లాభార్జనే నారాయణ లక్ష్యం
♦ కళాశాలలో అమలుకు నోచుకోని కనీస నిబంధనలు
♦ ఇరుకు గదులు.. బట్టీ చదువులకే ప్రాధాన్యత
సాక్షి ప్రతినిధి, కడప : 36 ఇయర్స్ ఎక్స్‌లెన్సీ.. నారాయణ ప్రతిభకు పట్టం.. అన్న నినాదంతో పేరెంట్స్‌ను ఆకర్షిస్తున్న నారాయణ విద్యా స్థంస్థల్లో బట్టీ చదువులకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కనీస నిబంధనలకు నోచుకోకుండా ఆదాయమే ధ్యేయంగా లెక్కలేనన్ని బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నారు. విద్యార్థినుల మృతి నేపథ్యంలో నారాయణ విద్యా సంస్థల్లో పలు అతిక్రమణలు వెలుగు చూస్తున్నాయి. కళాశాలలు 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 20 శాతం పార్కింగ్ ఏరియాగా ఉంచాలని నిబంధనలు వివరిస్తున్నాయి. 20/20 విశాలమైన రూంలో 20 మంది విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసించేం దుకు కూర్చోగలరని చట్టా లు చెబుతున్నాయి. మానసిక ఆటవిడుపు కోసం కచ్చితంగా ఆట స్థలం ఉండాలి. విద్యార్థులు మైరుగైన లక్ష్యాల కోసం ల్యాబ్‌లు తప్పనిసరి.
ఈ నిబంధనలేవీ నారాయణ విద్యా సంస్థలకు వర్తించడం లేదని పలువురు వివరిస్తున్నారు. నగర శివారులోని బాలికల రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ క్యాంపస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు అంతస్తుల్లో హాస్టల్‌ను కొనసాగిస్తున్నారు. సుమారు 40 గదులున్నాయి. తొలి సంవత్సరం విద్యార్థినులు 308 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 252 మంది ఉన్నారని రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. సరాసరి ఒక్కో గదికి 14 మంది చొప్పున హాస్టల్ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల మంచాల మధ్య ఖాళీ స్థలం లేదు. మధ్యలో ఉన్న దారి నుంచి నేరుగా మంచంపైకి ఎక్కేందుకే మార్గముంది. బాత్ రూముల వద్ద క్యూ కట్టాల్సిన పరిస్థితి. తరగతి గదులు సైతం ఇరుకుగానే ఉన్నట్లు పేరేంట్స్ వాపోతున్నారు.
సింగపూర్ రాజధాని సరే.. చదువు లేవీ..?
ఇటీవల మంత్రి నారాయణ సింగపూర్ తరహాలో రాజధాని నిర్మిస్తామని పదేపదే వివరిస్తున్నారు. ఆ తరహాలో ముందుగా తన కళాశాలల్లో విద్యార్థులకు చదువులు కొనసాగించాలని పలువురు హితబోధ చేస్తున్నారు. ప్రతిరోజు 14 గంటలు బట్టీ చదువులతో కుస్తీ పట్టించడం మినహా విద్యార్థుల్లో మానసిక పరివర్తనకు చొరవ చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 560 మంది విద్యార్థులున్న క్యాంపస్‌లో కనీస ఆటవిడుపు లేకపోవడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి విద్యార్థినులు గురవుతున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. బాలికల రెసిడెన్షియల్ కళాశాల క్యాంపస్‌లో ఎలాంటి ల్యాబ్ లేకపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
రాష్ట్రంలో నారాయణ కళాశాలలు ఎన్ని ఉన్నాయి? ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? బోధనా సిబ్బంది ఎంత మంది ఉన్నారు? వారి జీతాలెంత? ఉత్తీర్ణత శాతమెంతా? ఫీజులెంత? అన్న విషయాలను బహిర్గతం చేసి నారాయణ తన పారదర్శకత చాటుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.