రాజధాని ప్రతిపాదిత రైతులకు ‘సింగపూర్' సినిమా చూపించిన బాబు
రాజధాని ప్రతిపాదిత రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ సినిమా చూపిం చారు. అరచేతిలో ఆకాశహర్మ్యాలు నిర్మించారు...మాటలతో కోటలు కట్టారు. తుళ్లూరు, మంగళగిరి,తాడేపల్లి ప్రాంతాలను మరో సింగపూర్‌ను చేస్తానన్నారు. రైతులను ఇంద్ర భవనాల్లో కూర్చోబెడతానన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపేలా తయారు చేస్తానన్నారు.
జీవన వికాస సూత్రాలు బోధించారు. సీఎం మాటల గారడీకి చేష్టలుడిగిన రైతులు ఆయన చెప్పింది చెవికెక్కించుకుని తిరుగుపయనమయ్యారు. ఏతా వాతా తేల్చింది ఏమిటంటే భూములు లాక్కోవడమే...!
తుళ్లూరు: రాజధాని భూ సమీకరణకు ఎంపిక చేసిన తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండల రైతులతో మంగళవారం సీఎం చంద్రబాబుతో హైదరాబాద్‌లో ముఖాముఖీ సమావేశమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందని ఆశించి వెళ్లిన రైతులతో రాత్రి 7.30 గంటల తరువాతే సీఎం సమావేశమయ్యారు.
ఇక్కడ చర్చకు వచ్చిన అంశాలపై తుళ్లూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు బండ్ల పట్టాభిరామయ్య, నాయకులు ధనేకుల రామారావు, పువ్వాడ సుధాకర్, జమ్ముల అనిల్, జొన్నలగడ్డ కిరణ్‌కుమార్, దామినేని శ్రీనివాసరావు తదితరులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా వున్నాయి.. తుళ్లూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు మాట్లాడుతూ.. తుళ్లూరు మండలంలో జరీబు భూములకు, కృష్ణానది ఆయకట్టులో ఉన్న గ్రామాల రైతులకు మరింత ప్యాకేజీ పెంచాలని కోరారు. మందడం గ్రామ రైతులు ఎక్కువ మంది 1400 గజాల రెసిడెన్షియల్ ఫ్లాట్, 400 గజాల కమర్షియల్ ఫ్లాట్ కావాలని కోరుతున్నారని తెలిపారు.
నేలపాడు గ్రామానికి చెందిన ధనేకుల రామారావు మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి తమ గ్రామంతో సహా వ్యవసాయ భూములు ఇచ్చేందుకు గ్రామస్తులు అంగీకరించారని, తమ గ్రామస్తులను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ గ్రామాలను తీసుకునే యోచన లేదన్నారు.
కృష్ణానది కరకట్ట గ్రామాల్లో ఉన్న జరీబు భూములు, పంట భూములను మినహాయించాలని పలువురు రైతులు కోరగా, సీఎం నిష్కర్షగా తోసిపుచ్చారు. ఆ గ్రామాలు తీసుకోని పక్షంలో రాజధానికి కళే లేదని, ఆ గ్రామాలతోనే రాజధానికి మరింత వైభవం రానుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కరకట్టవెంట గ్రామాలు, పంట భూములను వదిలేది లేదని, రైతుల అభివృద్ధికనుగుణంగా కోరిన ప్యాకేజీలను పరిశీలించి మెరుగైన లాభాలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని రైతులు తెలిపారు.
ఉత్సాహం ఉన్న రైతులు వస్తానంటే సింగపూర్ చూపిస్తానని అన్నారు. అలాగా మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి రాజధాని నిర్మాణం చేసేందుకు ముందుకు వస్తున్నాయని, అవసరమై తే తాను తుళ్లూరులోనే నివాసం ఏర్పాటు చేసుకు ని ప్రజల భాగస్వామ్యంతో నూతన రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
తరతరాలుగా వస్తున్న భూములను వదులుకోవడానికి ఇష్టపడని రైతులనుద్దేశించి సీఎం మా ట్లాడుతూ ప్రతి మానవ జీవితంలో మార్పు అవసరమని, వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని అభివృద్ధిలోకి వెళ్లడం మానవనైజమని చెప్పారన్నారు. మా కెందుకులే అనుకుంటే తానుపొలం పనులు చేసుకుంటూ ఉండేవాడినని, తనకెందుకులే అనుకుంటే నందమూరి తారకరామారావు సినిమా ఇండస్ట్రీకి వచ్చేవారు కాదన్నారు. ఇలా అనేక ఉదాహరణలు చెపుతూ రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారని తెలిపారు.
అంతన్నారు..ఇంతన్నారు..
Published Wed, Nov 19 2014 1:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement