Narayana Educational Institution
-
నారాయణ ఎన్నికల కు‘తంత్రం’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘హలో గుడ్ ఈవినింగ్. నేను నారాయణ విద్యాసంస్థల నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ అబ్బాయి మా స్కూల్లో చదువుతున్నాడు కదా. మీ కుటుంబం గురించి కొన్ని వివరాలు కావాలి. మీరు నివాసం ఉంటున్నది ఎక్కడ. ఏ డివిజన్లో మీ ఇల్లు ఉంది. మీ ఇంట్లో ఓటర్లు ఎంత మంది? పోలింగ్ బూత్, ఓటరు ఐడీ నంబర్లు చెప్పండి. చివరగా మీ బ్యాంకు అకౌంట్ నంబరు చెప్పండి’ ఇవీ నెల్లూరు నారాయణ విద్యాసంస్థల నుంచి వచ్చే ఫోన్ కాల్లో అడుగుతున్న వివరాలు. ఆ విద్యాసంస్థల్లోని ఉద్యోగులు కొన్ని రోజులుగా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కేంద్రాలుగా విద్యాసంస్థలు 2019 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి పోటీచేసి ఓటమి చెందిన పొంగూరు నారాయణ ఈ దఫా కూడా పోటీకి సిద్ధమయ్యారు. స్థానికంగా విద్యాసంస్థల్నే తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చేసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎన్నికల టీంగా ఏర్పాటు చేసుకుని రాజకీయ వ్యవహారాలు నడిపిస్తున్నారు. గతంలో ఆ ఉద్యోగులు ఓటర్ల వ్యక్తిగత డేటా సేకరణ చేస్తూ పట్టుబడి స్థానికుల చేత తన్నులు తిని పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ వరకు వెళ్లాల్సి వచి్చంది. నెల జీతం కోసం పనిచేసే ఉద్యోగులను స్థానికుల చేతిలో చావుదెబ్బలు తినాల్సిన పరిస్థితికి నారాయణ తీసుకువచ్చారు. దీనిపై గతంలో పెద్ద దుమారమే రేగింది. మరోసారి విద్యార్థుల కుటుంబాల సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో దాదాపు 12 వేల మంది విద్యార్థులు నారాయణ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. ఆయా విద్యార్థుల కుటుంబ సభ్యుల ఓట్ల కోసం గాలం వేసేందుకు సమాచారం సేకరించే పనిలో ఉద్యోగులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తాను నమ్మిన వాళ్లే ఓటుకు నోటు సక్రమంగా చేర్చలేదన్న అభిప్రాయంతో ఉన్న నారాయణ ఈ దఫా వారిని నమ్మకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాను సేకరించి వారి ఖాతాలోకే నోటు చేర్చేలా పథకం రచించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఐదేళ్లగా ముఖం చాటేసి.. నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీ జెండా మోసి పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న నేతలను కాదని గత ఎన్నికల్లో నారాయణ టికెట్ ఎగరేసుకుపోవడాన్ని ఆ పార్టీ క్యాడర్ జీరి్ణంచుకోలేకపోయింది. దీంతో అందరూ నారాయణకు వెన్నుపోటు పొడవడంతో ఓటమి చెందారు. ఆ తరువాత నాలుగున్నర ఏళ్ల కాలంగా నియోజకవర్గానికి ముఖం చాటేసిన నారాయణ ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడగడంపై పార్టీ క్యాడర్ గుర్రుగా ఉంది. -
విద్యార్థుల ఆత్మహత్యలనూ బయట పెడతా: నారాయణ మరదలు ప్రియ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అకృత్యాలపై ఆయన మరదలు ప్రియ ఇన్‌స్టాగామ్‌లో మరో వీడియో విడుదల చేశారు. నారాయణ ఆయన పరువు కోసం తనను అణచివేశారని ఆమె ఆరోపించారు. ‘నేను 29 ఏళ్లు భరించాను. ఇక భరించే శక్తి నాకు లేదు. సీతాదేవి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. మరో 11 సంవత్సరాలు బిడ్డల్ని పెంచింది. మొత్తం 27 ఏళ్లు కష్టపడింది. నేను 29 ఏళ్లు నరకం అనుభవించాను. ఇప్పుడు కూడా ఇంటి విషయాలు మాట్లాడొద్దని అంటున్నారు.ఇంటి విషయాలైనా, పబ్లిక్ విషయాలైనా, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయాలపైనా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. నా కళ్ల ముందు చెడు జరుగుతోంది కాబట్టి బయటపెట్టేందుకు సిద్ధమయ్యాను. ముందు నా విషయం వెలుగులోకి తెస్తాను. తర్వాత విద్యా సంస్థల విషయాలు బయటపెడతా. పరువు అంటున్నారు. మహా అంటే పది మంది ఫోన్ చేస్తారు. అంతే కదా. ఇది నా జీవితం. 29 ఏళ్లు కష్టపడ్డా. నాకు క్యాన్సర్ వస్తే పలకరించే దిక్కు లేకపోతే నా పరిస్థితి ఏమిటి? అందుకే నేను మాట్లాడతా. విద్యా సంస్థల్లో పిల్లల ఆత్మ హత్యల విషయం క్లియర్‌గా మాట్లాడతా. నేను ఫిజి కల్గా క్యాన్సర్ పేషంట్‌ను కావచ్చు. మెంటల్‌గా వీక్ కాను. ఒక స్త్రీ తలచుకుంటే శక్తి అవుతుందని నారాయణకు తెలియజేస్తా. నేను బతుకుతానో లేదో తెలియదు. నాకు డబ్బులివ్వరు. అయినా నా ఆస్తులమ్మైనా ట్రీట్మెంట్ చేయించుకుంటా. నేను చనిపోయే లోపు వాస్తవాలు బయటపెడతా’అని ప్రియ ఆ వీడియోలో చెప్పారు. సంచలనంగా ప్రియ వీడియోలు రెండు రోజుల క్రితం ప్రియ సోషల్ మీడియాలో మొదటి వీడియో రిలీజ్ చేశారు. బావ అయిన మాజీ మంత్రి నారాయణ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇది రెండు తెలుగురాష్ట్రాల్లో, రాజకీయ వర్గాల్లో, నారాయణ విద్యాసంస్థల్లో చర్చనీయాంశమైంది. దీంతో నారా యణ తన వియ్యంకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దింపారు. ప్రియతో రాజీకి ప్రయత్నించారు. అయితే గంటా ప్రయత్నా లు విఫలమయ్యాయి. ప్రియ మరో వీడియో విడు దల చేసి, అందులో మరిన్ని విషయాలు వెల్లడించారు. ఇది మరింత సంచలనమైంది. సోదరుడి సతీమణినే నారాయణ లైంగికంగా వేధించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రియ జనసేన వీరమహిళ పొంగూరు ప్రియ జనసేన సభ్యురాలు. ఆ పార్టీ వీరమహిళగా గుర్తింపు పొందింది. తన బావ టీడీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆమె మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ అభిమానిని అని ఆమె వీడియోలో వెల్లడించింది. తన కుమారుడు పుట్టిన రోజున పవన్‌తో దిగిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఓటు కూడా జనసేనకే వేశానని తెలిపింది. తన పార్టీ వీర మహిళగా ఉన్న ప్రియ లైంగిక వేధింపులతో నరకం చూశానంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసినా జనసేన పార్టీ నుంచి స్పందన లేకపోవడంపై ఆ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళల అక్రమ రవాణాలపై మాట్లాడుతున్న వవన్ కళ్యాణ్ సొంత పార్టీలోని మహిళకు అన్యాయం జరిగితే ఎందుకు నోరు మెదపడంలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ వైపు కేసులు.. మరో వైపు పరువు ఓ వైపు పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ కేసు, మరో వైపు అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాల కేసుల్లో ఉన్న నారాయణకు తాజాగా సొంత మరదలు ప్రియ చేస్తున్న ఆరోపణలు మరింత ఇబ్బందిగా మారాయి. తన విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల వెనుక ఉన్న చీకటి కోణాన్ని కూడా వెలుగులోకి తెస్తానని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. -
గురువుకా... రాజ గురువుకా పరీక్ష?
తప్పు.. తప్పు కాకుండా పోయేదెప్పుడు? నేరం చేసినవారిపై కేసులు పెట్టడమే నేరమయ్యేదెప్పుడు? అక్రమాలను అడ్డుకోవటమే పాపమయ్యేదెప్పుడు? ఈ ప్రశ్నలకు ‘ఈనాడు’ అధిపతి రామోజీరావు మాత్రమే ఠక్కున జవాబివ్వగలరు. అది... ‘చంద్రబాబు అధికారంలో లేనప్పుడు’ అని! ‘గురువులకే పరీక్ష’ అంటూ బుధవారం ‘ఈనాడు’ పతాక శీర్షికతో అచ్చేసిన కథనం ఇలాంటిదే మరి. దొంగతనం చేసిన వ్యక్తి తానెలాంటి పరిస్థితుల్లో ఆ దొంగతనం చేశాడో చెబితే కరిగిపోవటానికి ఇదేమైనా సినిమానా రామోజీ? కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే... కష్టపడి చదువుకున్న విద్యార్థులు నష్టపోతారని తెలియదా? విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికేగా పరీక్షలు? లక్షన్నర మంది ఉపాధ్యాయుల్లో ఓ 10 మంది చేసిన తప్పిదం వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు రావటం లేదా? తప్పు జరిగినపుడు దాన్ని తప్పు అని చెప్పకపోతే ఎలా? వారు అలా చేయటం కరెక్టేనన్నట్టు ఆ రాతలేంటి? అధికారంలో ఉన్నది చంద్రబాబు కాకుంటే ఎంత తప్పయినా ఒప్పయిపోతుందా?‘ఈనాడు’ దారుణమైన కథనాల్లో నిజమెంత? ఏది నిజం? ఐదేళ్ల కిందట... 2017లో విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. నారాయణ విద్యాసంస్థల అధిపతికి స్వయానా వియ్యంకుడు. నారాయణ కూడా... మరో మంత్రి. అప్పట్లో టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఓ రేంజిలో జరిగింది. ‘నారాయణ’ సిబ్బంది కొందరు పేపర్లు లీక్ చేయటమే కాక... రోజూ తమ బ్రాంచీలకు జవాబులు పంపి మాస్ కాపీయింగ్‌కు తెగబడ్డారు. దీన్ని నాటి ప్రతిపక్ష నేత... ప్రస్తుత సీఎం వై.ఎస్.జగన్ ఆధారాలతో సహా అసెంబ్లీలో పెట్టారు. గంటా, నారాయణ, చంద్రబాబు పొంతన లేని సమాధానాలు చెప్పారు. వీళ్లందరి భాష్యమూ ఒక్కటే!! పేపర్లు బయటికొచ్చాయి కానీ.. అది లీక్ కాదు!. కాపీయింగ్ జరిగింది కానీ.. మాస్ కాపీయింగ్ కాదు. జస్ట్ మాల్‌ప్రాక్టీస్. బస్! ఎవ్వరిపైనా కేసుల్లేవు. అంతా గప్‌చుప్!!. అందుకే... ‘ఈనాడు’ దృష్టిలో ఇది స్వర్ణయుగం. ఇప్పుడలా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్‌కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌కు సంబంధించి ఏకంగా 60 మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. వీరిలో నారాయణ స్కూళ్లకు చెందిన సూత్రధారులూ ఉన్నారు. 38 మంది ప్రభుత్వ అధ్యాపకులు, సిబ్బంది కూడా ఉన్నారు. 2017లో 10వ తరగతి ప్రశ్నాపత్నాల లీజేజీలు, నారాయణ సిబ్బంది ప్రమేయాన్ని బయటపెట్టిన రుజువులివే.. ఆలోచనకు సంబంధించిన అవయవాలన్నీ సక్రమంగా పనిచేసే వారెవరైనా ఇలాంటి చర్యల్ని అభినందిస్తారు. రామోజీ రూటే సెపరేటు!! మంచి ఫలితాల కోసం ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది కనకే వారిలా చేస్తున్నారని, అలాంటి అధ్యాపకులపై కేసులు పెట్టడమేంటని ‘ఈనాడు’ ఆక్రందనలు మొదలెట్టింది. రామోజీరావు గారూ!! ఇది ఏ స్థాయి జర్నలిజం? ఫలితాలు బాగుండాలనటం ఒత్తిడా? ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యేలా చక్కని ప్రమాణాలతో విద్యా బోధన సాగాలని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. దాదాపు లక్షన్నర మంది టీచర్లలో ఓ పిడికెడు మందికి మాత్రం అది ఒత్తిడి చేయటంలా కనిపించింది. వారు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించటంతో... వారికి జై కొడుతూ ‘ఈనాడు’ వారి వెనకన చేరిపోయింది. నిజానికి రామోజీ ఉద్దేశం వేరు. నారాయణ లాంటి స్కూళ్లు అక్రమాలకు పాల్పడకపోతే టెన్త్‌లో మంచి ఫలితాలు రావు. దీంతో వాటి పేరు దెబ్బతిని... అడ్మిషన్లు తగ్గి మొదటికే మోసం వస్తుంది. ఇది చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితి కనక... వాళ్లను వెనకేసుకు రావటం మొదలెట్టారు. బాబు మిత్రులైన కార్పొరేట్ స్కూళ్లకోసం మరీ ఇంతలా దిగజారాలా? దానికి ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయుల్ని అడ్డం పెట్టుకోవాలా? విద్యావిప్లవం కనిపించటం లేదా? ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దటం మొదలెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నాడు–నేడు అంటూ స్కూళ్ల రూపు రేఖలు మార్చారు. జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద వంటి పథకాలతో విద్యను అందరికీ చేరువ చేశారు. ఫలితం... కొన్ని ప్రైవేటు స్కూళ్లు మూతపడ్డాయి. 6 లక్షలమంది ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు సర్కారీ స్కూళ్లకు వచ్చారు. పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీషు మీడియం తెచ్చారు. విద్యార్థులకు మెరుగ్గా బోధించే బాధ్యత టీచర్లదే కనక... దానికి కొలమానంగా ఫలితాలుండాలని నిర్దేశించారు. ఇది తప్పా రామోజీ? అరకొర వసతులు, చాలీచాలనీ జీతాలిచ్చే ప్రైవేటు స్కూళ్లే తమ విద్యార్థులు సరైన మార్కులు తెచ్చుకోకుంటే టీచర్లను బాధ్యులను చేస్తాయి. మరి వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించి... అన్నింటా మెరుగైన ప్రయోజనాలు కల్పిస్తున్న ప్రభుత్వం... పేద విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని ఆశించడం నేరమా? అది ప్రభుత్వ బాధ్యత కాదా? ‘ఈనాడు’కెందుకు ఇంత ఉలుకు? ఇది ఉపాధ్యాయుల్ని ఒత్తిడి చేయటమెలా అవుతుంది? ఎందుకీ వక్రభాష్యాలు? మంచి మార్కులు రావాలంటే మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ తప్పనిసరి అన్నట్టుగా ఏంటీ రాతలు? నాడు బాబు హయాంలో నిజంగా జరిగినా నోరుమెదపని ఈనాడు... ఇపుడు ఉన్నవీ లేనివీ పోగేసి ‘గురు’వింద రాతలు.. నారాయణ... నారాయణ ఈ సారి టెన్త్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డదెవరో తెలియదా రామోజీ? తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తొలిరోజే నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు అక్రమాలకు టెంకాయ కొట్టేశారు. తిరుపతి నారాయణ వైస్ ప్రిన్సిపాల్ ఎన్.గిరిధర్ రెడ్డి చిత్తూరులో ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ప్రలోభపెట్టి వాట్సాప్ ద్వారా పేపరు తెప్పించుకున్నాడు. దాన్ని నారాయణ, మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థల అధికారులు, సిబ్బందికి ఫార్వర్డ్ చేశాడు. కానీ ఈ కుట్రను పోలీసులు రట్టు చేయటంతో కథ అడ్డం తిగింది. గిరిధర్‌తో పాటు చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ఆరీఫ్, డీన్ కె.మోహన్, తిరుపతి ఎన్ఆర్ఐ అకాడెమీ ఉపాధ్యాయుడు కె.సుధాకర్, శ్రీకృష్ణారెడ్డి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ పి.సురేష్, ప్రభుత్వ ఉపాధ్యాయులు పవన్‌కుమార్, బి. సోములను అరెస్టు చేశారు. ఇదే... ఈనాడు ఆగ్రహానికి అసలు కారణం మరి!!. టీడీపీ... మరో అడుగు ముందుకు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఏ స్థాయికైనా దిగజారాలన్నది టీడీపీ ‘వ్యూహం’. గతంలో రాష్ట్రం డ్రగ్స్ మయమైపోయిందని... గంజాయి పెరిగిపోయిందని చేసిన ప్రచారాలు ఈ కోవలోనివే. ఇటీవల తెలుగుదేశం తమ్ముళ్లు అత్యాచారాలకు తెగబడితే... చినబాబు లోకేశ్ వాటిని ప్రభుత్వానికి అంటగడుతూ ఎగిరెగిరి పడటమూ ఇలాంటిదే. ఇక టెన్త్ విషయంలో ఈ దుష్టచతుష్టయం మరో అడుగు ముందుకేసింది. శ్రీకాకుళం జిల్లా రొట్టవలస, కొత్తపేట జెడ్పీ హైస్కూళ్లలో హిందీ ప్రశ్నాపతాన్ని టీడీపీ నేతలే లీక్ చేసి వాట్సాప్‌లో వైరల్ చేశారు. పోలీసులు నిగ్గు తేల్చి ఏడుగురు టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేశారు కూడా. లీక్ వెనుక ఏబీఎన్–ఆంధ్రజ్యోతి సిబ్బంది పాత్ర కూడా ఉందంటే కుట్ర లోతును అర్థం చేసుకోవచ్చు. లీకేజీ వార్తల్ని ఆ చానలే పదే పదే ప్రసారం చేసింది. కళ్లముందున్న వాస్తవాలక్కూడా ఇన్ని రంగులేస్తున్న ఎల్లో మీడియా ఇంకెన్నాళ్లు జనాన్ని నమ్మించగలుగుతుంది? మీ అబద్ధాల్ని జనం ద్వేషిస్తున్నారని తెలియదా? వింటున్నారా రామోజీ!! -
‘నారాయణ’ టీచర్.. అరటి పండ్లు అమ్ముకుంటూ
సాక్షి, నెల్లూరు (టౌన్) : అడ్మిషన్లు చేయించని ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేదని నెల్లూరు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నఫళంగా తమను ఉద్యోగాల్లోంచి తొలగిస్తే తమ కుటుంబాల పరిస్థితేంటని వాపోతున్నారు. కరోనా కారణంగా మార్చి 15 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆ సమయంలో ఆన్లైన్ పాఠాలు చెప్పించారు. ఏప్రిల్ నెలకు సగం జీతమే ఇచ్చి, మే నెల వేతనాన్ని పూర్తిగా నిలిపేశారు. అదేమని ప్రశ్నిస్తే ఒక్కొక్కరు 7 నుంచి 10 అడ్మిషన్లు చేయిస్తేనే ఇస్తామని లేకుంటే ఆసలు స్కూలుకే రావొద్దని నారాయణ యాజమాన్యం తెగేసి చెప్పింది. ఓ వైపు కరోనా తీవ్రత, మరో వైపు ప్రజలు ఎవరినీ ఇళ్ల దరిదాపులకు రానీయని పరిస్థితిలో అడ్మిషన్లు ఎలా చేస్తామని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. (‘నారాయణ’ ఉపాధ్యాయుల ఆమరణ నిరాహారదీక్ష) ► నెల్లూరు నగరంలోని స్టోన్‌హోస్‌పేట అరుణాచలం వీధిలో ఉన్న నారాయణ స్కూల్లో ఐదుగురు టీచర్లను ఈ కారణంతో తొలగించడంతో వారు ఇళ్లకే పరిమితమయ్యారు. ► మినీబైపాస్‌లోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో పనిచేస్తున్న మరో ఏడుగురు టీచర్లకూ స్కూల్‌కు రావొద్దని చెప్పారు. ► ఈ విధంగా జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల్లోంచి 40 నుంచి 50 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించినట్టు చెబుతున్నారు. వీరిలో కొంత మంది ఇంటి అద్దెలు చెల్లించలేక సొంత ఊర్లకు వెళితే.. మరికొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ► స్టోన్‌హోస్‌పేటలోని ‘నారాయణ’ బ్రాంచిలో పనిచేసిన తెలుగు టీచర్ పట్టెం వెంకటసుబ్బయ్య ఇప్పుడు తోపుడు బండిపై అరటి పండ్ల వ్యాపారం చేస్తున్నారు. ఎంఏ తెలుగు, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బీఈడీ చదివిన వెంకటసుబ్బయ్య రెండేళ్లుగా నారాయణ విద్యాసంస్థలో పనిచేస్తున్నారు. ► అడ్మిషన్లు చేయలేదన్న కారణంతో తమను ఉద్యోగాల్లోంచి తొలగించడం దారుణమని మరో టీచర్ కాటుబోయిన శ్రీనివాసులు చెబుతున్నారు. -
‘నారాయణ’ ఉపాధ్యాయుల ఆమరణ నిరాహారదీక్ష
సాక్షి, హైదరాబాద్ : కరోనా ఆపత్కాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న నారాయణ విద్యాసంస్థల తీరును నిరసిస్తూ పలువురు ఉపాధ్యాయులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బుధవారం సాయంత్రం రామంతపూర్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో పనిచేస్తున్న రవికుమార్ అనే ఉపాధ్యాయుడి ఇంట్లో దీక్షకు పూనారు. పనిచేసిన దానికి జీతం ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ ప్రకటించినప్పట్నుంచి విద్యావ్యాపారంలో అగ్రగామిగా చెప్పుకునే నారాయణ, శ్రీచైతన్య సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో క్లాస్ చెప్పమని, ఫీజులు వసూలు చేయమని, ఆడ్మిషన్లు చేయాలని, రెన్యువల్స్ చేయాలని ఉద్యోగులపై యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని నారాయణ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా యాజమాన్యం చెప్పిన పని చేస్తే కేవలం సగం జీతమే ఇస్తామని, అభ్యంతరం ఉంటే ఉద్యోగానికి నిరభ్యంతరంగా రాజీనామా చేసి పోవచ్చని బెదిరింపులకు దిగుతున్నారని వారు పేర్కొంటున్నారు. -
నారాయణ స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
సాక్షి, విజయనగం : జిల్లాలోని కొమరాడ మండలం అర్థం గ్రామ శివారులో బుధవారం నారాయణ స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవైపు వర్షం పడుతున్నా 32 మంది పిల్లలతో బయల్దేరిన బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి నేరుగా పక్కనే ఉన్న చెరుకు తోటలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలోలో పిల్లలు సురక్షితంగా బయటపడ్డా, డ్రైవర్‌కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బస్సులో కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ స్కూల్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నారాయణ స్కూల్లో మరో ఘోరం
పదోతరగతి విద్యార్థి సాయిచరణ్ అనుమానాస్పద మృతి సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నారాయణ విద్యా సంస్థల్లో నెలరోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. సోమవారం రాత్రి శ్రీనివాస మంగాపురం సమీపంలోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి సాయిచరణ్ నాయక్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సాయిచరణ్‌ను వైస్ ప్రిన్సిపల్ అంజిరెడ్డి తీవ్రంగా కొట్టాడనీ, ఈ కారణంగానే తన కొడుకు మృత్యువాత పడ్డాడని విద్యార్థి తండ్రి మోహన్కృష్ణనాయక్ బోరున విలపించాడు. స్కూలు యాజమాన్యం మాత్రం స్కూలు మెట్లు ఎక్కే క్రమంలో జారి కింద పడ్డాడనీ దీంతో ప్రాణం పోయిందని చెబుతున్నారు. మంగళవారం ఉదయం స్కూలుకు చేరుకున్న తండ్రి మోహన్‌కృష్ణకు కొడుకు విగతజీవుడై కనిపించాడు. దీంతో ఆయన యాజమాన్యాన్ని నిలదీశాడు. సరిగ్గా నెల కిందటే తిరుపతి నారాయణ స్కూల్ (అలిపిరి) టెన్త్ విద్యార్థి మనోజ్‌కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా స్కూలుకు వెళ్లడంతో మండిపడ్డ టీచర్ అందరి ముందూ కొట్టడమే కాకుండా అవమానించడంతో మనోవేదనకు గురైన మనోజ్‌కుమార్ స్కూల్ భవనంపై నుంచి దూకి అక్కడికక్కడే కన్నుమూశాడు. కాగా, సాయిచరణ్ మరణంతో ఆగ్రహించిన వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు నారాయణ స్కూల్, స్విమ్స్ ఆస్పత్రుల ముందు ఆందోళనకు దిగారు. నారాయణ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలనీ, నారాయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
45 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
తిరుపతి నారాయణ విద్యాసంస్థలో ఫుడ్ పాయిజన్ తిరుపతి రూరల్: తిరుపతి శివారు కాలూరు క్రాస్‌లో నారాయణ విద్యాసంస్థలకు చెందిన స్కూల్ హాస్టల్లో గురువారం రాత్రి భోజనం చేసిన 45మం దికిపైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. రోజుల తరబడి నిల్వ ఉంచిన పులిసిన మజ్జిగతో చేసిన పులుసు తిన్నవారందరికీ అర్థరాత్రి రెండు గంటలనుంచి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు మొదల య్యాయి. 600మం దికిపైగా ఉన్న ఆ హాస్ట ల్లో ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్యుడు కూడా లేరు. దీంతో అర్థరాత్రి వారిని హుటాహుటిన తిరుపతి, చెర్లొపల్లి, పుదిపట్లలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి సెలైన్ ఎక్కించారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. చికిత్స పొందుతున్న ఓ విద్యార్థి ఆసుపత్రి సిబ్బందికి చెందిన ఫోన్నుంచి తన తండ్రికి తెలపడంతో సమాచారం బయటికొచ్చింది.దీంతో తల్లి దండ్రులు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు. చర్యలు తీసుకోవా లంటూ స్కూల్ ముందు శుక్రవారం ధర్నా చేశారు. దీనిపై ఎంఆర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘నారాయణ’ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, కదిరి: అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని నారాయణ విద్యాసంస్థలో ఇంటర్మీడియెట్ (ద్వితీయ) చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని బుధవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేసింది. చదువుకోవాలంటూ ప్రిన్సిపాల్ వేధింపులు అధికం కావడంతో పురుగు మందు తాగింది. దీంతో విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. కదిరి పట్టణంలోని అడపాలవీధిలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజారెడ్డి కుమార్తె తేజస్విని. కొన్నాళ్లుగా ప్రిన్సిపాల్ నాగరాజు ఆమె కళాశాలకు రాలేదంటూ వేధించేవారు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం ‘నా కుమార్తె బాగా చదవలేదు. మంచి మార్కులు తెచ్చుకోలేదు. ఏమైనా అఘాయిత్యానికి పాల్పడితే కళాశాలకు ఎలాంటి సంబంధం లేద’ని విద్యార్థిని తండ్రి రాజారెడ్డితో లెటర్ కూడా రాయించుకున్నారు. ఈ క్రమంలో తేజస్విని బుధవారం ఉదయం 9.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. నల్లచెరువు సమీపంలోని షిర్డీసాయి ఆలయంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. తల్లిదండ్రులు బాధితురాలిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
నారాయణపై నిప్పులు
జిల్లా బంద్ విజయవంతం ♦ మూతపడిన కార్పొరేట్ విద్యా సంస్థలు ♦ కడపలో విద్యార్థినుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ ♦ మంత్రి నారాయణ దిష్టిబొమ్మలు దహనం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/ న్యూసిటీ : కార్పొరేట్ స్కూళ్ల, కాలేజీల అకృత్యాలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరం నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల బలవనర్మరణంపై విద్యార్థి లోకం మండిపింది. బుధవారం జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో కార్పొరేట్ పాఠశాలలకు ముందుగానే సెలవు ప్రకటించారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థి సమాఖ్యల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పలు చోట్ల మంత్రి నారాయణ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని నినదించారు. కర్నూలు నగరంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేవీఆర్ మహిళా ఇంటర్, డిగ్రీ విద్యార్థులు రాజ్‌విహార్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు లెనిన్‌బాబు, శ్రీనివాసులు మాట్లాడుతూ.. నారాయణ మంత్రి అయిన తరువాత ఆయనకు సంబంధించిన కళాశాలల్లో 11 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల అక్రమాలపై ఏర్పాటు చేసిన నీరదారెడ్డి కమిటీ సిఫార్సులను బట్టబయలు చేసి అమలు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యరద్శి సునీల్‌రెడ్డి కోరారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్పొరేట్ విద్యా సంస్థలకు తొత్తుగా మారి పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలలకు కొమ్ముకాస్తూ పేద విద్యార్థుల ప్రాణాలను బలిగొంటోందని పీడీఎస్‌యూ జిల్లా కార్యరద్శి భాస్కర్ విమర్శించారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్నంగా కళ్ల గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖమంత్రి గంటాశ్రీనివాసరావు కార్పొరేట్ కళాశాలల అక్రమాలకు వంతన పాడుతున్నాడని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ విమర్శించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి కల్లూరు: నారాయణ విద్యా సంస్థల్లో 15 నెలల్లో 11 మంది విద్యార్థులు అనుమానాస్పదంగా మృతిచెందారని, ఈ ఘటనలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపించాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బిర్లాగేటు వద్ద రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట వెంకట కృష్ణారెడ్డి వీరికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి నారాయణను వెంటనే బర్త్ప్ ్రచేయాలన్నారు. -
మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్ : వైఎస్ఆర్ జిల్లా కడప నారాయణ కళాశాలలో చదువుతూ ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినులు మనీషారెడ్డి, నందిని కేసు నిష్పక్షపాతంగా విచారించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కళాశాల అధినేత మంత్రి నారాయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. విద్యార్థినుల మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం విద్యార్థి సంఘాలు తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్థానిక సప్తగిరి సర్కిల్లో రాస్తారోకో చేశారు. విద్యార్థినుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు లోకేష్‌శెట్టి, సుధీర్‌రెడ్డి, పెద్దన్న, ఓసీ సంక్షేమ సంఘం బుర్రా జయవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని విద్యా సంస్థలను ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బంద్ చేయించారు. విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడానికి యాజమాన్యమే కారణమని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాన్సన్‌బాబు, నరేష్, నగర అధ్యక్ష,కార్యదర్శులు రమణయ్య, మనోహర్ పాల్గొన్నారు. యాజమాన్యం ఒత్తిడి భరించలేకనే అమ్మాయిలు బలవన్మరణానికి పాల్పడ్డారని ఏపీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్ర ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి మహేష్, సహాయకార్యదర్శి హరీష్ పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ చేపట్టారు. కళాశాల అధినేత మంత్రి కావడంతో విద్యార్థినుల మృతి కేసులో దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి గోపి ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మంత్రి నారాయణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి డిమాండ్ చేశారు. బీసీ స్టూడెంట్ ఫెడరేషన్, ఏసీఎస్బీ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఘటనపై స్పందించకుండా మంత్రి నారాయణను కాపాడేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆయా సంఘాల నాయకులు కరుణకుమార్, సాకే సురేష్, ఎం.మురళి విమర్శించారు. ఇండియన్ ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఐఎంఎం అధ్యక్షులు మహబూబ్‌బాషా, యూసుబ్, జాఫర్, షఫి, ఇమ్రాన్ పాల్గొన్నారు. తాడిమర్రిలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. గుత్తి పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గుంతకల్లు పట్టణంలో ఏబీవీపీ నాయకులు విద్యార్థినులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పొట్టిశ్రీరాములు సర్కిల్లో మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలను బంద్ చేయించారు. హిందూపురం పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి అనంతర దహనం చేశారు. కదిరి పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు. తనకల్లులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు, కుందుర్పిలో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. రాయదుర్గం పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువులో టీఎస్ఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి అక్కులప్ప నాయక్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయండి’ యూనివర్సిటీ : విద్యార్థుల నిండు ప్రాణాలు బలితీసుకుంటున్న నారాయణ విద్యా సంస్థలను వెంటనే రద్దు చేయాలని ఎస్కేయూ ఐక్య విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలపై నిజాలు నిగ్గుతేల్చాలని కోరుతూ బుధవారం ఎస్కేయూలో బంద్ నిర్వహించారు. ఒక వైపు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ, మరోవైపు నారాయణ విద్యా సంస్థకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు కూడా నారాయణ కళాశాలల్లో వాటాలు ఉండడం వల్లే ఆ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.వి.లింగా రెడ్డి, ఎస్కేయూ అధ్యక్షుడు గెలివి నారాయణ రెడ్డి, ఐక్య కార్యచరణ సమితి నేత పులిరాజు, ఏఐఎస్ఎఫ్ నేత వెంకటేశులు, ఎన్ఎస్యూఐ నేత శంకర్‌రెడ్డి, జీవీఎస్ నేత చిన్న శంకర్‌నాయక్ పాల్గొన్నారు. -
భగ్గుమన్న విద్యార్థిలోకం
నారాయణ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా కడప బంద్ విజయవంతం * పోలీసు నిర్బంధంలోనూ స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు * విద్యార్థినుల మృతిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు * పలుచోట్ల మంత్రి నారాయణ దిష్టిబొమ్మలు దగ్ధం సాక్షి నెట్వర్క్: నారాయణ విద్యా సంస్థలపై ప్రజాగ్రహం మిన్నంటింది. విద్యార్థిలోకం భగ్గుమంది. కడప నగర శివారులోని నారాయణ జూనియర్ కళాశాల బాలికల హాస్టల్లో ఇద్దరు విద్యార్థినుల మరణానికి కారకులైనవారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన కడప బంద్ విజయవంతమైంది. నగరంలో బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధం విధించి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. 15 నెలల్లో ఏకంగా 11 మంది నారాయణ సంస్థల విద్యార్థులు మరణించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగమంతా కడపలో తిష్టవేసి అర్థరాత్రి నుంచే అక్రమ అరెస్టులకు పాల్పడింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమ్జాద్ బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, కడప నగర పార్టీ అధ్యక్షుడు నిత్యానందరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఉదయం బంద్ చేయడానికి రోడ్డుపైకి వచ్చిన వారందరినీ బలవంతంగా అరెస్ట్ చేసినప్పటికీ బంద్ విజయవంతం కాకుండా అడ్డుకోలేకపోయారు. నగరవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు మూత పడ్డాయి. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, మౌన ప్రదర్శనలు జరిగాయి. జిల్లాలోని రాజంపేట, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులకు రక్షణ కరువైందని మండిపడ్డారు. మరోవైపు వామపక్ష పార్టీలు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ, పీడీఎస్‌యూ వంటి సంఘాల ఆధ్వర్యంలో రాయలసీమ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కళాశాలల బంద్ జరిగింది. పలుచోట్ల ప్రదర్శనలు, మంత్రి నారాయణ దిష్టిబొమ్మల దగ్ధం వంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి నారాయణను తక్షణమే బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సీమ వ్యాప్తంగా..: చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మార్‌పల్లిలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దీనికి సంబంధించి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు విశ్వనాథ్లతోపాటు మరో 11మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలులో జిల్లాగేటు వద్ద విద్యార్థులు రాస్తారోకో చేశారు. అనంతపురం జిల్లాలోని అనంతపురం, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రిలో ఆందోళనలు జరిగాయి. సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నారాయణ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని ఎస్కే యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. కార్పొరేట్ కళాశాలలు బంద్ విజయవాడ నగరంలోని కార్పొరేట్ కళాశాలలను విద్యార్థి సంఘాలు మూసివేయించాయి. ఏలూరు రోడ్డులోని నారాయణ కాలేజీ వద్ద ఏఐఎస్ఎఫ్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళనకు దిగారు. బెంజిసర్కిల్ వద్ద మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లాలో కొన్ని కళాశాలల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య, నేతలు వినోద్, విఠల్, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మహంకాళి సుబ్బారావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పీడీఎస్‌యూ నేతలు మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టరేట్ నుంచి మానవహారంగా ఏర్పడి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. ఏబీవీపీ నాయకులు కార్పొరేట్ కాలేజీలను మూసివేయించారు. నెల్లూరు హరనాథపురంలోని నారాయణ కశాశాల ఎదుట పోలీసులకు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుడు శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో నారాయణ మెడికల్ కాలేజీని విద్యార్థులు ముట్టడించడంతో పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ కార్పొరేట్ కళాశాలలను మూసివేయించింది. శ్రీకాకుళం జిల్లాలోని పలు పట్టణాల్లో విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. విశాఖపట్నంలోని పెద వాల్తేరు, సంపత్‌నగర్, వినాయక టెంపుల్ రోడ్డులోనూ విద్యార్థి సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐద్వా, ఎస్ఎఫ్ఐ నాయకులు మంత్రి నారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
లాభార్జనే నారాయణ లక్ష్యం
♦ కళాశాలలో అమలుకు నోచుకోని కనీస నిబంధనలు ♦ ఇరుకు గదులు.. బట్టీ చదువులకే ప్రాధాన్యత సాక్షి ప్రతినిధి, కడప : 36 ఇయర్స్ ఎక్స్‌లెన్సీ.. నారాయణ ప్రతిభకు పట్టం.. అన్న నినాదంతో పేరెంట్స్‌ను ఆకర్షిస్తున్న నారాయణ విద్యా స్థంస్థల్లో బట్టీ చదువులకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కనీస నిబంధనలకు నోచుకోకుండా ఆదాయమే ధ్యేయంగా లెక్కలేనన్ని బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నారు. విద్యార్థినుల మృతి నేపథ్యంలో నారాయణ విద్యా సంస్థల్లో పలు అతిక్రమణలు వెలుగు చూస్తున్నాయి. కళాశాలలు 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 20 శాతం పార్కింగ్ ఏరియాగా ఉంచాలని నిబంధనలు వివరిస్తున్నాయి. 20/20 విశాలమైన రూంలో 20 మంది విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసించేం దుకు కూర్చోగలరని చట్టా లు చెబుతున్నాయి. మానసిక ఆటవిడుపు కోసం కచ్చితంగా ఆట స్థలం ఉండాలి. విద్యార్థులు మైరుగైన లక్ష్యాల కోసం ల్యాబ్‌లు తప్పనిసరి. ఈ నిబంధనలేవీ నారాయణ విద్యా సంస్థలకు వర్తించడం లేదని పలువురు వివరిస్తున్నారు. నగర శివారులోని బాలికల రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ క్యాంపస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు అంతస్తుల్లో హాస్టల్‌ను కొనసాగిస్తున్నారు. సుమారు 40 గదులున్నాయి. తొలి సంవత్సరం విద్యార్థినులు 308 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 252 మంది ఉన్నారని రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. సరాసరి ఒక్కో గదికి 14 మంది చొప్పున హాస్టల్ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల మంచాల మధ్య ఖాళీ స్థలం లేదు. మధ్యలో ఉన్న దారి నుంచి నేరుగా మంచంపైకి ఎక్కేందుకే మార్గముంది. బాత్ రూముల వద్ద క్యూ కట్టాల్సిన పరిస్థితి. తరగతి గదులు సైతం ఇరుకుగానే ఉన్నట్లు పేరేంట్స్ వాపోతున్నారు. సింగపూర్ రాజధాని సరే.. చదువు లేవీ..? ఇటీవల మంత్రి నారాయణ సింగపూర్ తరహాలో రాజధాని నిర్మిస్తామని పదేపదే వివరిస్తున్నారు. ఆ తరహాలో ముందుగా తన కళాశాలల్లో విద్యార్థులకు చదువులు కొనసాగించాలని పలువురు హితబోధ చేస్తున్నారు. ప్రతిరోజు 14 గంటలు బట్టీ చదువులతో కుస్తీ పట్టించడం మినహా విద్యార్థుల్లో మానసిక పరివర్తనకు చొరవ చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 560 మంది విద్యార్థులున్న క్యాంపస్‌లో కనీస ఆటవిడుపు లేకపోవడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి విద్యార్థినులు గురవుతున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. బాలికల రెసిడెన్షియల్ కళాశాల క్యాంపస్‌లో ఎలాంటి ల్యాబ్ లేకపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. రాష్ట్రంలో నారాయణ కళాశాలలు ఎన్ని ఉన్నాయి? ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? బోధనా సిబ్బంది ఎంత మంది ఉన్నారు? వారి జీతాలెంత? ఉత్తీర్ణత శాతమెంతా? ఫీజులెంత? అన్న విషయాలను బహిర్గతం చేసి నారాయణ తన పారదర్శకత చాటుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దహనం
నెల్లూరు (టౌన్) : నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థినుల మృతికి నిరసనగా బుధవారం నగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దహనం చేశారు. గాంధీబొమ్మ సెంటరు నుంచి వీఆర్ కళాశాల వరకు ప్రదర్శన చేశారు. దిష్టిబొమ్మ దహనం చేసే విషయంలో కొద్దిసేపు పోలీసులు, ఎస్ఎఫ్ఐ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్‌చేసి 4వ పట్టణపోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ విద్యార్థినుల మృతికి బాధ్యతగా నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయుకులు ప్రసాద్, నందకిరణ్, రాము, నవీన్, రవీంద్ర, తరుణ్, క్రాంతి, విజయ్, ఆఫ్రోజ్, కృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు. నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ ఇద్దరు విద్యార్థినుల మృతికి కారకులై న నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి నరేంద్ర డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ముత్తుకూరు బస్డాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థినులు మృతి చెందారని తెలిపారు. కేవలం మంత్రి పదవి ఉందన్న కారణంగా అనుమతులు లేకుండానే నారాయణ విద్యా సంస్థలు నడుస్తున్నాయన్నారు. నగర హాస్టల్స్ ఇన్చార్జి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నీరదారెడ్డి కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఏబీవీపీ నాయకులు నవీన్, నరేష్, బాలకృష్ణ, రాజు, శ్రీకాంత్, సతీష్, మాధవ్, కౌషిక్ తదితరులు పాల్గొన్నారు.