత్తిన పెరిగిన వడ్డీరేటును మోపింది.
వడ్డీరేటు తగ్గించిన వైఎస్...
2004లో దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి పీఏసీఎస్‌లలో తీసుకున్న స్వల్పకాలిక పంటరుణాలపై 12శాతం ఉండే వడ్డీరేటును తొలుత 11శాతానికి, క్రమేణా 7శాతానికి తగ్గించుకుంటూ వచ్చారు. అలాగే దీర్ఘకాలిక రుణాలకు ఉన్న 18శాతం వడ్డీరేటును తగ్గించారు. అంతేగాకుండా కేంద్రప్రభత్వం ఇచ్చే రాయితీని కూడా రైతులకు వర్తింపచేసి కేవలం పావలా వడ్డీకే రుణాలను ఇచ్చిన రైతు బాంధవుడు వైఎస్. 2004లో కేంద్రప్రభుత్వం నియమించిన వైధ్యనాథన్ కమిటీ సహకార సంఘాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పిస్తే, ఆ నివేదికలో ఉన్న సిఫార్సులను అమలు చేసిన ఘనత కూడా వైఎస్‌కే దక్కుతుంది. అంతేగాకుండా నష్టాల్లో ఉన్న పీఏసీఎస్‌లన్నింటికి ఆర్థికపరిపుష్టి కల్పించారని రైతులే చెబుతున్నారు.
రుణాలు మాఫీ చేసినా భారమే...
ప్రభుత్వం రుణమాఫీని వర్తింపచేసినప్పటికీ రైతులకు రుణభారం నుంచి విముక్తి లభించే పరిస్థితులు కనిపించడం లేదు. డిసెంబర్ 31వరకు ఉన్న రుణాలు, బకాయిలను మాత్రమే మాఫీ చేస్తామని పేర్కొన్న నేపథ్యంలో జనవరి నుంచి రుణమాఫీ చేసేవరకు అయ్యే వడ్డీని రైతులు బ్యాంకులకు చెల్లించాల్సిందే. దీనికి తోడు గడువు దీరిపోయిన రుణాలకు సంబంధించి సెప్టెంబర్ నుంచి 2శాతం వడ్డీరేటు అదనంగా తోడవ్వనుంది. దీంతో రుణాలను మాఫీ చేసినా రైతులకు రుణమాఫీ భారం తప్పే పరిస్థితులు కనిపించడం లేదు.
వడ్డీరేటు 2శాతం పెరిగింది : కేడీసీసీబీ సీఈవో తోట వీరబాబు
గడువు దీరిన రుణాలపై వడ్డీరేటును 11శాతం నుంచి 13 శాతానికి పెంచిన ఉత్తర్వులు వచ్చాయి. ఈ పెంపు సెప్టెంబరు ఒకటోతేదీ నుంచే అమలులోకి వచ్చింది. గడువు తీరకముందు వరకు 7శాతం, గడువుతీరిన తరువాత 13శాతం చొప్పున వడ్డీని లెక్కగట్టడం జరుగుతుంది.