2023లోకి అడుగు పెట్టాం. కొత్త ఏడాదిలో ముందుగా నిర్వహించాల్సిన కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులు ఉన్నాయి. బ్యాంకు లాకర్ల ఒప్పందాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం మొదటిది. ఇందుకు సంబంధించి కొన్ని బ్యాంకు కస్టమర్లకు సందేశాలు వస్తున్నాయి. తర్వాత పన్నుల ఆదా పెట్టుబడులకు సంబంధించిన వివరాలను పనిచేస్తున్న కంపెనీలకు సమర్పించడం. ఒకవేళ ఇప్పటికీ ఆ పనిచేయకపోతే మించిపోయినది ఏమీ లేదు. మరో మూడు నెలల గడువు ఉందని గమనించాలి. అలాగే, కొన్ని కీలకమైన మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..
లాకర్ ఒప్పందాల్లో మార్పులు
బ్యాంకుల్లో లాకర్లు చాలా మందికి ఉంటాయి. ఈ సేఫ్ డిపాజిట్ లాకర్‌కు సంబంధించి ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలంటూ బ్యాంకులు తమ కస్టమర్లను కోరుతున్నాయి. ‘‘ప్రియమైన కస్టమర్, ఆర్‌బీఐ సూచనల మేరకు మీరు మీ బ్రాంచ్‌కు వెళ్లి సవరించిన లాకర్ ఒప్పందాన్ని జనవరి 1 నాటికి కుదుర్చుకోవాలి. ఇప్పటికే ఆ పనిచేసి ఉంటే ఈ సందేశాన్ని మర్చిపోండి’’అనే సందేశం చాలా మంది కస్టమర్లకు వస్తోంది.
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ ఇందుకు సంబంధించి తన కస్టమర్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తోంది. 2021 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితమే ఇది. కోర్టు ఆదేశాలు వెలువడిన ఆరు నెలల్లో లాకర్ నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాల్లో మార్పులను ఖరారు చేయాలని ఆర్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 2021 ఆగస్ట్‌లో ఆర్‌బీఐ ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా బ్యాంక్ బోర్డులు ఆమోదించిన లాకర్ నిర్వహణ ఒప్పందాన్ని బ్యాంకులు అమల్లో పెట్టాల్సి ఉంది. ‘‘ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ రూపొందించే నమూనా లాకర్ ఒప్పందాన్ని బ్యాంకులు అమలు చేయవచ్చు. ఈ ఒప్పందం, సవరించిన మార్గదర్శకాలు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉండాలి’’అని ఆర్‌బీఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కొత్త నిబంధనలు కొత్తగా లాకర్ తీసుకునే వారికి 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. కానీ, దానికంటే ముందు లాకర్ తీసుకున్న వారికి ఈ ఏడాది జనవరి 1 వరకు గడువు ఉంది. ఎస్‌బీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర చాలా బ్యాంకులు సవరించిన నిబంధనలతో లాకర్ ఒప్పందాలను అమల్లోకి తీసుకొచ్చాయి. కాకపోతే ఇప్పటికీ చాలా మంది లాకర్ ఒప్పందాలపై తిరిగి సంతకాలు చేయలేదు. నిజానికి నూతన నిబంధనలన్నవి కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో తీసుకొచ్చినవి. అందుకుని ఆలస్యం చేయకుండా కస్టమర్లు తమ బ్యాంక్ శాఖకు వెళ్లి కొత్త ఒప్పంద డాక్యుమెంట్లు, స్టాంప్ పేపర్లపై సంతకాలు పెట్టాలి. కొన్ని బ్యాంకులు స్వయంగా ఈ డాక్యుమెంట్లను అందిస్తుంటే, కొన్ని స్టాంప్ పేపర్లు తెచ్చుకోవాలంటూ కస్టమర్లకే చెబుతున్నాయి.
స్టాంప్ పేపర్‌పై ఒప్పందం కుదుర్చుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. ఇరు పార్టీలు చేసుకున్న ఒప్పందం కాపీ ఒకదాన్ని లాకర్‌ను అద్దెకు తీసుకున్న వ్యక్తికి అందించడం కూడా తప్పనిసరి. ఒరిజినల్ అగ్రిమెంట్ పత్రాలు బ్యాంకు దగ్గరే ఉంటాయి. బ్యాంక్ అడిగినప్పుడే లాకర్ పునరుద్ధర గురించి ఆలోచిద్దామని అనుకోకుండా, స్వయంగా వెళ్లి దాన్ని పూర్తి చేసుకోవడం అవసరం. ‘‘బ్యాంక్‌లు తమ కస్టమర్లతో కొత్త ఒప్పందాలను 2023 జనవరి 1 నాటికి చేసుకోవడం తప్పనిసరి. ఈ తేదీని పొడిగింపుపై స్పష్టత లేదు. అందుకని కస్టమర్లే తమ బ్యాంక్ శాఖలకు వెళ్లి దీన్ని అప్‌డేట్ చేసుకోవాలి’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి సూచించారు. కొన్ని బ్యాంక్‌లు కస్టమర్లకు సమాచారం ఇస్తున్నాయే కానీ, నిర్ణీత గడువులోపు చేయాలంటూ నిర్ధేశించడం లేదు. కాకపోతే లాకర్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకునే సమయంలో పూర్తిగా చదివి, నియమ నిబంధనలు తెలుసుకోవాలి.
ఇక బ్యాంకు లాకర్ నిబంధనలపైనా అవగాహన కలిగి ఉండడం అవసరం. ఏడాదిలో ఒక్కసారి అయినా లాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఉండాలి. లేదంటే బ్యాంక్‌లు చర్యలు తీసుకుంటాయి. ఏడాది పాటు వినియోగంలో లేని లాకర్‌ను బద్దలు కొట్టి అందులో ఉన్న వాటిని స్వాధీనం చేసుకునే అధికారం బ్యాంక్‌లకు ఉంటుంది. ఈ విధమైన సమస్య రావద్దని అనుకుంటే కనీసం ఏడాదిలో ఒకటి రెండు సార్లు అయినా లాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. బ్యాంక్‌లు లాకర్లకు సంబంధించి మూడేళ్ల అద్దెకు సరిపడా డిపాజిట్‌ను ఖాతాదారుల నుంచి తీసుకునేందుకును ఆర్‌బీఐ అనుమతించింది. అంతేకాదు, లాకర్లను బ్రేక్ చేసేందుకు అయ్యే వ్యయాలను కూడా ముందుగా తీసుకోవచ్చు. లాకర్ తీసుకుని, వాటిని నిర్వహించకుండా, అద్దె కట్టకుండా ఉండే రిస్క్‌ను ఇది తప్పిస్తుంది. అయితే, దీర్ఘకాలం నుంచి ఖాతాదారులుగా, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కస్టమర్ల విషయంలో బ్యాంకులు ఈ విధమైన చర్యలను దాదాపుగా తీసుకోవు. లాకర్లను ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా నిర్వహించే కస్టమర్లను లాకర్ డిపాజిట్ కోసం ఒత్తిడి చేయవద్దని ఆర్‌బీఐ సైతం బ్యాంక్‌లకు సూచించడం గమనార్హం. బ్యాంక్‌లు లాకర్ కోసం డిపాజిట్ తీసుకున్నా.. రద్దు చేసుకుంటే తిరిగి ఆ డిపాజిట్ వెనక్కిచ్చేస్తాయి.
పన్ను ఆదా వివరాలు
ఉద్యోగులు పన్ను మినహాయింపు పెట్టుబడులు, ఇతర వ్యయాలకు సంబంధించిన వివరాలను పనిచేసే సంస్థకు జనవరి నెలలోనే సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉంటే, టీడీఎస్‌ను మూడు నెలల వేతనాల్లో సంస్థలు మినహాయిస్తాయి.
కనుక ప్రతి ఉద్యోగి బీమా పథకాలు, ఈఎల్‌ఎస్‌ఎస్ పెట్టుబడులు, పీపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్, పిల్లల ట్యూషన్ ఫీజు తదితర వివరాలను అందించాలి. పన్ను మినహాయింపుల పెట్టుబడుల వివరాలు ఇవ్వడం వల్ల టీడీఎస్ బాధ్యతను తప్పించుకోవడం లేదంటే తగ్గించుకోవచ్చు.
కేవైసీ తప్పనిసరి
హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ట్రావెల్ లేదా మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని జనవరి 1 నుంచి కొనుగోలు చేసేవారు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. ఈ మేరకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
‘‘గతంలో అయితే క్లెయిమ్ రూ.లక్ష మించినప్పుడే పాన్, ఆధార్ నంబర్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు హెల్త్, ట్రావెల్, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే సమయంలోనే గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా ధ్రువీకరణ కోసం పాన్, ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ సమర్పించడం తప్పనిసరి. అన్ని రకాల బీమా ప్లాన్లకు ఈ నిబంధన వర్తిస్తుంది’’అని పాలసీబజార్ సీఈవో సర్బ్‌వీర్ సింగ్ తెలిపారు.
బ్యాంక్ పాస్‌బుక్ కాపీ పనికిరాదు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లు కేవైసీ కింద చిరునామా ధ్రువీకరణ కోసం బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్ కాపీ ఇస్తే గతంలో అనుమతించేవారు.
ఇప్పుడు ఇవి చెల్లుబాటు కావు. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లెటర్, ఆధార్‌ను సమర్పించొచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల కోసం ఇప్పటికీ బ్యాంకు స్టేట్‌మెంట్ కాపీ ఇవ్వొచ్చు.
ఎన్‌పీఎస్ పాక్షిక ఉపసంహరణలు
కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఎన్‌పీఎస్ చందాదారులు పాక్షిక ఉపసంహరణకు సంబంధించి నోడల్ ఆఫీసర్ ధ్రువీకరణ తప్పనిసరి నిబంధన నుంచి పీఎఫ్‌ఆర్‌డీఏ ఉపశమనాన్ని ఇచ్చింది. దీంతో నోడల్ ఆఫీసర్ లేదా పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ నుంచి ఆమోదం అవసరం లేకుండానే ఎన్‌పీఎస్ చందాదారులు పాక్షిక ఉపసంహరణలకు వెసులుబాటు 2021 జనవరి 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కరోనా దాదాపు స్వల్ప స్థాయికి చేరడం, లాక్‌డౌన్ తదితర నిబంధనలు లేకపోవడంతో తిరిగి పాత నిబంధనను పీఎఫ్‌ఆర్‌డీఏ అమల్లోకి తీసుకొచ్చింది. కనుక ఈ జనవరి1 నుంచి ఎన్‌పీఎస్ కింద ప్రభుత్వ చందాదారులు గతంలోని నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది.
లకార్‌పై రుణం
బ్యాంక్ లాకర్‌లో ఆభరణాలతోపాటు విలువైన పత్రాలను పెట్టుకోవడం సహజం. లాకర్ అద్దె చెల్లించడంలో విఫలమైన కస్టమర్లను లాకర్ స్వాధీనం చేయాలని కొన్ని బ్యాంకులు సూచిస్తాయి. లాకర్‌లో ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చని బ్యాంక్‌లు కస్టమర్లకు చెబుతుంటాయి. అలా చేస్తే రుణంపై ప్రాసెసింగ్ చార్జీలు, వ్యాల్యూయర్ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. గోల్డ్ లోన్ ఓవర్‌డ్రాఫ్ట్ సుదుపాయంలో.. కావాల్సినప్పుడే రుణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్నప్పుడు రుణంపై నామమాత్రపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వినియోగించుకోకపోతే లాకర్ చార్జీల కంటే తక్కువే చెల్లిస్తే సరిపోతుంది. కానీ, దీని కంటే కూడా లాకర్‌లో ఉంచిన ఒకటి రెండు ఆభరణాలపై నేరుగా గోల్డ్ లోన్ తీసుకోవడమే నయం. అంతే కానీ, లాకర్ల ఆధారంగా ఇచ్చే గోల్డ్‌లోన్ కు వెళ్లకపోవడమే మంచిదని నిపుణుల సూచన. (క్లిక్: పన్ను ఆదా.. స్థిరమైన రాబడులు పొందాలంటే ఈ స్కీమ్‌లో చేరాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment