నారాయణ స్కూల్లో మరో ఘోరం
పదోతరగతి విద్యార్థి సాయిచరణ్ అనుమానాస్పద మృతి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నారాయణ విద్యా సంస్థల్లో నెలరోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. సోమవారం రాత్రి శ్రీనివాస మంగాపురం సమీపంలోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి సాయిచరణ్ నాయక్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సాయిచరణ్‌ను వైస్ ప్రిన్సిపల్ అంజిరెడ్డి తీవ్రంగా కొట్టాడనీ, ఈ కారణంగానే తన కొడుకు మృత్యువాత పడ్డాడని విద్యార్థి తండ్రి మోహన్‌కృష్ణనాయక్ బోరున విలపించాడు. స్కూలు యాజమాన్యం మాత్రం స్కూలు మెట్లు ఎక్కే క్రమంలో జారి కింద పడ్డాడనీ దీంతో ప్రాణం పోయిందని చెబుతున్నారు. మంగళవారం ఉదయం స్కూలుకు చేరుకున్న తండ్రి మోహన్‌కృష్ణకు కొడుకు విగతజీవుడై కనిపించాడు. దీంతో ఆయన యాజమాన్యాన్ని నిలదీశాడు.
సరిగ్గా నెల కిందటే తిరుపతి నారాయణ స్కూల్ (అలిపిరి) టెన్త్ విద్యార్థి మనోజ్‌కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా స్కూలుకు వెళ్లడంతో మండిపడ్డ టీచర్ అందరి ముందూ కొట్టడమే కాకుండా అవమానించడంతో మనోవేదనకు గురైన మనోజ్‌కుమార్ స్కూల్ భవనంపై నుంచి దూకి అక్కడికక్కడే కన్నుమూశాడు. కాగా, సాయిచరణ్ మరణంతో ఆగ్రహించిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు నారాయణ స్కూల్, స్విమ్స్ ఆస్పత్రుల ముందు ఆందోళనకు దిగారు. నారాయణ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలనీ, నారాయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.