
హీరో నాగార్జున , కె. రాఘవేంద్రరావు
- అక్కినేని పురస్కారాల సభలో హీరో నాగార్జున
సాక్షి, విజయవాడ బ్యూరో: దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఎప్పటికీ మన మనస్సుల్లో బతికే ఉంటారని ప్రముఖ హీరో, ఆయన తనయుడు నాగార్జున అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బుధవారం సాయంత్రం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని రాష్ట్రమంత్రి కామినేని శ్రీనివాస్, హీరో నాగార్జున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు సందేశాన్ని కామినేని చదివి వివిపించారు. మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు టి.ప్రసాద్, ప్రిన్సిపాల్ శంకర్ ప్రసంగించారు.
ప్రముఖులకు అక్కినేని పురస్కారాలు
వివిధ రంగాల్లో విశేషమైన సేవలందిస్తోన్న తొమ్మిది మంది ప్రముఖులకు అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పర్వతరావు, శాంతాబయోటెక్ అధినేత వరప్రసాదరెడ్డి, ఐఏఎస్ అధికారి సంపత్‌కుమార్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హృద్రోగ నిపుణుడు డాక్టర్ మన్నం గోపీచంద్, విద్యావేత్త ఎంఎన్ రాజు, వంశీ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపకుడు వంశీరామరాజు, నాటక రంగ ప్రముఖుడు జి.గోపాలకృష్ణ, క్రీడారంగంలో వెన్నం జ్యోతి సురేఖలు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.