ఆకతాయిల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వీరి వేధింపులకు ఎక్కడో ఒకచోట యువతులు బలవుతూనే ఉన్నారు.
ఆకతాయిల వేధింపులకు అనూష బలి
Published Sun, Oct 6 2013 1:30 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
విద్యానగర్ (గుంటూరు), న్యూస్‌లైన్ :ఆకతాయిల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వీరి వేధింపులకు ఎక్కడో ఒకచోట యువతులు బలవుతూనే ఉన్నారు. ఆకతాయిల వికృత చేష్టలకు కలతచెంది దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు యత్నించిన యర్రబోయిన అనూష (17) గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో వారం రోజులగా చికిత్సపొందుతూ మృత్యువుతో పోరాడి శనివారం ఉదయం కన్నుమూసింది. గుంటూరు నగరంలోని వల్లూరివారితోట 8వ లైనుకు చెందిన అనూష స్థానిక సెయింట్ ఆన్స్ కళాశాలలో ఇంటర్ మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే లైనులో నివాసం ఉంటున్న మానుకొండ సాయి, మస్తాన్‌వలి అనే ఇద్దరు ఆకతాయిలు నెలరోజుల నుంచి వికృత చేష్టలతో ఆ విద్యార్థినిని వేధిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.
ఇదే విషయాన్ని తండ్రి సుబ్బారావుకు తెలియపరిచింది. ఆకతాయిలకు హితవు చెప్పేందుకు వెళ్లిన విద్యార్థిని తండ్రిపై వారు దాడికి దిగడంతో అనూష మానసికంగా కుంగిపోయింది. దిక్కుతోచని స్థితిలో బాధితురాలు సెప్టెంబర్ 29వ తేదీ ఇంటిలోని బాత్‌రూంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు, బంధువులు ఆమెను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకు రాగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారంరోజులుగా మృత్యువుతో పారాడి చివరకు శనివారం ఉదయం అనూష తుదిశ్వాస విడిచింది. కేసు నమోదు చేసిన అరండల్‌పేట పోలీసులు నిందితులు మానుకొండ సాయి, మస్తాన్‌వలిలను గత సోమవారమే ఆరెస్టు చేసి నిర్భయ చట్ట ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనూష మృతదేహాన్ని పలువురు నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
Advertisement
Advertisement