
ఏపీ ప్యాకేజీ ఏటా ఇంతేనా?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల్లో భాగమైన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ వాస్తవ రూపంలోకి వచ్చేసరికి నిరాశనే మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు బుందేల్‌ఖండ్, కేబీకే తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కేంద్రం అమలుచేస్తుందని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రకటించిన ప్యాకేజీని పరిశీలిస్తే ఈ ప్యాకేజీ కింద మొత్తంగా వచ్చేది తక్కువేనని అర్థమవుతోంది.
దేశంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతమైన ఒడిశాలోని కలహండి-బొలంగీర్-కోరాపుట్ (కేబీకే) ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని మంజూరు చేసింది. 2002-03 ఆర్థిక సంవత్సరం నుంచి 2009-10 ఆర్థిక సంవత్సరం వరకు.. ఎనిమిదేళ్లలో రూ.1,590 కోట్లు మంజూరు చేసి, ఏటా సగటున రూ.200 కోట్లు విడుదల చేసింది. తరువాత మరో ఎనిమిదేళ్లు.. 2017 వరకు రూ.4,550 కోట్లు ఖర్చు చేసేందుకు ఒడిశా ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక పంపినా కేంద్రం మంజూరు చేయలేదు.
బుందేల్ ఖండ్ ఇలా..
మరో వెనకబడిన ప్రాంతమైన బుందేల్‌ఖండ్.. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలు, మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల సమాహారంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి రూ. 7,266 కోట్ల అభివృద్ధి ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం 2009 నవంబరు 19న అనుమతి ఇచ్చింది. ఈ ప్యాకేజీని 2009-10 నుంచి మూడేళ్లపాటు అమలు చేయాలని నిర్ణయించింది. దీన్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.3,506 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.3,760 కోట్లు విడుదల చేసింది. 2011లో ఎంపీల కోరిక మేరకు నీటి పథకం కోసం రెండు రాష్ట్రాలకు మరో రూ.100 కోట్లు విడుదల చేసింది. మూడేళ్ల తరువాత 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కూడా అమలు చేయాలని భావించిన కేంద్రం.. ఈ ప్యాకేజీని 2017 వరకు పొడిగించింది. రూ.7,266 కోట్లకు అదనంగా 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మరో రూ.4,400 కోట్లను (బీఆర్‌జీఎఫ్ పథకం కింద) మంజూరు చేసేందుకు కేంద్రం ఆమోదించింది.
ఏపీకి ఎంత?
ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం ఎంత ప్యాకేజీ ఇస్తారన్న అంశాన్ని కేంద్రం ఎక్కడా ప్రస్తావించలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి మాత్రం రూ.350 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రం మాత్రం వచ్చే ఐదేళ్లలో రూ.24,350 కోట్లు మంజూరు చేయాలని ప్రణాళిక పంపింది. కానీ ఇప్పుడు మంజూరు చేసింది కనీసం దాన్లో రెండుశాతం కూడా కాదు. ఒకవేళ ఏటా ఇంతే మొత్తంలో ఇస్తే మొత్తం ఐదేళ్లలో రూ.1,750 కోట్లు మాత్రమే అవుతుంది. ఒకవేళ ఆ తరువాత ఐదేళ్లు పొడిగించినా మరో రూ.1,750 కోట్లు అవుతుంది. ఇవి రాయలసీమ, ఉత్తరాంధ్రల దుస్థితులను ఏమాత్రం మార్చలేవు. వాటి దయనీయతకు ఇది కంటితుడుపే.