ప్యాకేజీ కాదు డ్యామేజీ
కొత్తగా ఒరిగింది లేదు... నష్టమే జరిగింది....
జెట్లీ ప్రకటనలో ప్యాకేజీ అన్న పదమే లేదు..
విభజన చట్టంలో హామీలనే వల్లెవేశారు..
చట్టబద్ధంగా ఇవ్వాల్సిన వాటికి కోత పెట్టారు..
వాటికే ప్యాకేజీ పేరు పెట్టి ప్రచారం చేస్తున్నారు..
ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చేశారు..
ఈ అన్యాయాలను చంద్రబాబు స్వాగతించారు..
హోదాకు సమానమైన ప్యాకేజీ అంటున్నారు..
ఐదుకోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు..
ఆ అన్యాయాలకేనా ఇపుడు సన్మానాలు..
నాటి విభజన నుంచి నేటి సన్మానాల వరకూ..
రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకునేందుకు గాను ఆనాడు విభజన చట్టంలో అనేక హామీలిచ్చారు. వాటితోపాటు ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా అమలు చేస్తామని నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పార్లమెంటు సాక్షిగా మాట ఇచ్చారు. మేం అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా అమలు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. ప్రత్యేకహోదా పదిహేనేళ్లపాటు ఉంటేనే పరిశ్రమలు నిలదొక్కుకుంటాయని, ఫలాలు అందుతాయని చంద్రబాబు ఎన్నికల సభల్లో హోరెత్తించారు.
తెలుగుదేశం, బీజేపీలు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచాయి. విభజన చట్టంలో హామీల అమలు నత్తనడకన సాగుతోంది. ప్రత్యేకహోదాపై అనేక రకాల నాటకాలాడుతూ వచ్చారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పోరాటాల దరిమిలా ఈ అంశం ఇప్పటికీ సజీవంగా నిలిచింది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై విచారించాల్సిందిగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబునాయుడు అకస్మాత్తుగా తెరపైకి తెచ్చారు. హోదా సాధించడం కోసం లాబీ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రులు కలర్ ఇచ్చారు.
చివరకు చంద్రబాబు ఆమోదించిన స్క్రిప్ట్‌ను యథాతథంగా అరుణ్ జైట్లీ అర్ధరాత్రి ప్రకటించారు. విభజన చట్టంలోని హామీలకు కోతలు వేస్తూ జైట్లీ ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చివేశారు. అయినా జైట్లీ ప్రకటనను అదే అర్ధరాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. జైట్లీ కొత్తగా ప్రకటించిన సహాయమేమీ లేకపోయినా.. ఇవ్వాల్సిన వాటికి కోతవేస్తూ ప్రత్యేకహోదాను ఎగ్గొట్టినా మనకు ఏదో గొప్ప ప్యాకేజీ వచ్చేసినట్లు చంద్రబాబు, వెంకయ్య అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. పైగా ప్యాకేజీ సాధించారన్న పేరుతో వెంకయ్యనాయుడుకు ఊరూరా సన్మానాలు జరిపిస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందా..? కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనలో అసలు ఏం ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించేలా మన రాష్ట్రానికి ఏం ఒరిగింది? విభజన వల్ల సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిలబడ్డ ఆంధ్రప్రదేశ్‌కి అప్పటి కేంద్రప్రభుత్వం ఇస్తానన్నవేమిటి? ఇప్పటి ప్రభుత్వం ఇస్తున్నదేమిటి? విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి అనేక సహాయాలు అందాల్సి ఉంది.
వాటితో పాటు పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ‘ప్రత్యేక హోదా’ కూడా దక్కాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం తెగేసి చెప్పేసింది.. విభజన చట్టం ప్రకారం తప్పనిసరిగా అందించాల్సిన సాయాలకు కోతపడింది. కోత కోసి అరకొరగా ఇస్తున్న ఆ సాయాలన్నీ కలిపి ‘ప్రత్యేక ప్యాకేజీ’ వచ్చేసిందంటూ ప్రచారం హోరెత్తిపోతోంది.. ఇంత అన్యాయం జరుగుతున్నా ఆహా..ఓహో అంటూ చంద్రబాబు స్వాగతిస్తున్నారు.. కేంద్రంతో కలిసి ఐదుకోట్లమంది ఆంధ్రులకు వెన్నుపోటు పొడుస్తున్నారు.. అసలు ప్యాకేజీయే లేకపోయినా అదేదో ఉన్నట్లు.. అది హోదా కన్నా మెరుగైనదన్నట్లు చంద్రయ్యలు.. వెంకయ్యలు జోరుగా ప్రచారం చేస్తున్నారు... సన్మానాలు చేయించుకుంటున్నారు... చట్టబద్ధంగా అందించాల్సిన సాయాలకు కోతవేసి.. దానికి ప్యాకేజీ పేరుపెట్టి.. ప్రత్యేక హోదా ఎగ్గొట్టి.. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.
విభజన చట్టం హామీలకు కోతలిలా...
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా సహాయం చేస్తోందంటూ.. సెప్టెంబర్ 7న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశంలో ఘనంగా ప్రకటన చేశారు. దానిని ఒక నోట్ రూపంలో 8న పీఐబీ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేశారు. అందులోని అంశాలను పరిశీలిస్తే... కొత్తగా మనకు ఏమీ దక్కలేదని... విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన వాటిని కూడా కోత కోశారని అర్ధమౌతుంది...
1.) విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు 2014-15లో ఏర్పడే రెవెన్యూ లోటును పూర్తిగా భర్తీ చేస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఆ మేరకు కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. జూన్ 2, 2014 నుంచి మార్చి 31, 2015 నాటికి రూ.16,078.67 కోట్లు రెవెన్యూ లోటు ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. వీటిని పరిశీలించిన నీతి ఆయోగ్ కేవలం రూ.7505 కోట్లు మాత్రమే రెవెన్యూ లోటుగా ఉన్నదని తేల్చి.. రూ.3,979.50 కోట్లను విడుదల చేసింది. మిగతా నిధులను రెండు మూడు విడతల్లో విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అంటే.. రూ.8,573.67 కోట్లకు కేంద్రం కోత వేసినట్లు స్పష్టమవుతోంది.
2.) నూతన రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని, అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం నిర్మించడానికి నిధులు ఇస్తామని, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు ఇస్తామని విభజన చట్టంలో పేర్కొంది. కానీ.. ఆ హామీలకు కేంద్రం కోతలు వేసింది. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇచ్చామని.. మరో రూ.వెయ్యి కోట్లను మాత్రమే ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చిచెప్పారు.
3.) వెనుకబడిన రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీని అమలు చేస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఆ మేరకు రూ.24,350 కోట్లు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కానీ వాటికి ప్రత్యేక ప్యాకేజీలో కోతలు వేశారు. ఒక్కో వెనుకబడిన జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున.. 2014-15లో రూ.350 కోట్లు, 2015-16లో రూ.350 కోట్లు విడుదల చేశామని కేంద్రం పేర్కొంది. ఆ నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు(యూసీలు) ఇస్తే 2016-17కు సంబంధించిన రూ.350 కోట్లు విడుదల చేస్తామని.. మరో రూ.1,050 కోట్లు మాత్రమే ఇస్తామని స్పష్టీకరించింది. అంటే.. బుందేల్ ఖండ్ ప్యాకేజీని కేంద్రం అటకెక్కించినట్లు స్పష్టమవుతోంది. తద్వారా రూ.22,250 కోట్లను రాష్ట్రానికి ఎగ్గొట్టింది.
4.) విభజన చట్టంలో 11 జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇప్పటికే పెట్రోలియం విశ్వవిద్యాలయం, ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, ఐఐఎం ప్రారంభించామని.. అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు, గుంటూరులో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్‌ఐడీఎంని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ భూమి ఇవ్వలేదని స్పష్టీకరించారు. కోటి జనాభా దాటిన ప్రతి రాష్ట్రంలోనూ జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని 2002లో కేంద్ర ప్రభుత్వం విధానపరమైన ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే మన రాష్ట్రంతోపాటూ కేరళ, ఛత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్, ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు జాతీయ విద్యా సంస్థలను మంజూరు చేసింది. అంతే తప్ప మనపై జాలితోనో.. మనపై ప్రత్యేకమైన శ్రద్ధతోనో కేంద్ర సంస్థలను ఉదారంగా కేటాయించలేదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
5.) దుగరాజపట్నం వద్ద నౌకాశ్రయం ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనలో కచ్చితమైన హామీ ఇవ్వలేదు. ప్రభుత్వ ప్రై వేటు భాగస్వామ్య పద్ధతిలో దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని మాత్రమే చెప్పారు. ఆర్థికంగా గిట్టుబాటు కాదని నిపుణుల కమిటీ నివేదిక ఇస్తే.. దాన్ని సాకుగా చూపి దుగరాజపట్నం పోర్టును అటకెక్కించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది.
6.) కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఆర్నెల్లలోగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) నివేదిక తెప్పించుకుని.. పరిశ్రమ పనులు మొదలు పెడతామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. అరుణ్ జైట్లీ ఈ హామీపై స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయిస్తామని మాత్రమే చెప్పారు. సాధ్యం కాదని నివేదిక ఇస్తే.. దాన్ని అడ్డుపెట్టుకుని ఉక్కు పరిశ్రమ ఏర్పాటు హామీని కూడా బుట్టదాఖలు చేయనున్నారు.
7.) రాష్ట్రంలో ఆర్నెల్లలోగా ఐవోసీ(ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) లేదా హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) యూనిట్‌ను స్థాపిస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. అరుణ్ జైట్లీ మాత్రం ఆ హామీని నిలబెట్టుకునే దిశగా హామీ ఇవ్వలేదు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాకనే ఐవోసీ లేదా హెచ్‌పీసీఎల్ యూనిట్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
8.) ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ తరహాలోనే ఆర్నెల్లలోగా చెన్నై-వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం సాధ్యాసాధ్యాలను బట్టే చెన్నై-వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ అంశాన్ని పరిశీలిస్తామని తేల్చిచెప్పారు.
9.) విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. కానీ.. ప్రత్యేక ప్యాకేజీలో అంతర్జాతీయ స్థాయి అన్న ఊసే లేదు. విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు చేపట్టామని, తిరుపతి విమానాశ్రయాన్ని విస్తరిస్తామని, విశాఖపట్నం విమానాశ్రయంలో రాత్రిపూట విమానాలు రాకపోకలు సాగించే సదుపాయం కల్పించామని, విమానాశ్రయాన్ని విస్తరించడానికి భోగాపురంలో భూమిని గుర్తించామని మాత్రమే తాజాగా అరుణ్ జైట్లీ ప్రకటించారు.
10.) రాష్ట్రం ఏర్పాటైన ఆర్నెల్లలోగా ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. రైల్వే జోన్ ఏర్పాటుపై అరుణ్ జైట్లీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఆ అంశాన్ని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పరిశీలిస్తున్నారని మాత్రమే చెప్పారు.
11.) నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలు ప్రాజెక్టులను చేపట్టిందని పేర్కొన్న అరుణ్ జైట్లీ.. విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు-తెనాలిలో మెట్రో రైల్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తోందని చెప్పారు. కానీ.. విభజన చట్టంలో జాతీయ రహదారులు, విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని హామీ ఇచ్చారు.
12.) పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను పూర్తిగా కేంద్రం చూసుకుంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇదే విషయం స్పష్టంగా చెప్పారు. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీకి కూడా నిధులు ఇస్తామని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.36 వేలు కోట్లు ఉంటుందని అంచనా. కానీ.. కేవలం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం, కాలువల తవ్వకానికి మాత్రమే నిధులు ఇస్తామని ప్రత్యేక ప్యాకేజీలో అరుణ్ జైట్లీ తేల్చిచెప్పారు. అంటే.. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నమాట.
‘విశాఖ సమ్మిట్’తో ఒరిగింది శూన్యమే...
‘‘విశాఖపట్నంలో జరిగిన ఇండస్ట్రియల్ సమ్మిట్ సందర్భంగా 4.5 లక్షల కోట్ల విలువైన పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. తద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఏపీకి ప్రత్యేక హోదా లేకపోయినా ఇవి వచ్చాయి. హోదాకు పరిశ్రమలు రావడానికి సంబంధం లేదు...’’ అని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానిస్తుండటం పట్ల పరిశ్రమల శాఖ అధికారులు విస్తుబోతున్నారు.
‘ఈ ఒప్పందాలు ఎప్పటివో కేంద్ర మంత్రికి తెలియదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేసుకున్న ఒప్పందాలే ఇందులో మూడొంతులు ఉన్నాయి. గతంలో చేసుకున్న సంస్థలతోనే మళ్లీ ఈ సమ్మిట్‌లో ఒప్పందాలు చేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నారు. పెపైచ్చు ఈ ఒప్పందాల్లో పదిశాతం కార్యరూపం దాల్చినా గొప్పే. కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలన్నీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, దానివల్ల వందశాతం పన్నురాయితీ ప్రయోజనాలు పొందవచ్చనే ఆశతో వచ్చినవే. ఇవన్నీ తెలిసినా కేంద్ర మంత్రి ఇలా మాట్లాడటం ప్రజలను దారుణంగా మోసగించడమే’అని పరిశ్రమల శాఖ అధికారులు, పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.
కేంద్రం నుంచి మనకు రావాల్సినదెంత?
విభజన చట్టం ప్రకారం ఐదేళ్లలో రాష్ట్రానికి రావలసిన నిధులు రూ.2,08,684 అని ఒక అంచనా. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రతిపాదనల ప్రకారం చూస్తే విభజన చట్టం హామీల అమలుకు రూ. రూ. 6 లక్షల కోట్లుపైగా అవుతుంది. ఎందుకంటే అయిదేళ్లలో రాజధాని నిర్మాణం కోసం రూ. 15,175 కోట్లు కావాల్సి ఉంటుందని గణాంక అధికారులు పేర్కొనగా రాజధాని నిర్మాణం కోసం రూ. 1.2 లక్షల కోట్లు ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి అప్పట్లో ప్రతిపాదన పంపారు.
వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి రూ. 24,350 కోట్లు ఇవ్వాలని కోరారు. ఈ లెక్కన విభజన హామీలన్నిటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కోరిన మొత్తం చూస్తే రూ. 6 లక్షల కోట్లు పైమాటే. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రయోజనాలకు ఇది అదనం.
ఆ రాయితీ ఏ మూలకు?
పారిశ్రామిక యంత్రాలపై కేంద్రప్రభుత్వం 15శాతం పన్ను రాయితీని ప్రకటించడాన్నే గొప్ప విషయంగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలతో దీనిని పోల్చగలమా అని పారిశ్రామిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు మాత్రమే పన్ను రాయితీని ఇస్తామని కేంద్రం వెల్లడించింది. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాలకు ఇది వర్తించదు.
ఈ ఆరు జిల్లాల పరిస్థితి ఏమిటి? ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకొచ్చాయి. నెల్లూరు జిల్లాలో థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్రతిపాదనలున్నాయి. ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమలకు అవకాశాలున్నాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 15శాతం పన్ను రాయితీ తెలంగాణలో అన్ని జిల్లాలకూ ఇస్తున్నారు. ఇలాంటి రాయితీలు అన్ని రాష్ట్రాలకూ ఇస్తున్నవే. మనకు మాత్రం ఈ అరకొర రాయితీని కొన్ని జిల్లాలకే ఇచ్చి అన్యాయం చేస్తున్నా చంద్రబాబు ఆనందంగా స్వాగతిస్తుండడమే విశేషం.
మాటెందుకు మార్చారు బాబులూ?
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఎంత ముఖ్యమో ఈ ఇద్దరికీ బాగా తెలుసు. అయినా మాటలు మార్చారు. ఐదుకోట్ల మంది ప్రజల భావోద్వేగాలతో.. కోటిన్నరమంది నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని ఆనాడు రాజ్యసభలో డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు ఇప్పుడు రకరకాల కథలు చెబుతున్నారు. అసలు ప్యాకేజీయే లేకపోయినా అదేదో ఉన్నట్లు ప్రత్యేక హోదా కన్నా మెరుగైనదే మన రాష్ట్రానికి వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. అది కూడా తనవల్లే వచ్చినట్లుగా సన్మానాలు చేయించుకుంటున్నారు. విభజన చట్టంలోని హామీలు తప్ప ఏపీకి కొత్తగా ఒరిగిందేమీ లేకపోయినా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి విభజన చట్టం ప్రకారం మనకు దక్కాల్సిన వాటికి కూడా కేంద్రం అనేక కోతలు వేసింది...
ఇక చంద్రబాబునాయుడుది మరీ చోద్యం. ప్రత్యేక హోదా పదేళ్లు సరిపోదు.. పదిహేనేళ్లు కావాలని ఆయన ఎన్నికల సభల్లో డిమాండ్ చేశారు. నాటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదితో కలసి పాల్గొన్న సభల్లో ప్రత్యక్షంగా విజ్ఞప్తులు చేశారు.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇప్పించాలని పదేపదే కోరారు. ఎన్నికలు ముగిసాక ఆయనా మాటమార్చారు. ఒకసారి కాదు పదేపదే మాటమార్చడం చంద్రబాబు ప్రత్యేకత. అవసరాన్ని బట్టి ఆయన నాలుకను ఎలాగైనా తిప్పేయగలరు. ‘ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా’ అని వ్యాఖ్యానించిన నోటితోనే ప్రత్యేక హోదా మన జీవన్మరణ సమస్య అని కూడా అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని రాజ్యసభలో అరుణ్‌జైట్లీ ప్రకటించగానే తన రక్తం మరిగిపోయిందని ఊగిపోయిన చంద్రబాబు అర్ధరాత్రి విలేకరుల సమావేశంలో అదే అరుణ్‌జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. మాటలు మార్చడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు.
ప్రత్యేకహోదాతో వచ్చే రాయితీలవల్ల పరిశ్రమలు వెల్లువలా తరలి వస్తాయని తెలుసుకాబట్టే ఆనాడు వెంకయ్య, చంద్రబాబు హోదాకోసం అంతగా పట్టుబట్టారు. ఇవాళ హోదావల్ల ఏం ఒరుగుతుంది అని మాటమార్చి అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నారు.
ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలి
సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇచ్చితీరాలి. ప్రత్యేక హోదా పదేళ్లివ్వాలి అధ్యక్షా.. ప్రధానమంత్రి ఐదేళ్లంటున్నారు. ఐదేళ్లు అస్సలు సరిపోవు. ఒక పరిశ్రమ వచ్చి ఉత్పత్తి ప్రారంభించాలంటే, స్థిరపడాలంటే కనీసం పదేళ్లు ఉండాలి.
- రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ
సందర్భంగా వెంకయ్యనాయుడు డిమాండ్
ప్రత్యేకహోదా 15 ఏళ్లు ఇవ్వాలి
మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఐదు సంవత్సరాలే ఇచ్చారు. నరేంద్రమోడీగారిని కోరుతున్నా 15 సంవత్సరాలు ఇవ్వండి. ఒక పరిశ్రమ రావాలంటే రెండుమూడేళ్లు పడుతుంది. అది ప్రారంభమయ్యేలోపల ప్రత్యేక హోదా పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతున్నా
- తిరుపతిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో
నరేంద్రమోడీకి చంద్రబాబు విజ్ఞప్తి
పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీ ‘హోదా’!
ఫిబ్రవరి 20, 2014న నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు రాజ్యసభలో హామీ ఇచ్చారు. కానీ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని అరుణ్ జైట్లీ తేల్చిచెప్పారు. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో ఇచ్చినట్లుగానే 2019-20 వరకూ ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి ప్రత్యేక సహాయం చేస్తామని చెప్పారు. విదేశీ రుణ సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సహకరిస్తుందని పేర్కొన్నారు. ఏ మేరకు నిధులు ఇస్తామన్నది మాత్రం చెప్పకపోవడం గమనార్హం.