జిల్లాకు రూ.50 కోట్లు మంజూరు
కలగా మిగిలిపోయిన ప్రత్యేక ప్యాకేజీ
బుందేల్ ఖండ్ తరహా సాయం లేనట్టేనా?
విజయనగరం : వెనుకబడిన ప్రాంతంగా ఉత్తరాంధ్రను కేంద్ర ప్రభుత్వం గుర్తించినప్పటికీ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదు. తాజాగా ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి నిధుల కేటాయింపు చూస్తుంటే అందుకు అవుననే అభిప్రాయం కలుగుతోంది. రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒక్కొక్కదానికి రూ.50 కోట్లు చొప్పున కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. అయితే, ఈ తరహా నిధులెన్నేళ్లు ఇస్తుందో స్పష్టం చేయలేదు. కొత్త పరిశ్రమలకు మాత్రం 15 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తామని తెలిపింది. ఐదేళ్లలో పరిశ్రమలెప్పుడు ఏర్పాటు చేసినా..ఈ రాయితీ వర్తించనుంది. బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఏటా రూ. 500 కోట్లు వస్తాయనుకుంటే ఇప్పుడేమో ప్రత్యేక నిధులని రూ.50 కోట్లతో సరిపెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ విధంగానైనా వెనుకబడిన జిల్లా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశించారు. బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ అమలైతే జిల్లాకు ఏటా రూ.500 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు వచ్చే అవకాశం ఉందని అప్పట్లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆ నిధులతో సాగునీరు, తాగునీరు సదుపాయాలు మెరుగుపర్చుకోవడమే కాకుండా జిల్లా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉపయోగపడతాయని అంచనా వేశారు. అయితే, ఆ ఆశలపై నీళ్లు జల్లినట్టుగా రాష్ట్రానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీతో, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులతో సరిపెడుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒక్కొక్క దానికి 2014-15కింద రూ.50చొప్పున మంజూరు చేసినట్టు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇలా ఎన్నాళ్లు ఇస్తారో కూడా స్పష్టంగా పేర్కొనలేదు. వెనుకబడిన జిల్లా అయిన విజయనగరం జిల్లాకు సంవత్సరానికే రూ.500కోట్లుచొప్పున ఐదేళ్లు వస్తాయనుకుంటే ప్రత్యేక నిధుల పేరుతో కేవలం రూ.50కోట్లుతో కేంద్రం చేతులు దులుపుకోవడం జిల్లా ప్రజలకు మింగుడు పడడం లేదు.
ఇదే తరహాలో ఐదేళ్లు పాటు ఇచ్చినా రూ.250కోట్లు దాటవు. జిల్లా అభివృద్ధికి ఎటూ సరిపోవు. ఇప్పటికే నిధుల్లేమి, లోటు బడ్జెట్‌ను కారణంగా చూపి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. ప్రత్యేక ప్యాకేజీ నిధులతోనైనా గట్టెక్కుతామనుకుంటే కేంద్రం ప్రత్యేక నిధుల పేరుతో సరిపెట్టి ఆశలు అడియాసలు చేస్తోంది. భవిష్యత్‌లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే చెప్పలేం గాని లేదంటే ప్రత్యేక నిధులతో జిల్లా ముందుకెళ్లే అవకాశం లేదు.
ప్రత్యేక నిధులతో సరి !
Published Thu, Feb 5 2015 3:04 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement