అవినీతి గని | Anti-corruption Department a series of attacks, corrupt officials | Sakshi
Sakshi News home page

అవినీతి గని

Published Sat, Oct 5 2013 2:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM

Anti-corruption Department a series of attacks, corrupt officials

సాక్షి, విశాఖపట్నం/పెదవాల్తేరు, న్యూస్‌లైన్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస దాడులతో అవినీతి అధికారులు హడలి పోతున్నారు. ఇటీవల శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వరరావు, వుడా డీఎఫ్‌ఓ శంబంగి రామ్మోహన్, మొన్న విశాఖ అర్బన్ డీఎస్‌ఓ జ్వాలా ప్రకాష్ తాజాగా విశాఖ మైనిం గ్ అండ్ జియాలజీ(విజిలెన్స్) అసిస్టెంట్ డెరైక్టర్ మన్యం సుబ్రహ్మణ్యం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఈయనకు రూ.10 కోట్లు వరకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు తేల్చారు. వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  
 
తవ్వేకొద్దీ... : తాజాగా ఏసీబీకి పట్టుబడ్డ మైనింగ్ ఏడీ సుబ్రహ్మణ్యం ఆస్తుల లెక్క తేల్చడానికి ఒక రోజు సమయం సరిపోలేదు. రాష్ట్రంలో పలుచోట్ల అక్రమాస్తులు ఉండడంతో శుక్రవారం రాత్రైనా సోదాలు ఆగలేదు. కడపటి సమాచారం మేరకు ఆదాయానికి మించి రూ.10 కోట్లు అదనపు ఆస్తులున్నట్టు తేలింది. ఈ అంకె ఇంకా పెరగొచ్చని ఏసీబీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సుబ్రహ్మణ్యానికి సం బంధించి శుక్రవారం  తెల్లవారుజామున రాష్ట్రం లోని ఏడుచోట్ల సోదాలు ప్రారంభించారు. విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో దాదాపు 10 బృం దాలు సోదాలు నిర్వహించాయి.

ఏసీబీ డీఎస్పీ నర్సింహారావు నేతృత్వంలో సీఐలు రామకృష్ణ, రమణరావు, రాఘవరావు ఒక బృందంగా నగరంలోని హెచ్‌బీ కాలనీలోని సుబ్రహ్మణ్యం ఇంట్లో,  మురళీనగర్‌లోని మైనింగ్ అండ్ జియాలజీ(విజిలెన్స్) ఏడీ కార్యాలయంలో సోదాలు చేశారు. మిగతా తొ మ్మిది బృందాలు సుబ్రహ్మణ్యం స్వస్థలం గుంటూ రు జిల్లా గుల్లపల్లి, సమీప బంధువులున్న కంకిపా డు, కృష్ణా జిల్లాలోని పలుచోట్ల సోదాలు చేశాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు ఉన్నట్టు తేల్చాయి.
 
బయటపడ్డ ఆస్తులివే : కృష్ణా, గుంటూరు జిల్లాలో 20 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తించారు. విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలో మూడు ఇళ్లు ఉన్నట్టు నిర్ధారించారు. లక్షలాది రూపాయలు విలువైన బీమా పత్రాలు, రెండు వాహనాలు, బ్యాంక్ లాకర్, విలువైన బం గారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. ఒక్క విశాఖ లోని హెచ్‌బీ కాలనీలోని ఇళ్లే సుమారు రూ.2 కోట్లు విలువ ఉంటుందని అంచనా వేశారు. ఈ లెక్కన స్టాంప్ డ్యూటీ ప్రకారం రూ.కోటి70 లక్షలు అదనపు ఆస్తులున్నట్టు ప్రాథమిక విలువ కట్టారు. మార్కెట్ విలువ ప్రకారమైతే రూ.10 కోట్లు ఉండొచ్చని ఏసీబీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

1990లో అసిస్టెంట్ టెక్నిషియన్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన సుబ్రహ్మణ్యం దశల వారీగా పదోన్నతులు పొందారు. 2006లో అసిస్టెంట్ డెరైక్టర్‌గా పదొన్నతి పొందిన ఆయన గుంటూరు, ఏలూరు, విజయవాడ, శ్రీకాకుళం జిల్లాల్లో పనిచేశారు. సుబ్రహ్మణ్యం తండ్రి సాధారణ వ్యవసాయ రైతే. కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. 2001లో కూడా సుబ్రహ్మణ్యంపై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న అభియోగంతో ఏసీబీ అధికారులు అకస్మిక దాడులు చేసినట్టు తెలిసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement