ఫోర్జరీ కేసులో టీడీపీ ఎమ్మెల్సీకి ముందస్తు బెయిల్
Published Tue, Mar 14 2017 6:32 PM | Last Updated on Fri, Aug 10 2018 7:13 PM
► దీపక్‌రెడ్డికి మంజూరు చేసిన నాంపల్లి న్యాయస్థానం
►రద్దు కోరుతూ హైకోర్టును ఆశ్రయించనున్న సీసీఎస్
సాక్షి, అనంతపురం: ఫోర్జరీ పత్రాలతో భూకబ్జాకు యత్నించిన కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈయనతో పాటు మరికొందరిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు ఫోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం విదితమే. ఈ బెయిల్ రద్దు చేయాల్సిందిగా కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలని సీసీఎస్ పోలీసుల నిర్ణయించారు.
రాయదుర్గంకు చెందిన దీపక్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయాన అల్లుడు. ఫోర్జరీ కేసులో సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేయడానికి ప్రయత్నించినా దొరక్కుండా దీపక్‌రెడ్డి తప్పించుకు తిరిగారు. అనారోగ్య కారణాల నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా... పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం మంజూరు చేసింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నెం.129/71లోని 3.37 ఎకరాల స్థలంపై దీపక్‌రెడ్డి సహా ఇతర నిందితులు కన్నేశారు. ఈ స్థలాన్ని కొన్ని దశాబ్దాల క్రితం నగరంలో నివాసం ఉన్న శరణార్థి అయూబ్ కమల్‌కు ప్రభుత్వం కేటాయించింది. దీన్ని ఆయన నుంచి 1960లో ఎంవీఎస్ చౌదరితో పాటు ఆయన సోదరులు ఉమ్మడిగా ఖరీదు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి ఆధీనంలోనే ఉంది. అయితే అయూబ్ కమల్ ఈ స్థలాన్ని అన్సారీ బ్రదర్స్‌కు విక్రయించినట్లు, వారి నుంచి దీన్ని తాము ఖరీదు చేసినట్లు జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాష్ చంద్ర సక్సేనాలతో పాటు జి.దీపక్‌రెడ్డి బోగస్ డాక్యుమెంట్లు రూపొందించారు. వీటి ఆధారంగా సివిల్ సూట్ దాఖలు చేయడం ద్వారా తదుపరి చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఎంవీఎస్ చౌదరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఆయన ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన షేక్‌పేట్ మండల రెవెన్యూ అధికారులు ఆ ఖరీదైన స్థలానికి ఎంవీఎస్ యజమానిగా తేల్చారు. దీంతో చౌదరి తరఫున ఆయన ప్రతినిధి మాదాపూర్‌కు చెందిన ఎం.రాధాకృష్ణ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వివరణ కోరుతూ దీపక్‌రెడ్డికి నోటీసులు జారీ చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఆయనకు హైదరాబాద్‌లో ఉన్న రెండు ఇళ్లల్లో వాకబు చేయగా..ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడిలో అనంతపురంలో ఉన్నట్లు అక్కడి వారు చెప్పారు. దీంతో ఓ ప్రత్యేక బృందం అనంతపురం వెళ్లి ప్రయత్నించినా దీపక్‌రెడ్డి ఆచూకీ లభించలేదు. దీంతో ఏపీ రాజధాని అమరావతిలోనూ కొన్ని రోజులు దీపక్‌రెడ్డి కోసం అధికారులు ప్రయత్నించారు. అక్కడ కూడా నోటీసులు తీసుకోవడానికి పోలీసులకు అందుబాటులోకి రాని దీపక్‌రెడ్డి న్యాయస్థానం ద్వారా ముందస్తు బెయిల్ పొందారు. దీన్ని రద్దు చేయించడానికి హైకోర్టును ఆశ్రయించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మిగిలిన నిందితులు బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాష్ చంద్ర సక్సేనాల కోసం కూడా సీసీఎస్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Advertisement