నారాయణపై నిప్పులు
జిల్లా బంద్ విజయవంతం
♦ మూతపడిన కార్పొరేట్ విద్యా సంస్థలు
♦ కడపలో విద్యార్థినుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్
♦ మంత్రి నారాయణ దిష్టిబొమ్మలు దహనం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/ న్యూసిటీ : కార్పొరేట్ స్కూళ్ల, కాలేజీల అకృత్యాలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరం నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల బలవనర్మరణంపై విద్యార్థి లోకం మండిపింది. బుధవారం జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో కార్పొరేట్ పాఠశాలలకు ముందుగానే సెలవు ప్రకటించారు. ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థి సమాఖ్యల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పలు చోట్ల మంత్రి నారాయణ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని నినదించారు.
కర్నూలు నగరంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కేవీఆర్ మహిళా ఇంటర్, డిగ్రీ విద్యార్థులు రాజ్‌విహార్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శులు లెనిన్‌బాబు, శ్రీనివాసులు మాట్లాడుతూ.. నారాయణ మంత్రి అయిన తరువాత ఆయనకు సంబంధించిన కళాశాలల్లో 11 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల అక్రమాలపై ఏర్పాటు చేసిన నీరదారెడ్డి కమిటీ సిఫార్సులను బట్టబయలు చేసి అమలు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యరద్శి సునీల్‌రెడ్డి కోరారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్పొరేట్ విద్యా సంస్థలకు తొత్తుగా మారి పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలలకు కొమ్ముకాస్తూ పేద విద్యార్థుల ప్రాణాలను బలిగొంటోందని పీడీఎస్‌యూ జిల్లా కార్యరద్శి భాస్కర్ విమర్శించారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్నంగా కళ్ల గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖమంత్రి గంటాశ్రీనివాసరావు కార్పొరేట్ కళాశాలల అక్రమాలకు వంతన పాడుతున్నాడని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ విమర్శించారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
కల్లూరు: నారాయణ విద్యా సంస్థల్లో 15 నెలల్లో 11 మంది విద్యార్థులు అనుమానాస్పదంగా మృతిచెందారని, ఈ ఘటనలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపించాలని వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బిర్లాగేటు వద్ద రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట వెంకట కృష్ణారెడ్డి వీరికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి నారాయణను వెంటనే బర్త్ప్ ్రచేయాలన్నారు.